పొంగులేటికి రియల్ బాస్ ఎవరంటే?

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు  నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా తయారయ్యాయి. అలాంటి ఊహించని వాటిలో ఒకటే ఈ మధ్యనే అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి సీఎంతో భేటీ అయ్యారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి.. కాంగ్రెస్ ను విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న ఏపీ సీఎంతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. ఇప్పటికే చర్చలు సంప్రదింపు కూడా అయిపోయాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి   జగన్ తో భేటీ కావడం సహజంగానే ఆసక్తి కలిగిస్తున్నది. అసలు పొంగులేటి విషయానికి వస్తే తొలుత జగన్ వైసీపీ. వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయ్యాక టీఆర్ఎస్. ఆ తరువాత  కేసీఆర్ తో విభేదాల కారణంగా పార్టీ  నుంచి బహిష్కృతుడైన అనంతరం సుదీర్ఘ కాలం పాటు బీజేపీయా, కాంగ్రెస్సా అన్న ఊగిసలాటలో ఉన్న పొంగులేటి  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే తొలి నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు  ఉన్న పొంగులేటి రాష్ట్ర విభజన అనంతరం కూడా వైసీపీ నుండే  ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత పరిస్థితులలో వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయిపోవడంతో అప్పటికి జగన్ తో సఖ్యత, సత్సంబంధాలు  ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) లో చేరిపోయారు. అక్కడ ఇమడలేక ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వైఎస్ కుటుంబంతో సంబంధాలతోనే ఈ మధ్య పొంగులేటి షర్మిల, విజయమ్మలతో కూడా చర్చించారు. ఇప్పుడు అదే వరసలో సీఎం జగన్ తో కూడా భేటీ అయ్యారు. అయితే, జగన్ తో పొంగులేటి భేటీ కావడంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా పొంగులేటి జగన్ ను కలిశారు. కానీ తాజా భేటీ మాత్రం రాజకీయాలలో పెను చర్చకు దారితీసింది. వీరిద్దరి చర్చల్లో కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు సిద్ధమైన జగన్ సోదరి షర్మిల టాపిక్కే కీలకమని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కేవీపీ లాంటి ఆ కుటుంబంతో దగ్గరగా ఉండే నేతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలోనే సోదరి షర్మిల విషయంపైనే జగన్ ను పొంగులేటి కలిసినట్లుగా ఓ వర్గంలో రాజకీయ చర్చలు సాగుతున్నాయి. కాగా, షర్మిల ఇప్పటికిప్పుడు తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది. షర్మిల కూడా సోషల్ మీడియా లో ఇదే విషయాన్ని పంచుకున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలను ఏపీకి పంపితేనే ప్రయోజనం ఉంటుందని అధిష్టానానికి చెబుతున్నారు. ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకతో తమకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే లెక్కల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే షర్మిల తరపునే పొంగులేటి జగన్ వద్దకు వెళ్లారనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు పొంగులేటికి అసలు బాస్ జగన్ మోహన్ రెడ్డేనని.. ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ లేనందున పొంగులేటి కాంగ్రెస్ లో చేరారని, వ్యాపార లావాదేవీలతో పాటు రాజకీయంగా కూడా పొంగులేటిని నడిపించేది జగన్ మోహన్ రెడ్డేనని మరోవైపు చర్చలు సాగుతున్నాయి. ఇందులో ఏది నిజం అనేది ఎలా ఉన్నా.. ఈ భేటీ మాత్రం కాస్త తెలుగు రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది.

జులై 18న ఎన్డీయే పక్షాల మీటింగ్.. ఓటమి భయంతో దిగొచ్చిన మోడీ సర్కార్

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరౌతున్న కొద్దీ బీజేపీలో కంగారు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.  2014 ఎన్నికలలో  విజయంపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు పెద్ద పీట వేసింది. ఆ పార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించింది. రాష్ట్రల ప్రయోజనాలను పరిరక్షిస్తూ దేశ ప్రగతిలో వాటినీ భాగస్వామ్యం చేస్తామని నమ్మబలికింది. అయితే ఆ ఎన్నికలలో ఎన్డీయే కూటమి పక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం రావడంతో బీజేపీ ధోరణిలో మార్పు వచ్చింది. అయినా మోడీ తొలి కేబినెట్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి నుంచే భాగస్వామ్య పక్షాలను బలహీనం చేయడం అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడం అది కుదరకపోతే ఎన్డీయేలోంచి పొమ్మనకుండానే పొగపెట్టి.. అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విపక్షాలు బలపడేందుకు అన్ని విధాలుగా దోహదపడటం వంటి చర్యలకు పాల్పడింది. 2019 ఎన్నికల సమయం వచ్చే సరికి ఎన్డీయే అనేది పేరుకు మాత్రమే అన్నట్లుగా మిగిలింది. ఆ ఎన్నికలలోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవరి మీదా ఆధారపడకుండానే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇక అక్కడి నుంచీ బీజేపీ విస్తరణ కాంక్ష పెచ్చరిల్లింది. రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే రాజకీయానికి తెరతీసింది. బలమైన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటికి ఆర్థిక చీకాకులు కలిగేలా వ్యూహాలు రచించి అమలు చేసింది.  ఫెడరల్ స్ఫూర్తిని తుంగలోకి తొక్కి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా వెరవకుండా ముందుకు సాగింది. ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గత తొమ్మిదేళ్లకు పైగా ఉన్న మోడీ సర్కార్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ హై కమాండ్.. మోడీ హ్యాట్రిక్ విజయానికి ఎన్డీయే పటిష్టంగా ఉండటం వినా మరో మార్గం లేదని గ్రహించింది. అందుకే ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 18న జరగనున్న ఈ సమావేశానికి పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని అంటున్నారు. అందులో భాగంగానే ఎబీజేపీతో విభేదించి గత ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసిన తెలుగుదేశంకి సైతం ఆహ్వానం పంపింది.   మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎన్నికల వేళ తన అవసరాల కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం.. దానికి తోడు బీజేపీయేతర పక్షాలన్నీ మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం ఐక్యతారాగం ఆలపించడంతో వచ్చే ఎన్నికలలో గెలవాలంటే సొంత బలం చాలదన్న గ్రహింపునకు బీజేపీ వచ్చిందంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలతో పాటు పాత మిత్రులకూ, కొత్త మిత్రులకూ కూడా ఈ నెల 18న నిర్వహించనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది 

