పవన్ కోరిన రూట్ మ్యాప్ పురందేశ్వరి ఇస్తారా?
posted on Jul 8, 2023 @ 4:30PM
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ మరోసారి అధికారం దక్కిచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ప్రజలలో పెరిగిన జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పాదయాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టగా.. బీజేపీ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో ఎన్నికల రోహిణీకార్తె వేడిని మించిపోయింది. అయితే, ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అంశం ఏదైనా ఉందంటే అది పొత్తులే. ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకూ రాజకీయం ఒకలా ఉంటే ఒక్కసారి పొత్తులపై స్పష్టత వస్తే ఆ తర్వాత ఉండే మజానే వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా.. సింగల్ గానే పోటీకి దిగుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
అయితే బీజేపీ-జనసేన అధికారికంగానే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో ఉన్నా ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇప్పటంలో జనసేన సమావేశం.. ఆ తర్వాత ప్రభుత్వం కక్షసాధింపుతో ప్రజల ఇళ్లను ధ్వంసం చేయడం.. మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేపట్టడం అందరూ చూసిందే. కాగా అప్పుడు అక్కడ జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని ఎదురుచూస్తున్నానని.. అది తనకు ఇస్తే ఏపీలో వైసీపీని గద్దె దించుతామని స్పష్టం చేశారు. దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కౌంటర్ కూడా ఇచ్చారు.
కాగా సోము వీర్రాజు కౌంటర్ అయితే ఇచ్చారు కానీ పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మాత్రం ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఆయన బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇ మాజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న ఎన్నికలలో పొత్తులపై కూడా చర్చించారని అంటున్నారు. ఇక ఆమె ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కనుక ఎలాగూ ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు ఆమెకి ఘనస్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధ్యక్షురాలిగా ఆమె తన వర్గాన్ని కూడా సిద్ధం చేసుకోవడం కామనే. ఎలాగూ అధిష్టానం చెప్పే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి.
అయితే ఇప్పుడు పవన్ కి పురందేశ్వరి రోడ్ మ్యాప్ ఇస్తారా? ఈ రోడ్ మ్యాప్ బీజేపీకి నచ్చినట్లుగా ఉంటుందా లేక పవన్ కోరుకుంటున్నట్లుగా ఉంటుందా? అన్నదే ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొదలైన దగ్గర నుండి ఎటు చూసినా దారులు వేరుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు టీడీపీ పేరు లేకుండా ఇదే మాట ప్రకటించేశారు. బీజేపీ మాత్రం ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకుముందున్న అధ్యక్షుడైతే టీడీపీని ప్రధాన శత్రువుగా చూసే వారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు? సోము వీర్రాజు టైంలో జనసేనతో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు తొలగిపోతుందా?.. జనసేన బీజేపీ కలసి తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయా అన్నది చూడాలి.