టీడీపీ-బీజేపీ పొత్తు పొడిచేనా?
posted on Jul 8, 2023 @ 1:44PM
ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని చూస్తున్నది. నిన్న మొన్నటి వరకూ కేంద్రంలో మూడో సారి అధికారంపై బీజేపీలో ఉన్న ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తుగా ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా అవునని చెప్పలేదు.. లేదని చెప్పలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది.
అదలా ఉండగానే మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేశారు. దీంతో ఈ పొత్తు కుదురుతుందా లేదా అని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పురందేశ్వరికి టీడీపీతో కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవన్నది తెలిసిందే. అందుకే ఆమె తెలుగుదేశం ను వీడి కాంగ్రెస ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో టీడీపీతో పొత్తు ఆశలు ఉన్నట్లయితే ఆమెని పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యేవారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు అనే అంశాన్ని పక్కన పెట్టేందుకే పురందేశ్వరిని ఫోకస్ లోకి తీసుకొచ్చారని.. ఇటు జనసేనకు సైతం టీడీపీతో పొత్తు లేదనే సంకేతాలను ఇచ్చేందుకే పురందేశ్వరిని ఎంపిక చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే నిజమై టీడీపీ-బీజేపీ పొత్తు లేకపోతే ఎన్టీఆర్ వారసురాలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఢీ కొనాల్సి వస్తుంది. అందుకు పురందేశ్వరి సిద్ధమయ్యే పార్టీ పగ్గాలు అందుకుంటే రాష్ట్రంలో ఫ్యామిలీ పొలిటికల్ వార్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ పొత్తుకి సిద్ధమైతే పురందేశ్వరి, చంద్రబాబు పలు చోట్ల వేదికలు పంచుకోవాలి.. కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తున్నది. అయితే దగ్గుబాటి ,నారా కుటుంబాల మధ్య అప్పుడు ఉన్నంత వైరం ఇప్పుడు లేదు. కాలంతో పాటు ఈ కుటుంబాల మధ్య దూరం కూడా తగ్గింది. ఆ మధ్య ఓ కుటుంబ వేడుకలో రెండు కుటుంబాలు కలిసి మెలిసి మెలిగిన ఫోటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కనుక రాజకీయం రాజకీయమే.. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కనుక ఏమైనా జరగవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది.
మరోవైపు బీజేపీ పెద్దలు జగన్ మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలను వదులుకోవడం లేదు. నిజంగా టీడీపీతో పొత్తు ఆశలు ఉంటే బీజేపీ ఇప్పటికే వైసీపీతో రహస్య బంధాన్ని తెగదెంపులు చేసుకునేది. కానీ, ఇప్పటికీ అదే సీక్రెట్ లైన్ మైంటైన్ చేసింది. ఈ మధ్యనే సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ ఏమో తనకి సహకరిస్తే రాబోయే తన ప్రభుత్వంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం కల్పిస్తానని ఆఫర్లు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏపీలో పొత్తు ఆలోచన చేస్తోందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే బీజేపీ నేతృత్వంలో ఈ నెల 18న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ తన పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నది. అందులో భాగంగానే టీడీపీకి సైతం ఆహ్వానం పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ ఆహ్వానం అందిన విషయాన్ని టీడీపీ ఇంకా ధృవీకరించలేదు. ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత కానీ ఏపీలో బీజేపీ-టీడీపీల అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు.