మీరేం ఉద్ధరించారని.. ముద్రగడకు ఘాటు లేఖ!

ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలలో తీవ్రంగా వినిపిస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం. ఈ పేరు చాలా కాలంగా ఏపీ రాజకీయాలలో వినిపిస్తున్నా.. అప్పుడప్పుడు తళుక్కున మెరిసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో కానీ ఫోకస్ లోకి రాకపోవడం ఈయన నైజం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు కూడా రిజర్వేషన్ కావాలని ముద్రగడ ఓ ఉద్యమం లేవనెత్తారు. మరీ తెలంగాణ ఉద్యమం అంత కాకపోయినా అప్పట్లో ఈ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. ఆ సమయంలో రాజకీయంగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైళ్లు తగలబడ్డాయి.. మరికొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఇదంతా ఒక్క ముద్రగడ లేవనెత్తిన ఉద్యమం వలన మాత్రమే కాదు. కాపులలో సామాజికంగా, ఆర్ధికంగా, రిజర్వేషన్ పరంగా ఉన్న అసమానతల కారణంగా ముద్రగడ ఎత్తుకున్న ఉద్యమం వారికి ఆసరాగా దొరికింది.

 అయితే, ముద్రగడ ఉద్యమంతో ఏం సాధించారు? ఆయన అన్నట్లే కాపులకు  రిజర్వేషన్ తెచ్చారా? రిజర్వేషన్ రాకుండానే ముద్రగడ ఎందుకు సైలెంట్ అయ్యారు? అసలు ముద్రగడ అనే వ్యక్తి కాపు సామజిక వర్గానికి రిజర్వేషన్ కోసమే ఉద్యమం చేశారా? లేక  హిడెన్ అజెండా ఏదైనా ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో ఉద్యమాన్ని ఓ స్థాయిలో నడిపించిన ముద్రగడ ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర మొదలు పెట్టాక మాత్రమే బయటకొచ్చారు. అది కూడా ఫక్తు వైసీపీ వాదిగా.. కేవలం పవన్ ను విమర్శిస్తూ లేఖలను రాయడానికి మాత్రమే కనిపిస్తున్నారు. 

దీంతో అసలు ముద్రగడ నిజ స్వరూపం ఏంటన్నది ప్రజలకు అర్ధం అవుతుంది. అసలు అప్పుడు ముద్రగడ అనే వ్యక్తిని చూసి మాత్రమే అతన్ని కాపు సామజిక వర్గం ఒక బ్రాండ్ గా భావించలేదు. నిజానికి ఆయన్ను మించి ఆయన కుటుంబానికి దక్కిన గౌరవం అది. ముద్రగడ కుటుంబం ఏంటి? ఆయనను కాపు సామజిక వర్గం ఎందుకు ఒక ఐకాన్ గా భావిస్తుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ముద్రగడ పద్మనాభం తాత పద్మనాభం సుమారు 700 ఎకరాల భూస్వామి, కిర్లంపూడి చుట్టుప్రక్కల 10, 12 గ్రామాలకు మునసుబుగా ఉన్నారు. పద్మబనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరరాఘవరావు మంచికి మారు పేరుగా జీవించారు. అందుకే అప్పట్లోనే తండ్రి పద్మనాభం ఆస్థి 700 ఎకరాల నుండి 300 ఎకరాలకు తగ్గింది. ఆయన నిజాయతీ, మంచితనానికి మెచ్చి ఆ ప్రాంతంలో చాలామందికి పిల్లల పేర్లు ఆయన పేరు కలిసేలా పెట్టుకున్నారు. ఆ తర్వాత పద్మనాభం హయం వచ్చేసరికి అది కాస్త 7,8 ఎకరాలు మాత్రమే మిగిలింది. 

ఇక, ఇప్పుడున్న పద్మనాభం విషయానికి వస్తే తాత, తండ్రికి పూర్తిగా విరుద్ధం. సొంత సామాజికవర్గంలో చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకోవాలని తాపత్రయంపడుతున్న వ్యక్తిగా మాత్రమే కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన సహచరుడు, మిత్రుడు, ఆయనను దగ్గరగా చూసిన సలాది వెంకటరమణ అనే నేత ఘాటు లేఖ రాశారు. గౌరవనీయులైన మద్రగడ పద్మనాభం అంటూనే ముద్రగడ శైలిని తూర్పార పట్టారు. ఆయన రాసిన రేఖను యధాతదంగా చూస్తే.. అమలాపురం నుండి మీతో సుమారు 15 సంవత్సరాలుగా మిమ్ముల్ని అనుసరిస్తూ మీరు తీసుకొనే ప్రతి నిర్ణయంలో మిమ్మల్నే అనుసరించే సలాది వెంకటరమణ సమస్కరిస్తూ వ్రాయునది అంటూ లేఖను మొదలు పెట్టారు.

