మద్య నిషేధం నా వల్ల కాదు.. కుండబద్దలు కొట్టేసిన పవన్
posted on Jul 1, 2023 @ 6:03PM
ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీన్ని తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒకరకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అప్పుడప్పుడు ఆయన పెళ్లిళ్లను కూడా హైలెట్ చేస్తుంటారు.
అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులూ తిట్టలేం.. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుమీదికి తీసుకురాలేం.. అవన్నీ పవన్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు.
ఎంతో భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద ఇలా నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా విమర్శించడానికి, మట్టాడడానికి ఇంకేం అంశాలు లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు.
జగన్ తాత రాజారెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాజా రెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి పారేస్తున్నారు జనసైనికులు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తున్న కొందరు విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం ఓపెన్ అయిన సంగతి గుర్తుచేస్తున్నారు. అలాగే ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారా.. మరి సీపీఎస్ రద్దు చేశారా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నారు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.