బాబాయ్ రిటైర్మెంట్ పై అబ్బాయ్ కామెంట్లు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన బాబాయ్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై వెరైటీగా స్పందిస్తున్నారు. బాబాయ్ శరద్ పవార్ పై ఓవైపు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు.. ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడుతున్నారు. అందరి ముందు తనను విలన్‌గా చూపించాలని శరద్ పవార్‌ వ్యూహాన్ని .. అజిత్ పవార్ ఎండగడ్తున్నారు. అలా అంటూనే.. ఆయనపై ఇప్పటికీ తనకు చాలా గౌరవం ఉందని వ్యాఖ్యానించడంపై ..రాజకీయ పండితులు సైతం..ఇదేం స్ట్రాటజీ అంటూ విస్మయం చెందుతున్నారు. ఐఏఎస్‌ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారు. రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతున్నారు. అందుకు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే ఉదాహరణ.  అది కొత్త తరం ఎదగడానికి ఉపయోగపడుతుంది.   శరద్ పవార్ వయసుపై టార్గెగ్ చేస్తూ.. అజిత్.. బాబాయ్ ఇక విశ్రాంతి తీసుకోవాల అజిత్ అభిలషిస్తున్నారు.ఆయన విశ్రాంతి తీసుకుని.. ఆశీర్వాదాలు అందిస్తే చాలనే ధోరణిలో  వ్యాఖ్యలు చేస్తున్నారు. 2004లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎస్పీపీ కోల్పోవడానికి శరద్ పవార్ కారణమని అజిత్ పవార్ గట్టిగా నమ్ముతున్నారు.  2017లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షా బంగ్లాలో జరిగిన సమావేశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావనలోకి వచ్చింది. కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపు, మంత్రి పదవులపై బీజేపీ-ఎన్సీపీ మధ్య చర్చలు జరిగాయని, కానీ తర్వాత శరద్ పవార్ వలనే.. పార్టీ వెనక్కి తగ్గిందని అంటున్నారు. బాబాయ్ వలనే అప్పుడు అధికారం.. చేజారిందని.. అజిత్ అన్నట్లు సమాచారం.  అయితే..తన తండ్రిపై సోదరుడు అజిత్ పవార్ రిటైర్మెంట్ కామెంట్లపై.. శరద్ తనయ సుప్రియా సూలె స గత స్పందించారు.  ప్రముఖ పారిశ్రామిక వేత్త  రతన్ టాటా,  అమితాబ్ బచ్చన్ 80 ఏళ్లు దాటిన వారేనని .. వాళ్లు తమ తమ రంగాలలో చురుకుగా పని చేసుకుని పోవడం లేరా అంటూ సుప్రియా ఎరుదాడి చేస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు.. గతేడాది నుంచి.. అనేక మలుపులు తిరుగుతూ.. మీడియా నోళ్లలో నానుతున్నాయి.

తెలుగు వీర.. లేవరా?

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారులు లెక్కకు మిక్కలిగానే ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహదారుడు కూడా ఉన్నారు. మరి ఆ సలహాదారులే మరిచిపోయారో లేక ఆ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడే  మరిచిపోయారో.. అదీ ఇదీ కాకుంటే.. వారంత కలిసికట్టుగా చెప్పినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం  ఎవరి మాటలు వినిపించుకోకుండా.. జులై 4న ఛలో చిత్తూరు అంటూ విమానం ఎక్కి వెళ్లి పోయారో ఏమిటో అంటూ ఓ చర్చ అయితే వైసీపీ లోని ఓ వర్గంలో ఊపందుకొంది.  జులై 4  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి.  బతుకు తెరువుకి దేశానికి వచ్చి.. భారతీయులను బానిసలుగా చేసిన ఆంగ్లేయులపై విప్లవ శంఖం పూరించిన అగ్గి పిడుగు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డెపై..  ప్రభుత్వ వర్గాలు ఎంత అట్టహసంగా జరపాలి. కానీ ఆ జాడ.. రాష్ట్రంలో ఎక్కడా.. కనిపించక పోవడంతో ప్రపంచంలోని తెలుగు వారిలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.   ఇక పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరై అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా.. ఆయనలోని దేశభక్తి, పోరాట పటిమ..స్ఫూర్తిగా తీసుకోవాలంటూ భవిష్యత్ తరాలకు పిలుపునిచ్చారు. మరి పక్క రాష్ట్రంలో అలా జరిగితే.. ఆయన పుట్టినగడ్డపై ఇంకా ఎంత ఘనంగా నిర్వహించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి.  అదీకాక గత ఏడాది అంటే 2022, జూలై 4వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఇదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్,  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి,  కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మంత్రి మంత్రులు  రోజాతో  హాజరయ్యారు. మరి అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ప్రారంభానికి హాజరైన.. ఈ ముఖ్యమంత్రివర్యులు.. జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని వైసీపీ శ్రేణుల్లోనే అనుమానాలు, అసంతృప్తి వ్యక్తమౌతోంది.   మరోవైపు అల్లూరి సీతారామారాజు జయంతి ఉత్సవాల వేడుకలు జరపకపోవడానికి జగన్ పార్టీలోని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కారణమని.. ఆయనపై ఆగ్రహంతోనే జగన్ ప్రభుత్వం.. మన్యం వీరుడి జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించలేదంటూ మీడియాలో, సామాజిక మాధ్యమంలో   కథనాలు   వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇలా ఒకరిపై కోపాన్ని  భారత జాతి కోసం నిప్పు కణంలా మండిన అల్లూరి సీతారామరాజుపై చూపడం సరికాదనే అభిప్రాయం  వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహానేత పేరుతో విగ్రహాలు, జయంతిలు, వర్దంతిలు, సభలు, సమావేశాలు, ప్లీనరీలు నిర్వహించే ఈ ప్రభుత్వం మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డపై జరపకపోవడం.. కడు శోచనీయమని ప్రజాస్వామిక వాదులు సైతం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోడీ తెలంగాణ పర్యటన.. ఈ సారైనా కేసీఆర్ పాల్గొంటారా?

ప్రధాని తెలంగాణ పర్యటన అనగానే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలుకుతారా? అన్న అనుమానాలు రావడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాదిన్నర కాలంగా ప్రధాని అధికారిక పర్యటనపై ఎప్పుడు తెలంగాణకు వచ్చినా  రాష్ట్రంలో ఉండకుండా దేశ వ్యాప్త పర్యటన అనో, అనారోగ్యమనో కేసీఆర్ ఆయనకు ఎదురుపడటం లేదు.  మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్యత కూడగట్టడంలో విఫలమైన కేసీఆర్ ఇప్పుడు మోడీపై, ఆయన సర్కార్ పై, అలాగే బీజేపీపై విమర్శల తీవ్రతను కనీస స్థాయికి తగ్గించారు. అయినా శనివారం మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతారా అంటే పరిశీలకులు అనుమానమనే అంటున్నారు.   ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది.  అయితే కేసీఆర్ ప్రొటోకాల్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ నేతలూ, చివరాఖరకు అధికారులు కూడా ప్రొటో కాల్ పాటించడం లేదన్న విషయం తెలిసిందే.  గతంలో ఒక సారి తెలంగాణలో  హైదరాబాద్ లో ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్ వచ్చారు.  ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా  కొట్టారు. అలా డుమ్మా కొట్టడానికి కారణం పీఎంవో నుంచి తనను ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ వచ్చిన సూచన అని చెప్పారు. అయితే దానిని పీఎంవో ఖండించడంతో  కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే మోడీకి ముఖం చాటేశారని అర్ధమైంది. అలాగే హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇంకా ఇక్రిశాట్ లో కార్యక్రమానికీ డుమ్మా కొట్టారు.  అదే విధంగా గత ఏడాది నవంబర్ 12న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.  రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకూ  కేసీఆర్ డుమ్మా కొట్టారు.  అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పించారు. మీడియా మీట్ లలో కూడా మోడీనే నేరుగా నిలదీస్తూ విమర్శలు గుప్పించారు. యథావిథిగా అప్పుడు కూడా మోడీకి ఎదురు పడలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు గతంలోలా లేవు. ఇప్పుడు కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్, బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకూ కూడా ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.  అందుకే   ప్రధాని మోదీ శనివారం (జూలై 7) తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ ఆహ్వానం పలికితే.. బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని జనం భావిస్తారు.. కనుక కేసీఆర్ మోడీకి ఎదురేగి ఆహ్వానం పలికే అవకాశం లేదంటూ విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే మోడీ తెలంగాణ పర్యటన విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.  మోడీ పర్యటనలో భాగంగా కాజీపేటలో రైల్వేశాఖ ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. ఇవి రెండూ కూడా అధికారిక కార్యక్రమాలు. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలను   తీవ్రంగా వ్యతిరేకించే  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. అయితే కేసీఆర్ తీరు మాత్రం వేరే. అందుకే ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

కామన్ సివిల్ కోడ్.. జగన్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి!