 ఈ లేఖలో 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ముద్రగడ గెలిచి అసెంబ్లీకి వచ్చిన రోజున ఫోటో దిగిన రోజున జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోలో పీవీఎస్ రామారావు, పడాల అమ్మిరెడ్డి, పంఠంశెట్టి సత్తిరాజు, ఎమ్మీఎస్ సుబ్బరాజు, బిరుదా ఫకీర్‌రావు కూడా జనతాపార్టీ ఎమ్మెల్యేలుగా ఆ ఫోటోలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో 1978లో మీతో పాటు తొలి సారిగా అసెంబ్లీకి వచ్చిన Y.S.రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు,  వెంకయ్యనాయుడు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారు?.. వారి కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వారు వారి కులాల వారి ద్వారా ఏ స్థాయి అభివృద్దిలో ఉన్నారు. ఒక సారి మీరు ఆలోచించండి అంటూ లేఖలో చురకలు వేశారు.

మీ కుటుంబం మిగిల్చిన కాకినాడలో కళ్యాణ మండపం, కిర్లంపూడిలో పాత సినిమా ధియేటర్‌ ఆస్థితో రాజకీయ జీవితం ప్రారంభించిన మీరు ఏ స్థాయికి ఎదిగారు? మీరు ఉద్యమం చేసిన కాపులను ఏ స్థాయికి ఉన్నతులుగా చేసారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు కులాన్ని మీరు మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం.. ఆ తర్వాత ఆపివేయడం.. మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వారికి పోలీసులు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం, ఇతర కులాలు అందరూ ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్లడం మీరు కాపు కులానికి చేసిన మేలు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం చేసే సమయంలో బోనం వెంకటచలమయ్య(BVC కాలేజ్‌ అధినేత) ఒరే రమణా ఎందుకురా ఈబిసి రిజర్వేషన్లు, వీటి కోసం ఆందోళనలు తద్వారా యువకులను ప్రక్కదారి పట్టించడం మన జాతిలో యువతీ యువకులు చక్కగా చదువుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళితే ఏ రిజర్వేషన్లు అక్కర్లేకుండా సామాన్యుడు కూడా లక్షాధికారులు అవుతారు కదా అందుకే ఈ కాలేజ్‌లు నిర్మిస్తున్నాను అన్నారు.

ఆనాడు ఆయన అన్న ఆ మాటల పరమార్ధం ఏమిటో నేను ఈ రోజు చూస్తున్నాను. మా ప్రాంతంలో సాధారణ రైతులు రైతు కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు పిల్లలు ఎంతో ఉన్నత స్ధితిలోకి దేశ విదేశాల్లో స్ధిరపడియున్నారు. ఇటువంటి విజన్‌తో మీరు ఎందుకు ఆలోచించ లేదో నాకు అర్ధం కావడం లేదు. నిజంగా కాపు సామాజికవర్గం బాగు కోరుకొనే వారైతే ఈ విధంగా ఆలోచన చేసి ఉంటే బాగుండేది. అప్పట్లో చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు లాంటి ఎందరో పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ఎందరో మీ వద్దకు వచ్చి సంఫీుభావం తెలిపినా మీరు వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకో మీకు ఇగో ఫీలింగ్‌. మీరు చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన 5వ రోజున చిరంజీవి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్తే.. ఆయన ఎంతో సాధరంగా ఆహ్వానించి మీతో ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కానీ, మీరు ఈ మధ్య లేఖలో మీరు మెగా కుటుంబం కులానికి ఏమి చేసింది అని అడుగుతున్నారు. 

