ఉల్లి, టమాటా ధరలూ.. రాజకీయాలు
posted on Jul 1, 2023 @ 12:32PM
మనిషి జీవితమన్నాక ఎత్తు పల్లాలు సహజం. అలా అయితేనే జీవితం.. జీవితం అలాగ ఉంటేనే అయిన వారు ఎవరో.. కానీ వారు ఎవరో ఎప్పుడో ఒక్కప్పుడు తెలుస్తోంది. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జీవితంలో కింద పడినప్పుడే మనిషికి.. రూపాయి విలువ తెలుస్తోంది. అలాగే మనుషుల్లోని అసలు రంగు సైతం బహిర్గతమవుతోంది. ఆ పైవాడు సృష్టించిన మనిషి జీవితం ఎలా ఉంటుందో.. కూరగాయాల్లో టమాటా జీవితం కూడా దాదాపుగా అలాగే ఉంటుందనేది సుస్పష్టం.
కూరగాయాల్లో రాజా ఎవరంటే అంతా వంకాయే అంటారు. కానీ కూరగాయాల్లో టమాటా మాత్రం మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుందనే ఓ చర్చ అయితే జన బాహుళ్యం ఎప్పటి నుంచో సాగుతోంది. మనిషి జీవితంలో ఒడుదుకుల్లాగానే.. టమాటా ధరల్లో సైతం ఉత్థాన పతనాలు ఉంటాయని... ఒక్కొసారి కిలో టమాటా ధర 120 రూపాయిల నుంచి 150 రూపాయిల వరకు పలుకుతోంది, అదే టమాటా ఒక్కోసారి కిలో 5 రూపాయిలకు లేదా 10 రూపాయిలకు పతనం అవుతోంది
ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. అందుకే ఉల్లి ధరలు ప్రభుత్వలను సైతం కూల్చివేయగలవు. అటువంటి సంఘటనలు భారతావనిలో పలు మార్లు జరిగాయి. ఉల్లిపాయి ధర రాకెట్‌లా పైకి ఎగబాకీ.. ఆకాశాన్నంటినా.. ఆ తర్వాత.. ధరలు తగ్గితే 20 రూపాయిలకు మించి కిందకు దిగదన్న విషయం విదితమే.
దీంతో ఉల్లిపాయే ధర అంతకంటే కిందకి దిగదన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిపోయింది. కానీ టమాట పరిస్థితి అలా కాదు.. అయితే కిలో టమాటా 5 రూపాయిలు లేదా 10 రూపాయిలు.. అదీ ఇది కాకుంటే కిలో 120 రూపాయిలు లేదా 150 రూపాయిలు అయిపోతోంది. ఓ వేళ గిట్టుబాటు ధర లేకపోతే.. ఆ పంట పండించిన రైతు టమాటాను నడిరోడ్డుపైన పడేస్తాడన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనిషి టైమ్ బాగున్నప్పుడు టమాట ధరలాగా ఎగిరెగిరి పడతాడు. అదే మనిషి... టైమ్ బ్యాడ్ అయినప్పుడు టమాట ధర తగ్గినట్లు అమాంతంగా సైలెంట్ అయిపోతాడు.. టైమ్ బ్యాడ్ అయినప్పుడు అదే మనిషి నడి రోడ్డున పడతాడు. అంటూ గిట్టుబాటు ధర లేనప్పుడు టమాటలాగా అన్నమాట.
అయితే టమాటా ధరలతో అధికారం కోల్పోయిన దాఖలాలు ఈ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. కానీ భారత్‌లో మాత్రం ఉల్లి పాయి చేసే పవర్ పాలిటిక్స్.. భవిష్యత్ లో టమాటా చేసే అవకాశం ఉందా? అంటే సందేహమే. ఎంతైనా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి మన దేశంలో ఓ పార్టీని అధికారంలో నుంచి దింపాలన్నా.. మరో పార్టీకి అధికారం కట్టబెట్టాలన్నా.. ఉల్లిపాయి, టమాట, కోడిగుడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా... ఆహార పదార్థాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం.. భారతమాత ముద్దు బిడ్డలకు బుర్రతో పెట్టిన విద్య.. కాదంటారా?.. ఒక్క సారి ఆలోచించండి.