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే తన అవినీతి అక్రమాస్తుల కేసు, బాబాయ్ వివేకా హత్య కేసు రేపా మాపా అన్నట్లు టెన్షన్ పెడుతుంటే.. చెల్లి షర్మిల ప్రత్యర్థిగా రాష్ట్రంలో అడుగుపెడుతుందా? ఇన్నాళ్లు తనకు కేంద్రంలో సహకరించిన బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థి టీడీపీతో పొత్తుకు వెళ్తుందా అనే అనుమానాలు మెదడును తొలచి వేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలలో పెరిగిన వ్యతిరేకతకు తోడు ఒక్కసారి ఎన్నికల నగారా మోగితే.. పార్టీలో ఉండేది ఎవరో వెళ్ళేది ఎవరో అన్నట్లుంది పరిస్థితి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో సమస్య వచ్చి పడింది. అదే ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు.  అదే కామన్ సివిల్ కోడ్. ఈ బిల్లు జగన్ పాలిట ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. ఎక్కడో కేంద్రం తీసుకొచ్చే బిల్లుతో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ బిల్లుకు వైసీపీ చచ్చినట్లు ఆమోదం తెలపాలి. ఈ నాలుగేళ్ళలో బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు, కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ ఎంపీలు మారు మాట్లాడకుండా ఒకే చెప్పి ఓట్లేశారు. అందుకే కేంద్రం నుండి జగన్ మోహన్ రెడ్డికి సహకారం అందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు కూడా వైసీపీ మద్దతు తెలపాల్సి వస్తుంది.  అయితే.. ఈ బిల్లుకు వైసీపీ కనుక ఒకే చెప్తే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా మారతారు. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని హైలెట్ చేసి మైనార్టీలకు దగ్గరవుతాయి. ఇన్నాళ్లు వైసీపీ, బీజేపీ అనుబంధం రహస్యంగానే సాగిందని బహిరంగ రహస్యమే. అయితే దీని వలన జగన్ మోహన్ రెడ్డికి ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా  ఇబ్బంది ఎదురు కాలేదు. రాష్ట్రంలో కేంద్ర సంస్థల అమ్మకం, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవ్వని కేంద్రానికి వైసీపీ అండగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించినా వాటిని జగన్ పెద్దగా ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ బిల్లు  విషయం మాత్రం మద్దతిస్తే ఒక తంటా మద్దతివ్వకుంటే మరో తంటా. ఆ బిల్లుకు   మద్దతిస్తే వైసీపీకి చేటు జరగడం ఖాయం. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ నెల‌ 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లును  ప్ర‌వేశ పెట్టనుంది. దీనికి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం త‌ప్ప‌ని స‌రి అవుతుంది. ఈ బిల్లుకు మ‌ద్ద‌తు తెలిపితే జ‌గ‌న్‌కు  న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏపీలో ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు మ‌ద్ద‌తు జ‌గ‌న్ కు ఎంతో కీల‌కం. కనుక ఆయ‌న తప్పక ఉమ్మ‌డి పౌరస్మృతికి మ‌ద్ద‌తు తెల‌పాల్సి ఉంటుంది. కానీ, ఈ బిల్లుకు జగన్ మద్దతు తెలిపితే  రాష్ట్రంలో మైనార్టీలు దూరం అవడం గ్యారంటీ. ఉమ్మ‌డి పౌర‌స్మృతిని ముస్లిం సామాజిక వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని త‌మ మత స్వేచ్ఛపై జ‌రుగుతున్న దాడిగా పేర్కొంటున్న ఈ సామాజిక వ‌ర్గం.. బిల్లుకు ఒకే చెప్పిన జ‌గ‌న్‌పై ఆగ్ర‌హించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే, తాము మాత్రమే కాకుండా.. అన్ని పార్టీలు ఉమ్మ‌డి పౌర‌స్మృతికి జై కొట్టిన నేప‌థ్యంలో త‌మకు ప్ర‌త్యేకంగా వ‌చ్చే ఇబ్బంది లేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, కొన్నేళ్లుగా ముస్లింలు జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటుండగా.. ఇప్పుడు వారి అభిప్రాయానికి విరుద్ధంగా జగన్  నిర్ణయం తీసుకుంటే మాత్రం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీ-బీఆర్ఎస్ తెరవెనక స్నేహం?

తెలంగాణలో బీఆర్ఎస్ ,బీజేపీల మధ్య స్నేహం ఉందా?  వైరం ఉందా?  అసలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇదే చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రజలలో కూడా జరుగుతున్న చర్చ. ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో ఉప్పూ నిప్పులా ఉంటారు. రోజూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంటారు. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టులు చేయిస్తే.. ఢిల్లీలో బీజేపీ.. బీఆర్ఎస్ నేతలను కేసులతో పరుగులు పెట్టిస్తుంటుంది. బీజేపీ తెలంగాణలో  జెండా పాతాలని చూస్తుంటే.. బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నది. అయితే ఇదంతా నిజమా?  నిజంగానే ఈ రెండు పార్టీలూ  ప్రత్యర్థులేనా అంటే ఏమో ఇది కూడా ఒకరకమైన రాజకీయమే అని చెప్పుకోక తప్పదు. గల్లీలో కొట్టుకుంటారు.. ఢిల్లీలో కలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపిస్తుంటారు. ఏమో అది కూడా నిజం ఎందుకు కాకూడదు అని ఇప్పటి రాజకీయాలను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ మాత్రమే. అసలు బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అందుకే బీజేపీ తలపడినా, పోటీపడినా కాంగ్రెస్ తోనే. కనుక బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ మాత్రమే. పోనీ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ శత్రువే కదా అనుకున్నా.. అది బీఆర్ఎస్ అధికారాన్ని బీజేపీ లాక్కొనే స్థాయి శత్రుత్వం కాదు. ఆ మాట కొస్తే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కాలంటే ఆషామాషీ కాదు. అది బీజేపీ పెద్దలకు సైతం తెలుసు. ఇక తెలంగాణలో ఏదైనా అవకాశం ఉందంటే అది కాంగ్రెస్ కు మాత్రమే. రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీగా.. గల్లీ నుండి నిర్మాణాత్మకమైన క్యాడర్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ కు ఆ అవకాశం ఉంది. ఉంటుంది కూడా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీజేపీకి ఉమ్మడి శత్రువును చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే అటు కేంద్రంలో బీజేపీకి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ముప్పు. ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో చేరిన కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా కాంగ్రెస్ వశమైతే బీజేపీకి అది తట్టుకోలేని ఎదురు దెబ్బగా మారుతుంది. దేశ వ్యాప్తంగా ఇది బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక, తెలంగాణలో బీజేపీకి అధికారం ఎలాగూ దక్కదు.. కనుక తాను బలపడకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు ఇటీవలి పరిణామాలను ఉటంకిస్తూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు తెరవెనక మిత్రులుగా మారారన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. పైకి బీజేపీ వెర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కనిపిస్తూ కాంగ్రెస్ ను తగ్గించడం అన్నదే ఈ రెండు పార్టీల వ్యూహంగా చెబుతున్నారు.  ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటలను అద్యక్షుడిని చేస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. దీనికి కారణం ఈటల బీఆర్ఎస్ పార్టీకి శత్రువు కావడమే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.  బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహం ఈటల అధ్యక్షుడిగా ఉంటే సాగదు. అందుకే సౌమ్యుడు, తొలి నుండి బీజేపీ అధిష్టానికి చేరువగా ఉండే  కిషన్ రెడ్డిని ఈ ప్రణాళిక కోసం ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంప గుత్తగా కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విజయానికి బాటలు పరచడమే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్లాన్ గా కనిపిస్తున్నదని.. మరోవైపు అదే మాదిరిగా దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు పడకుండా చీల్చే పని బీఆర్ఎస్ తలకెత్తుకున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