ఇకపోతే 1978 నుండి మీ వ్యక్తిగత రాజకీయ విధానాలను చూస్తే 1983  వరకు జనతా పార్టీలో ఉండి 6 మాసాలు ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరారు. 1983 ఎమ్మెల్యేగా గెలిచిన మిమ్మల్ని డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌గా నియమించగా మీరు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చేశారు. తదుపరి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం జరిగితే మీరు ఎన్టీఆర్ కు మద్దతుగా 1985లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని మొదటి క్యాబినేట్‌లో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా నియమించారు. 1986లో విజయవాడ సిటిబస్‌లు వ్యవహారంలో మీరు కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడికి వచ్చేశారు. ఆ తర్వాత పెద్దలు వచ్చి మిమ్మల్ని శాంతింపజేసి మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌ వద్దకు తీసుకుని వెళితే.. అప్పుడు మిమ్మల్ని ఎక్సైజ్‌ శాఖకు మార్చారు. 

1988లో కాపునాడు ఉద్యమం కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్యనాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య ఆధ్వర్యంలో మీరు ముఖ్య అతిధులుగా పాల్గొని విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు. అప్పుడు తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేసి తదుపరి తెలుగునాడు పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. తదుపరి రంగా హత్య అనంతరం జరిగిన 1989లో మీ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గ్రామాల్లో అన్ని వర్గాల వారు మిమ్మల్ని రోడ్డుపై చీరలు పరిచి పువ్వులు జల్లుతూ మిమ్మల్ని నడిపించేవారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీకు ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా? 

తదుపరి రాజీవ్‌గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు చెన్నారెడ్డిని తప్పించే క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కుసుమ కృష్ణమూర్తి, జనార్ధన పూజారి మీ వద్దకు సీఎం పదవి మీకే ఇస్తామని రాయబారం వస్తే మీరు తిరస్కరించి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇవ్వాలని  ప్రతిపాదించారు. ఆ కారణంగానే ఎన్‌.జనార్ధనరెడ్డి క్యాబినేట్‌లో మీకు స్థానం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. తదుపరి నేదురుమల్లి జనార్ధనరెడ్డిని తప్పించి కె.విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రి చేసిన క్యాబినేట్‌లో కూడా మీకు మంత్రి పదవి దక్కలేదు. అప్పుడు మీకు కోపం పెరిగిపోయి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వేరే వారి పేరు చెబుతారు. మీకు మంత్రి పదవి ఇవ్వకుంటే కోపంతో రగిలిపోతారు. లాబీయింగ్‌ ఎవరైనా చేస్తామంటే వద్దంటారు. ఆ కోపంలో నుండి వచ్చినదే ఈ కాపు బిసి రిజర్వేషన్ల ఉద్యమం, దాని నిమిత్తం మీరు అమలాపురం వచ్చారు. 

1994లో జరిగిన ఎన్నికలలో ప్రత్తిపాడులో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తే మిమ్మల్ని ఇతర వర్గాల ప్రజలు తిరస్కరించారు. వెంటనే మీరు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. వైట్‌ అండ్‌ వైట్‌ తప్ప ఖాకి కలర్‌ ప్యాంటు, వైట్‌ షర్టుతో ఎరగని మాకు అలా చూసే అదృష్టం కూడా మాకు కల్పించారు. ఆ తర్వాత అనకాపల్లి నుండి బిజేపి పార్టీ మిమ్మల్ని ఎంపిగా పోటీ చేయమంటే వద్దు అని చెప్పి కృష్ణంరాజును నిలబెట్టి మీరు అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆయనను గెలిపిస్తే ఆయన వద్దకు మీరు వెళ్ళేటప్పటికి ఆయన కుర్చీలో కూర్చుని మిమ్మల్ని ప్రక్క కుర్చిలో కుర్చోండి అన్నారని, లేచి నిలబడలేదని మీకు కోపం వచ్చి యధావిధిగా ఎప్పటిలాగే మీరు బిజేపికి రాజీనామా చేశారు. తర్వాత 1999లో బొడ్డు భాస్కర రామారావు, జిఎంసి బాలయోగి వచ్చి టీడీపీలో చేరి కాకినాడ ఎంపిగా పోటీ చేయించడం.. అప్పుడు మీరు గెలవడం జరిగింది. కానీ, 2004లో యధావిధిగా టిడిపికి రాజీనామా చేసి ప్రతిపాడులో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆటో గుర్తుపై పోటీ చేస్తే 6 వేల ఓట్లు వచ్చాయి.

