అనడం ఎందుకు.. అనిపించుకోవడమెందుకు?.. జగన్ VS పవన్
posted on Jul 1, 2023 @ 3:08PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల వ్యవధి ఉన్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోయిలలు తొందరపడి ముందే కూస్తున్నాయి. అధికారపార్టీ వైసీపీ సహజ ప్రత్యర్థి అయిన టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించడం గతంలో చూశాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వైసీపీ, జనసేనల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటోంది. పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రలో జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ పై ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్న సభల్లో కూడా జగన్ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రతి చోటా జగన్ పదునైన వ్యాఖ్యలతో పవన్ పై విరుచుకుపడుతున్నారు. చివరికి పవన్ మాట్లాడే శైలిని కూడా జగన్ వదలడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే.. జనసేన నేతలు ఊరుకుంటారా? వారు కూడా దీటుగా జవాబివ్వడం మొదలు పెట్టారు. దీంతో ఎవరు ఎవర్ని ఏం తిడుతున్నారో? ఎందుకు తిడుతున్నారో అనేది అర్ధం కావడం లేదు. అయితే శుక్రవారం (జూన్ 30) భీమవరం సభలో మాట్లాడిన పవన్ తాను నోరు విప్పితే జగన్ బాగోతం బయటపడుతుందని హెచ్చరించారు. మరో అడుగు ముందుకు వేసి జగన్ చేసిన దుర్మార్గాలు బయటపెడితే జగన్ తట్టుకోలేరంటూ సెటైర్లు వేశారు. జగన్ వ్యక్తిగత జీవితం చిట్టా, అరాచకాల చిట్టా, తన దగ్గర ఉన్నాయని పవన్ చెబుతున్నారు. తెలుసుకోవాలనుకున్న వారికి జగన్ చరిత్ర చెబుతానని పవన్ బహిరంగంగా ప్రకటించారు.
అయినా జగన్ జీవితం తెరిచిన పుస్తకమేనని ఆయన పార్టీ నేతలే అంటున్నారు. పవన్ ఏం చెబుతారు, 2004 నుంచి 2009 వరకూ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసిన అక్రమాల గురించి చెబుతారా? అదంతా ప్రజలకు తెలిసిందే కదా. 2004లో పరిటాల హత్య వెనుక జగన్ ఉన్నారని పవన్ చెబుతారా? ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. 2005లో బాబాయి వివేకాని కడప ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేసి ఢిల్లీ పంపారని చెబుతారా? బెంగళూరు ఎలహంకలో పాతిక ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్ గురించి చెబుతారా? 2019 ఎన్నికలలో తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్ స్వయంగా అంగీకరించి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారని చెబుతారా? నూటికి 15 మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారని అడుగుతారా? నవరత్నాల ఆశచూపి నాలుగేళ్లుగా ఆంధ్రప్రజలకు నవ దరిద్రాలను చూపిస్తున్నారని చెబుతారా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ రాష్ట్రాన్ని మద్యంలో ముంచేశారని చెబుతారా? స్వంత పినతండ్రి ప్రాణాలకు, స్వంత పార్టీ ఎంపీ కుటుంబ భద్రతకు, దళితుల ప్రాణాలకు ఏపీలో దిక్కులేదని చెబుతారా? అవినాష్ రెడ్డిని కాపాడు కోవడానికి అన్ని అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నావ్ జగన్ అని అడుగుతారా?
రాష్ట్రంలో సహజవనరులన్నీ దోచుకుంటూ ఈర్థిక స్థితిని దిగజార్చిన విషయం గురించి అడుగుతారా? రాష్ట్రంలో భూమిని, ఇసుకని, అడవిని, గనులను అప్పనంగా అప్పడంగా నమిలేశారని అడుగుతారా? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకుండా సరిహద్దుల్లో బాంబులు పట్టుకుని జగన్ కాపలా కాస్తున్నారని నిలదీస్తారా? తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రంలో బతకమని ఎందుకు తరిమేశావ్ అని జగన్ని అడుగుతారా? పేరు పక్కన రెండక్షరాలు లేకపోతే ఎలాంటి అవకాశాలూ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నావని మా జగన్ ను అడుగుతావా? నెలనెలా డబ్బులు పంచడం తప్ప మరో అభివృద్ధి కార్యక్రమం చేతకాని జగన్ పరిస్థితిపై నిలదీస్తావా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులను, హక్కులను కేసీఆర్ కు ఎందుకు రాసిచ్చేశావ్ అని నిలదీస్తారా? జిల్లాకో గూండాని తయారు చేసి రాష్ట్రమంతా పులివెందుల పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడాన్ని ప్రశ్నిస్తారా పవన్ గారూ అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
జగన్ దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవని వైసీపీ అభిమానులే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ-టీడీపీ మధ్య సాగాల్సిన పొలిటికల్ వార్ వైసీపీ్ర జనసేనల మధ్య జరగడం వెనుక బీజేపీ వ్యూహం ఉందేమో అన్న అనుమానం కొంతమంది విశ్లేషకుల్లో మొదలైంది. అదలా ఉంటే.. ఈ విషయాలు తెలియనిదెవరికంటూ అంతా నవ్వుకుంటున్నారు.