బండి సంజయ్ కు స్థాన భ్రంశం.. కేబినెట్ లోకేనా?
posted on Jul 3, 2023 @ 10:24AM
బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు స్థానం భ్రంశం తప్పదన్న విషయం దాదాపుగా ఖరారైంది. తెలంగాణ బీజేపీలో తలెత్తిన వర్గ పోరుకు ఫెల్ స్టాప్ పెట్టి.. పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలన్న నిర్ణయానికి ఆ పార్టీ హై కమాండ్ వచ్చేసిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఇప్పుడో ఇహనో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై పార్టీ హై కమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఎల్ సంతోష్ ఈ విషయంపై విస్తృతంగా, సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేశారని కూడా అంటున్నారు. కాగా సోమవారం (జులై 3)న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ భేటీలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కేబినెట్ లోని కొందరిని పార్టీ అవసరాల కోసం తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రాలకు చెందిన కొందరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఇక మళ్లీ తెలంగాణ విషయానికి వస్తే.. బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇక ఈటల రాజేందర్ కు కూడా కీలక పదవి అప్పగించే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ కీలక నేతలే చెబుతున్నారు. ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
పార్టీలో సంస్థాగతంగా జరిగే మార్పులతో అసంతృప్తి తలెత్తి, నేతలు జారిపోకుండా ఇతర బాధ్యతలతో సంతృప్తి పరచాలన్న వ్యూహంతో బీజేపీ హైకమాండ్ ఉంది. బీజేపీ ప్రధానంగా ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్పు చేర్పుల విషయంలో ఆ రాష్ట్రాలపైనే బీజేపీ హై కోమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు విషయంలో పార్టీ అగ్రనేతల మధ్యే భిన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ స్వయంగా కార్యకర్తలతో మాట్లాడుతూ మోడీ రాష్ట్ర పర్యటనలో తాను బీజేపీ రాష్ట్ర చీఫ్ హోదాలో పాల్గొంటానో లేదో తెలియదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర పార్టీలో పలువురు నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమౌతుందన్న ఉత్కంఠ తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. వరంగల్‌లో ఈ నెల 8న ప్రధాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్, బండి సంజయ్ ల మధ్య ఇసుమంతైనా సయోధ్య లేదన్న సంగతి వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్పష్టంగా తేలిపోయింది. ఈ సమావేశంలో వారిరువురూ ఎడముఖం, పెడముఖంగా వ్యవహరించారు.