 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి గోదావరి జిల్లాలకు మిమ్మల్ని నాయకత్వం వహించమని రాయబారం పంపితే రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్ళి పిఠాపురం కాంగ్రెస్‌ టికెట్‌ పుచ్చుకుని పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్ధి శ్రీమతి వంగా గీత చేతిలో మూడవ అభ్యర్ధిగా ఓడిపోయారు. 2014 ఎన్నికలకు మీరు హాలీ డే ప్రకటించి.. 2016లో చంద్రబాబు కాపు కులానికి రిజర్వేషన్‌ కల్పిస్తానని హామి ఇచ్చి ఇంకా చేయలేదని ఈ లేఖలు వ్రాయడం మొదలు పెట్టారు. మీ ఒత్తిడి వల్ల మేమందరం మీ వెనుక వస్తే.. తుని సభను విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాల నుండి మీకు మద్దతుగా వస్తే.. ఒక్క నాయకుడుని కూడా ప్రసంగించనీయకుండా సభకు వచ్చిన అశేష జనవాహిణిని రోడ్డు రోకోకు, రైలు రోకోకు తరలించడం ఎంతవరకు సమంజసం?. ఆ సంఘటన ద్వారా అన్ని జిల్లాలోని పోలీసులు సభకు వెళ్ళిన వారి వివరాలు తీసుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఎందరో యువకుల్ని, మాలాంటి నాయకుల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. అయినా సహించి మీరు కంచాలు బాదమంటే ఇంటిళ్ళపాది పిల్లజల్ల, ముసలి ముతక అందరం కంచాలు బాదారు. 

ఈ ఉద్యమంలో మీరు నిస్వార్ధంగా మా కోసం మీ కుటుంబాన్ని ఫణంగా పెట్టి పోరాడుతున్నారని మేము గుడ్డిగా నమ్మి.. ఈ ఉద్యమంలో రహస్య అజెండా ఉందని అనుమానించలేదు. ప్రస్తుతం జనసేన వారాహి యాత్ర ద్వారా మీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు ప్రపంచానికి మీరే స్వయంగా చాటి చెప్పారు. చౌకబారు సహాయాల్లో కూడా అందరి వద్ద మీరు ఇలా చేతులు చాచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. నా వద్దకు ఎందరో యువకులు వచ్చి మిమ్మల్ని నానా మాటలు అంటుంటే నేను భరించలేక నేను సూచన చేస్తున్నాను. ఇప్పటికైనా మీ వయస్సు రీత్యా, మీ భార్య ఆరోగ్య రీత్యా మీరు ఏ విధమైన టెన్షన్లు లేకుండా ఏ వివాదాలకు తావు లేకుండా వ్యవహరించి మీ అబ్బాయికైనా మంచి భవిష్యత్‌ను ఏర్పాటు చేయండి.

 పద్మనాభం గారు మనతరం వేరు, ఇప్పటి యువతరం వేరు, మీరు ఎంతో ఉన్నత కుటుంబం అని పొగిడిన రెడ్డి గారి తాతను, తండ్రిని బేడీలు వేసి పోలీసులు తీసుకుని వెళ్ళడం ఉన్న ఫోటోను 24 గంటల గడవక ముందే ప్రపంచానికి చూపించారు. అది ఇప్పటి యువత ఘనత. అటువంటి యువత అంతా ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడుతున్నది. లోగడ చంద్రశేఖర్‌రెడ్డి పబ్లిక్‌ ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టి ఓడించి తీరుతాను అని చెప్పారు. మీరు అతని ఆధ్వర్యంలో ఎక్కడైనా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటివంటి పరిస్ధితులకన్నా... ఇంకా చులకన అయిపోతారు. ఇప్పుడు ఉన్నటివంటి యువతకు ఆవేశం వస్తే మనవంటి పెద్దలను కూడా లెక్కచేయరు. ఈ విషయాన్ని గమనించి మన గౌరవ మర్యాదలు మనం కాపాడుకోవడం మంచిదని భావిస్తున్నానని రాసుకొచ్చారు.

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  

తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజావాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పఫాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.   

అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?

చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు.  బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.  అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది.  జూన్ 2024లో  వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ  హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో  వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.