స్పీడ్ న్యూస్ 1

1.శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయన స్థానంలో తనను చీఫ్‌గా ఎన్నుకున్నారని పేర్కొన్నారు.  2.తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 3.  రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌5జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా? లేక ఇళ్ల పట్టాల పంపిణీ వరకే అనుమతించిందా? ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  4.ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో ఇదే విషయం చర్చించినట్టు తెలిపారు.  5. అమెరికా పౌరసత్వం పొందడం ఇకపై మరింత కఠినతరం కానుంది. విదేశీయులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్వహించే నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా కీలక మార్పులు చేయనుంది. 6.టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేశ్‌‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.  7.ఈ వారాంతం నుండి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి సమీక్ష నిర్వహించారు.  8.తమకు ముందస్తు ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముందస్తు గురించి ప్రశ్నించారు. 9.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. పార్టీ పదవి అనేది బాధ్యతతో కూడుకున్నదన్నారు.  10. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తి అయినందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ - అనా దంపతుల ఫొటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చి చెప్పారు. 11.మెటా సీఈవో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ఈ ఉదయం ట్విట్లర్ లోకి లాగిన్ అయ్యాడు.  12.హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు.  48 సంవత్సరాల కోకోలి ఆత్మహత్యను లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు.  13. దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని లా కమిషన్ తిరస్కరించిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించడం సరికాదని అన్నారు.  14. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని తినేసిన ఎలుకలు వారు జైలు పాలు కాకుండా రక్షించాయి. గంజాయిని ఎలుకలు పూర్తిగా తినేశాయని, కాబట్టి కోర్టులో చూపించలేమని పోలీసులు పేర్కొనడంతో   సాక్ష్యాలు లేని కారణంగా తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 15.తెలంగాణకు చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేసి వెళుతుంటాడని చెప్పారు. 16. ఉత్తరప్రదేశ్  లక్నోలో ఎయిరిండియా విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.  17. మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ అదేశాలతో అధికారులు అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. 18.ఉత్తర ప్రదేశ్ దుద్వాన్ నేషనల్ పార్క్ లో అడవి ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగులు వారి వెంట పడటంతో వారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. 19.దేశంలో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సృజనాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు. 20.గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 21. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.  22.ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో రూ. 6,100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 23.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి సత్కరించారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు.  24. భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్ ధర కాస్త ఎక్కువైనా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండడంతో వందే భారత్ లో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  25.తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజీయం ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.

కిషన్ రెడ్డి ఫస్ట్ టాస్క్ ఇదేనా?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టేందుకు కొంత సమయం తీసుకుంకుంటున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తరువాత మాత్రమే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. దీంతో మోడీ తెలంగాణ పర్యటన సమయంలో రాష్ట్ర పార్టీ నాయకుడులేని సైన్యంగా ఉండనుంది. అయితే ఈ నెల 18న జరగనున్న ప్రధాని వరంగల్ సభను సక్సెస్ చేయడం తమ ముందున్న టాస్క్ అని కిషన్ రెడ్డి చెప్పారు.బాధ్యతలు ఇంకా చేపట్టకపోయినప్పటికీ ప్రధాని సభకు ముందునుంచీ పార్టీ చెబుతున్నవిధంగా పదిహేను లక్షల మందిని  సమీకరించి సభను గ్రాండ్ సక్సెస్ చేయడంపైనే కిషన్ రెడ్డి సక్సెస్ ఆధారపడి ఉంటుందని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణలో భాగస్వామి కావాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే బండి  పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా  బీజేపీ అధిష్ఠానం మెప్పు పొందేలా రాష్ట్రంలో బీజేపీ సభలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీ సభలను సక్సెస్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై అలుపెరుగని పోరాటం చేశారు. రాష్ట్రంలో విడతల వారీగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఆయా సందర్భాలలో ఏర్పాటు చేసిన ముగింపు సభలకు పార్టీ జాతీయ నాయకులను రప్పించి వాటిని గ్రాండ్ సక్సెస్ చేశారు. బండి సంజయ్ పని తీరును స్వయంగా మోడీ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రశంసించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారాయి. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో బండి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సభ సక్సెస్ కోసం ఆయన పూర్తి స్థాయిలో  పని చేస్తారన్న నమ్మకం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఏ మేరకు మోడీ సభ విజయవంతానికి పని చేస్తారన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా బండి సంజయ్ మార్పుతో రాష్ట్ర బీజేపీలో ఒక్క సారిగా నిస్తేజ వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మోడీ సభ సక్సెస్ కోసం ఒక్కడిగా, ఒంటరిగా కష్టపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. అందుకే కిషన్ రెడ్డి రెండు రోజుల పాటు వరంగల్ లోనే మకాం వేయనున్నారు. అధిష్టానం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం తొలి సభ కావడంతో ప్రధాని మోడీ గుడ్ లుక్స్ లో పడేందుకు ఈ సభ సక్సెస్ విషయంలో కిషన్ రెడ్డి శక్తికి మించి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ జిల్లాల అధ్యక్షుల నుంచి ఆశించిన విధంగా కిషన్ రెడ్డికి సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెబుతున్నారు.   గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఏడేళ్లుగా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండటంతో జిల్లాల అధ్యక్షులతో అంతగా సంబంధాలు లేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.  ఆ కారణంగానే సభ సక్సెస్ విషయంలో అనుమానాలు ఉండటం వల్లనే కిషన్ రెడ్డి మోడీ సభ అనంతరం మాత్రమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడతానని అంటున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. 

నాలుగు స్తంభాలాట.. ఏపీలో వారసుల వార్!

