ఖమ్మంలో జన గర్జనతో కాంగ్రెస్ఎ న్నికలకు శంఖారావం!
posted on Jul 1, 2023 @ 4:41PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో ఊపు మీదుంది. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు జవసత్వాలు మొదలవగా తెలంగాణలో సాధారణ ఎన్నికల కంటే ముందే ఎన్నికలు జరగనుండడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చింది. దీంతో ఎలాగైనా తెలంగాణలో తమ సత్తా చాటి దేశంలో తన ఛరిస్మాను చాటుకోవాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణపైనే స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భావిస్తున్న నేతలను కూడా తనలో కలుపుకుంటున్న కాంగ్రెస్.. మరికొందరు ఇతర పార్టీల నేతలకు కూడా గాలం వేస్తుంది. ఈ క్రమంలోనే మరింతగా తన పూర్వపు వైభవాన్ని చాటేలా ఒక బహిరంగ సభను ప్లాన్ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ సభకు సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణ జన గర్జన పేరుతో నిర్వహించనున్న ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ఈ సభా వేదికగా పొంగులేటితో పాటు పలువురు కాంగ్రెస్ జెండా కప్పుకొని అధికారంగా కాంగ్రెస్ నేతలు కానున్నారు. మరో వైపు భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఇక్కడే ముగుస్తుంది. హై కమాండ్ ఆదేశంతోనే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టి..108 రోజులు 1250 కిలోమీటర్ల లక్ష్యంగా ప్రజలతో మమేకమై నడిచారు. జులై 2న ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడంతో ఆయన పాదయాత్ర ముగుస్తుంది. ఒక వైపు పొంగులేటి అధికారిక చేరిక, మరొకవైపు భట్టీ పాదయాత్ర ముగింపునకు రాహుల్ గాంధీ హాజరు కానుండడం తదితర కారణాలతో ఈ సభ ఆసక్తిగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అతి పెద్ద బహిరంగ సభ ఇదే కాగా ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ బ్యాక్ టూ ఫామ్ అని ప్రజలకు, ఇతర పార్టీలకు తెలిసేలా చేయాలని కంకణం కట్టుకుంది. అందుకోసం ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వగా ఈ సభకు కాంగ్రెస్ భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నది. ఇక ఈ సభలో మాటలు కూడా ఘాటు పెరగడం ఖాయం. ఒక రకంగా ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నది. ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఖమ్మం సభ విజయవంతం చేయటం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవటంతో పాటు, త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించటం ద్వారా బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి గట్టి సవాల్ విసిరాలని భావిస్తోంది. ఈ ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇదే సభ నుండి బీఆర్ఎస్, బీజేపీలకు ఒకేసారి అటాక్ చేయాల్సి ఉండగా.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్నది చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఈ సభలో రాహుల్ గాంధీ స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
ఒకరకంగా ఈ సభ విజయవంతం చేయడమే కాంగ్రెస్ పార్టీకి మొదటి సక్సెస్ కానుంది. ఎందుకంటే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత కరవై ప్రజలలో పలుచన అయ్యారు. ఇప్పుడు తామంతా ఒక్కటే అనే సంకేతాలు ప్రజలలోకి పంపాలి. నిజానికి భట్టి తన పాదయాత్ర ముగింపును ఓ స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. వైఎస్ మహాప్రస్థానం మాదిరి ముగింపు సభను నిర్వహించాలనుకున్నారు. అయితే, అదే రోజున పొంగులేటి చేరిక బహిరంగ సభ కూడా ఉండడంతో రాహుల్ గాంధీ రెండూ వేర్వేరుగా కాకుండా కలిపే ప్లాన్ చేయాలని సూచించారు. ఇందుకు భట్టిని ఒప్పించే బాధ్యతను ఠాక్రే భుజానికెత్తుకుని పొంగులేటిని కూడా భట్టి వద్దకు తీసుకెళ్ళి ఒప్పించారు. దీంతో ఇలా ఒకే సభతో కాంగ్రెస్ ఒక్కటిగా ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. మరి ఈ సభ ఎలాంటి రాజకీయ కదలికలు తెస్తుందో చూడాలి.