మరోసారి ఢిల్లీకి జగన్.. రెండు రోజుల మకాం వెనక మతలబేంటి?
posted on Jul 3, 2023 6:23AM
సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. 5వ తేదీ రాత్రికి మోడీ, అమిత్ షాతో సీఎం భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోండగా.. ఆలస్యం అయితే 6వ తేదీ సమావేశం కానున్నారు. వీరితో పాటు ఢిల్లీలో మరికొందరు పెద్దలతో కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు, వైసీపీ నేతలు ఈ భేటీ గురించి ప్రచారం కూడా మొదలు పెట్టారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, పోలవరం అడహక్ నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ కేంద్రం వద్దకు వెళ్తున్నారని చెప్తున్నారు.
అయితే, ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు నుండే సీఎం జగన్ బీజేపీతో సఖ్యత పెంచుకున్నారు. ఇక సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు కేంద్రంలో తన అవసరం ఉన్నా లేకపోయినా.. బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇచ్చారు. అయితే, అప్పుడు పరిస్థితి వేరు. ఇది ఎన్నికల సమయం. ఎవరికి వారికి ఇప్పుడు సొంత ఎజెండా తప్పదు. దీంతో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వానికి నొప్పి కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయని బీజేపీ పెద్దలు ఈ మధ్య టోన్ మార్చారు.
తాజాగా ఏపీకి వచ్చిన అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో అన్నీ అక్రమాలే అంటూ దుయ్యబెట్టారు. జగన్ ప్రభుత్వంపై అమిత్ షా ఘాటు విమర్శల అనంతరం ఇప్పుడు తొలిసారి సీఎం జగన్ అమిత్ షా వద్దకు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయి కూడా చాలా కాలం అయింది. ఆ మధ్య ఒకసారి కలుస్తారని ప్రచారం జరిగినా ఎందుకో అప్పుడు అది కుదరలేదు. మోడీ సైతం జూలైలో ఏపీకి వస్తారని, ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి కలయిక మీద చాలానే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో జగన్ ప్రధానితో భేటీ కావడాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగానే చూడాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీ రాజకీయాలలో ఎన్నికల హీట్ ఎప్పుడో మొదలైంది. ఒక వైపు వైసీపీ వై నాట్ 175 అంటూ తన సంక్షేమం మీదనే ఆశలు పెట్టుకొని జగన్ బ్రాండ్ ఉపయోగించుకుని మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతుండగా.. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సీఎంగా జగన్ చేసిన అప్పులు,తప్పులు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్షాలు ఇప్పటికే వార్ మొదలు పెట్టాయి. మరో వైపు రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులపై కూడా తీవ్ర ప్రచారం జరుగుతున్నది. టీడీపీ-జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారైందనీ, బీజేపీ కూడా కలిసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ఒంటరైతే విజయానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అత్యవసరంగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ బెయిల్ మీద ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా కదలిక మొదలైంది. దీంతో ఎన్నికల ముందు ఈ రెండు కేసులు వైసీపీకి తలపోటుగా మారనున్నాయనే ఊహాగానాలు కూడా మొదలవగా.. ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరనుండడం పలు ఊహాగానాలకు తావిస్తుంది. మరి ఈ రెండు రోజుల పర్యటన వెనుక మతలబేంటో.. ప్రధాని, అమిత్ షాలతో భేటీ వెనుక ఆంతర్యమేమిటో అన్నచర్చ జోరుగా సాగుతోంది.