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉండగానే దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు మొదలు పెట్టాయి. దాదాపుగా అన్ని పార్టీలకు రాబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమే కానున్నాయి. అధికార పార్టీ వైసీపీ  జగన్ పాలనకు రెఫరెండంగా వచ్చే ఎన్నికలను భావిస్తుంటే,  టీడీపీ  చంద్రబాబు దార్శనికతపై ప్రజలలో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికలు గీటురాయిగా భావిస్తోంది.  ఇక, జనసేనకు సైతం ఈ ఎన్నికలే ప్రజలలో  పవన్ పై ఏ మేరకు విశ్వాసం ఉందన్న విషయానికి పరీక్షగా మారాయి.  కాగా  ఏపీలో  ఈసారి ఎన్నికలలో  మరో  ఆసక్తికర అంశం కనిపిస్తుంది. అదే వారసుల మధ్య పోరు. ఏపీలో ఇప్పుడు నలుగురు వారసుల మధ్య ఆసక్తికర పోరు కనిపిస్తుంది. ఇప్పటికే నలుగురూ రాజకీయాలలో కీలకంగా ఉన్నా రానున్న ఎన్నికలలో ఈ నలుగురి మధ్య జరగనున్న పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. వారెవరో కాదు.. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమార్తె పురంధేశ్వరి. ఈ నలుగురు మాజీ ముఖ్యమంత్రుల వారసులే కాగా ఇప్పుడు ఈ నలుగురి మధ్యా జరుగుతున్న రాజకీయ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.   ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకు  ప్రధాన పోటీ లోకేష్. టీడీపీ నుండి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడే అయినా.. రానున్న ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించే విషయంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ లోకేషే కానున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు సమకాలికులు కాగా ఇప్పుడు తదననుగుణంగానే వారసుల మధ్య పోటీ అనివార్యమైంది. ఇప్పటికే టీడీపీ ఐకాన్ గా లోకేష్ పాదయాత్రలో ఉన్నారు.  సంపూర్ణ ఆరోగ్యంగా చంద్రబాబు యువకులతో పోటీపడుతున్నా..తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకునే క్రమంలో లోకేష్ రాటుదేలుతున్నారు.  ఔనన్నా కాదన్నా జగన్ మోహన్ రెడ్డికి ఎటు చూసినా లోకేషే పోటీ. లోకేష్ కు కూడా జగన్ మోహన్ రెడ్డినే పోటీ. తండ్రి చంద్రబాబు జగన్ తండ్రి వైఎస్ఆర్ తో తలపడితే ఇప్పుడు ఆయన కుమారుడిని లోకేష్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి అనివారమైంది. మరోవైపు వైఎస్ఆర్ కుమార్తె షర్మిలతో కూడా వైఎస్ఆర్ కుమారుడు జగన్ పోటీకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందనే ప్రచారం తెలిసిందే కాగా.. అదే జరిగితే కాంగ్రెస్ నుండి షర్మిల.. వైసీపీ నుండి జగన్ తలపడాల్సి వస్తుంది. ఇప్పటికే పులివెందుల నుంచి షర్మిల బరిలోకి దిగుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. అదే సమయంలో షర్మిలతో మాజీ సీఎంలు చంద్రబాబు కుమారుడు లోకేష్, బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా  పోటీకి దిగాల్సి వస్తుంది. అదే సమయంలో పురంధేశ్వరికి జగన్ తో కూడా వార్ తప్పదు. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తు కుదరకపోతే పురంధేశ్వరి చంద్రబాబు,  లోకేష్ తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ వర్సెస్ చంద్రబాబు కుమారుడు లోకేష్,  వైఎస్ఆర్ కుమార్తె షర్మిల, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ వర్సెస్ వైఎస్ఆర్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల.. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల వర్సెస్ కుమారుడు జగన్, చంద్రబాబు కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వర్సెస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల, కుమారుడు జగన్ ఇలా నువ్వా నేనా అన్నట్లు వారసుల మధ్య ఆసక్తికర రాజకీయ పోటీ కనిపిస్తుంది. మరి ఈ పోటీలో ఈసారి నెగ్గేదెవరో తగ్గేదెవరో చూడాలి. ఈ నలుగురూ ఎన్నికల బరిలో ముఖాముఖి తలపడే పరిస్థితి ఉండకపోయినా వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలను విజయ పథంలో నడిపించే విషయంలో మాత్రం తీవ్రంగా పోటీ పడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

