ఇడుపుల పాయకు సోనియా, రాహుల్.. షర్మిల పార్టీ విలీనం ఖాయమేనా?
posted on Jul 3, 2023 6:41AM
పర్యవశానాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత రేంజిలో రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ఇంకా చెప్పాలంటే గత తొమ్మిదేళ్లుగా నిస్తేజంగా కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిలించి పంజా విసిరేందుకు సిద్ధమైన సింహంగా కనిపిస్తోంది. కర్ణాటకలో ఫలితాలకు అంతకు ముందే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ఆ పార్టీలో వచ్చిన కదలిక తోడై కాంగ్రెస్ కోటలో మళ్ళీ అధికారంపై ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా ప్రజలలో కూడా ఈ పార్టీ పట్ల ఆసక్తి, ఆదరణ కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా పరిస్థితికి అనుకూలంగా కొత్త కొత్త ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారు. అందుకోసం పాత మిత్రులను, కలిసి వచ్చే శత్రువులను సైతం కలుపుకొని వెళ్లేందుకు సై అంటున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో తమ నేతల మధ్య వైరాన్ని రూపుమాపి స్నేహాన్ని పెంచేలా చర్యలు మొదలు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగురాష్ట్రాల పార్టీ వ్యవహారాలను స్వయంగా పార్టీ అగ్రనాయకత్వమే పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2024 సాధారణ ఎన్నికల ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడి ఫలితాల ప్రభావం దేశమంతా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకులను, కేసీఆర్ శత్రువులను ఇంకా కలిసి వచ్చే వారిని కలుపుకు పోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే భారీగా చేరికలు మొదలు కాగా, పాత కాంగ్రెస్ నేతలను కూడా మళ్ళీ వెనక్కి వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవాలంటే సామాన్య విషయం కాదు. అందుకే అధిష్టానం ఒక ప్రయత్నంగా వైఎస్ కుటుంబాన్నే ప్రయోగించాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఈ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది.
కాగా, ఇప్పుడు ఈ వ్యవహారంపై ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ తో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడిపారు. షర్మిలను ఆయన రాష్ట్రం కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారనీ ప్రచారం జరిగింది. కాగా, ఇప్పుడు ఏకంగా సోనియా, రాహుల్ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మతో సంప్రదింపులు జరపనున్నారని ప్రచారం మొదలైంది. ఇందు కోసం వేదిక కూడా ఖరారైంది. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆ రోజున సోనియా, రాహుల్ గాంధీ కడప జిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారు. అక్కడి వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించనున్నారు. ఇక్కడే వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది.
సోనియా, రాహుల్ పర్యటనకు సంబంధించి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇడుపులపాయకు వచ్చి ఏర్పాట్లు పరిశీలించి వెళ్లారని.. సెక్యూరిటీ టీం క్లియరెన్స్ ఇస్తే సోనియా రాక ఖాయం కానున్నట్లు తెలుస్తున్నది. ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు గుణాత్మకంగా మారతాయనడంలో సందేహం లేదు. వైఎస్ ఉన్నంత కాలం ఈ కుటుంబంతో సోనియా, రాహుల్ కు మంచి అనుబంధం ఉండేది. జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించిన తర్వాత వ్యవహారం చెడింది. అయితే, ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా విడిపోయింది. తల్లి విజయమ్మ పూర్తిగా కుమారుడు జగన్ కు దూరంగా ఉంటూ కుమార్తె షర్మిలకు అండగా ఉంటున్నారు.. ఈ మధ్య షర్మిల పార్టీ వ్యవహారాలలో కూడా విజయమ్మ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా, రాహుల్ స్వయంగా ఏపీకి వచ్చి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.