చిన్నమ్మకే చెల్లింది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా  నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరి  ఆ పార్టీ గూటికి చేరి దశాబ్దం కాకున్నా.. ఆమె అధ్యక్ష పదవి చేపట్టడం పట్ల.. తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీలోని సీనియర్లు ఔరా.. అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం చక్రం తిప్పినా? ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ వికసించేలా చేయడంలో ఈ చిన్నమ్మ సఫలీకృతులవుతారా? అనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.  2004 ఎన్నికలకు ముందు.. అంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. అదీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉండగా.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే టీడీపీ అధికారంలో ఉండగా.. దగ్గుబాటి పురందేశ్వరి ఇలా హస్తం పార్టీలో చేరి.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఎంపీగా ఎన్నిక కావడమే కాదు.. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అంటే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేసి.. విజయం సాధించి.. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అయితే 2009, సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతి... ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొన్న   పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. రాష్ట్ర విభజనకు ముహూర్తం సైతం ఖరారు చేశారు. సోనియా నిర్ణయాన్ని ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు నిరసన  వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు బై బై గుడ్ బై చేప్పేశారు.  పురందేశ్వరి మాత్రం.. కాంగ్రెస పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఆ క్రమంలో ఆమె కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినా.. ఆమె బీజేపీ తరపున పలు సభలు, సమావేశాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ వస్తున్నారు.  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తన వైద్య వృత్తిని వదిలి.. మామ వెంట నడిచారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా  తెలుగుదేశంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలంగా వ్యవహరించారు.   1994లో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం.. అనంతరం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగుదేశంకు దూరం జరిగి.. సైలెంట్ అయిపోయారు.  అలా తన భర్త సైలెంట్ కావడంతో.. అప్పటి వరకు దుగ్గుబాటి పురందేశ్వరి అనధికారికంగా పసుపు పార్టీలోనే ఉన్నట్లు లెక్క అనే వారు సైతం ఉన్నారు. ఆ తర్వాత అంటే.. 2004లో పురందేశ్వరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ... కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రజా ప్రతినిధిగా పలు పదవులు చేపట్టారు.  అలా చిన్నమ్మ.. ఓ కుమార్తెగా, ఓ భార్యగా, ఓ తల్లిగా, ఉత్తమ పార్లమెంటరీయన్‌గా తాను చేపట్టిన పదవులకే వన్నె తెచ్చే విధంగా వ్యవహరించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ పార్టీలో  దశాబ్దాలుగా ఉంటున్న హేమాహేమీల పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. వారందరిని పక్కన పెట్టి దగ్గుబాటి పురందేశ్వరి వైపే కమలం పార్టీ అధిష్టానం మొగ్గుచూపిందంటే.. ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవి కట్టబెట్టినా.. ఏ పని అప్పగించినా.. అంకితభావంతో పని చేసే గుణం ఆమెలో ఉండటమే కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఏ పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు దక్కిచుకోవడం చిన్నమ్మకు చెల్లిందని చెబుతున్నారు.

జైల్లోనే కోడికత్తి శీను నిరాహారదీక్ష!

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి జరిగింది. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయంకు రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. అప్పట్లో కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందో ఆ ఆసుపత్రి వైద్యులకే తెలుసు కానీ.. దాని వలన జగన్ పొందిన లబ్ది ఎంతన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ దాడిని కూడా జగన్ తనకు సానుభూతి దక్కేలా మలచుకున్నారు. చిన్నదో పెద్దదో దాడి అయితే జరిగింది కదా. ఎవరు చేశారు ఎందుకు చేశారనేది అనవసరం. అసలే ఎన్నికల సమయం. జరిగిన దానిని తనకు ఎంత అనుకూలంగా మలచుకుంటే అంత బెనిఫిట్. అందుకే చిన్న గాయానికి ఆసుపత్రిలో మూడు వారాల రెస్ట్ అవసరం అయింది. ఆ తర్వాత ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలిసి కుట్ర పన్ని సీఎం జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున విమర్శలకు దిగి ప్రజలలో అదే నిజం అనేలా ప్రయత్నించారు. కాగా, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు. అసలు కుట్ర దారులు ఎవరు? ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఏంటన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీనుకు శిక్ష పడిందా లేదా తెలియదు. అతనే దోషా.. దాని వెనక ఎవరూ లేరన్నది కూడా తేల్చలేదు. గత ఐదేళ్లుగా శీను జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ కేసులో కొద్దిరోజుల క్రితం శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు గతంలో బెయిల్ ఇవ్వగా ఆ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో, శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరోసారి వాదనలు వినిపించగా.. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని సూచిస్తూ తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. అయితే, తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీను జైల్లోనే నిరాహారదీక్ష చేపట్టనున్నాడట. శ్రీను జైల్లో దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఆయన తరఫు లాయర్అబ్దుల్ సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల నుంచి తన క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని, కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని లాయర్ సలీం కోరారు. షెడ్యూల్ ప్రకటించకుంటే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని ప్రకటించారు. మరి, ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? కోర్టు ఈ కేసులో అసలు దోషులు ఎవరో? ఏ ఉద్దేశ్యంతో దాడి చేశారో తేలుస్తారా? ఈలోగా శ్రీను జీవితం జైల్లోనే మగ్గిపోవాలా? లేక బెయిల్ ఇచ్చి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

స్పీడ్ న్యూస్  4

1. బీమా పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులు సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. 2. రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత వంగలపూడి అనిత  ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులు వివరించేందుకు ఐలాపురం హోటల్‌కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  3. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిమర్రు వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నపొలాల్లోకి దూసుకెళ్లింది. 4. తిరుమలలో బుధవారం  భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 5.రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సంబంధిత శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  సచివాలయంలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్‌ కోఆర్డినేషన్‌ అపెక్స్‌ కమిటీ సమావేశంలో సీఎస్‌ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలన్నారు. 6. కేరళ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల  ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు  కురుస్తున్నాయి. 7.అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తెలుపు రంగు పొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. 8.మహారాష్ట్ర ఎన్సీపీలో ఏర్పడిన సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు పోటా పోటీగా సమావేశాలకు పిలుపునిచ్చి, విప్ జారీ చేశాయి. 9.మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ పందొమ్మిదేళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయి ఇటీవల తిరిగి తన కుటుంబాన్ని కలుసుకుంది. తల్లి తిరిగొచ్చిన సంతోషంలో ఆమె పిల్లలు అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేసిన సంఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 10. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ  స్పందించారు. సోము వీర్రాజుపై  అనేక ఆరోపణలు వచ్చాయని వైసీపీకి  అనుకూలంగా పని చేశారనే నింద  ఉందని తెలిపారు.

అక్రమాస్తుల కేసులో జగన్‍రెడ్డి సంస్థలకు సుప్రీం నోటీసులు

 అక్రమాస్తుల కేసులో జగన్ సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, విజయసాయిరెడ్డికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నో  డివిజన్ బెంచ్ తీర్పును ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.  ఈడీ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సెప్టెంబర్ 5లోగా సమాధానం  చెప్పాలని  జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, ఈ కేసులో ఏ2 అయిన విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో తొలుత సీబీఐ చార్జిషీట్లపై తొలుత సీబీఐ చార్జి షీట్లపై తేల్చాలనీ, ఆ తరువాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబర్ లో తీర్పు వెలువరించింది.   ఒక వేళ సీబీఐ, ఈడీ సమాంతరంగా విచారణ జరిపినప్పటికీ సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెలువరించరాదని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పులో పేర్కొంది.  సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును  కొట్టివేసింది.   సీబీఐ కేసులు కనుక వీగిపోతే.. ఈడీ కేసులే ఉండవు కదా అని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పులో పేర్కొంది. కాగా ఈడీ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.

స్పీడ్ న్యూస్  3

1జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.  2.సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలో భారత ఫుట్ బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్(శాఫ్‌) చాంపియన్‌షిప్‌ లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ట్రోఫీ గెలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. 3.తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఐ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే తెల్లవారుజామున నాలుగు గంటలకే సీఐ ఇంటికి పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 4.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్ కావడం భయాందోళనలు సృష్టించింది. వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  5ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.  6.గిరిజన కూలీపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టిలో పడడంతో నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.  7. మోదీ ఇంటి పేరుతో గత లోక్ సభ ఎన్నికల్లో తీవ్రఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మంగళవారం ఊరట దక్కింది. వ్యక్తిగత హాజరు నుండి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి ఝార్ఖండ్ హైకోర్టు మినహాయింపును ఇచ్చింది. 8. తన ఫొటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫొటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.  9. తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా, అరెస్ట్ చేసి జైల్లో వేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది ఇండిపెండెంట్'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనను వాళ్లు మళ్లీ జైల్లో పెడతారని తనకు తెలుసునని అన్నారు. 10.మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు స్వయంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆశీస్సులు ఉండవచ్చునని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే  అనుమానం వ్యక్తం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీని చీల్చి, రాష్ట్రంలోని శివసేన-బిజెపి ప్రభుత్వంలో ఆదివారం ఎ

కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారా? అందుకే బుధవారం (జులై 5) కేంద్ర  కేబినెట్ భేటీకి ఆయన హాజరు కాలేదా? అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ సంస్థాగత మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. కొందరిని జాతీయ కార్యవర్గంలోనికి తీసుకుంది. కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింంది. దీంతో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.   అయితే ఇప్పటికే కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేశారనీ, అందుకే   కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు.  అయితే ఆయన రాజీనామా విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటనా లేకపోవడంతో కేబినెట్ భేటీకి ఆయన డుమ్మాకు కారణాలేమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేని కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై తన నిరసనను వ్యక్తం చేయడం కోసం కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవతుండగా, పార్టీ వర్గాలు మాత్రం అనారోగ్యం కారణంగా ఆయన కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారని చెబుతున్నాయి.   అయితే కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనీ, అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాకా ఇంత వరకూ ఆయన మీడియా ముఖంగా మాట్లాడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఢిల్లీలోనే ఉండి కూడా కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడం కూడా అందులో భాగమేనని చెబుతున్నారు.  

ఇన్ స్టా గ్రాంలోకి పవన్ గ్రాండ్ ఎంట్రీ

ఇప్పుడు దాదాపు సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తమ వ్యక్తిగత విషయాలు, రాజకీయ కార్యక్రమాలు, సినీ వార్తలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ముఖ్యంగా కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ హవా కొనసాగుతోంది. అందులో తమ లేటెస్ట్ ఫోటోలు, అప్డేట్స్ తో సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న పవన్.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అలా ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారో లేదో ఆరు గంటల్లోనే ఒక మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. పైగా ఆయన ఇంకా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కేవలం ఆయన ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారనే అప్డేట్ తో ఫ్యాన్స్ పోటీపడి ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తరహాలోనే పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో "ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జై హింద్!" అని రాసుకున్నారు.

చిన్నమ్మ నెగ్గుకొచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దుగ్గుబాటి పురేందేశ్వరిని నియమిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగిస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరిగినా.. ఆయన్ని ఇలా తొలగించి.. ఆ పదవిని  అలా పురేందేశ్వరికి  కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. అయితే చిన్నమ్మ.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలుగుతారా? అలాగే అధికార  వైసీపీ వై నాట్ 175 కోసం సాగిస్తున్న సోషల్ మీడియా దాడి.. పురేందేశ్వరీని సైతం లక్ష్యంగా చేసుకొంటుందా? ఇప్పటికే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సామాజిక మాధ్యమంలో దుష్ప్ర చారానికి జగన్ పార్టీ తెర తీసింది. ఆ జాబితాలో దుగ్గుబాటి పురేందేశ్వరిని సైతం చేరుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నా.. జగన్ పాలన పగ్గాలు చేపట్టి నాలుగున్నరేళ్లు అయింది. ఈ సమయంలో రాష్ట్ర విభజన సమయంలో  ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి. ఇంకా ఎన్ని అమలు కావాల్సి ఉంది. అలాగే మూడు రాజధానులు అంశం అశం,   ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి ప్రత్యేక ప్యాకేజీలపై పురందేశ్వరి ప్రజలను ఎలా సమాధాన పరుస్తారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమౌతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిందా అంటే చెప్పే నాథుడే లేరు.  రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, ధర్నాలు పాదయాత్రలపై  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  ప్రేక్షక పాత్ర వహించిందే తప్ప  జగన్ ప్రభుత్వాన్ని అదిలించి..  ప్రశ్నించింది లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. విశాఖపట్నం నుంచి వరుసుగా రెండు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై.. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హస్తం పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గుటికి చేరి.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నుంచి లోక్ సభ సభ్యురాలిగా బరిలోకి దిగి.. ఓటమి పాలవుతూ వస్తున్నారు. అలాంటి వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి.. ఈ చిన్నమ్మ నెట్టుకొస్తారా? లేదా అనే ఓ ప్రశ్న అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.