పొత్తులపై జనసేన నేతల నోటికి పవన్ తాళం
posted on Jul 10, 2023 6:57AM
ఏపీ రాజకీయాలలో అత్యంత హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ, జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహీ విజయయాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవగా.. దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు పవన్ స్పష్టత ఇచ్చారు.
పవన్ వారాహీ యాత్రలో తనను సీఎంను చేయాలని కోరడం.. అభిమానులు సీఎం నినాదాలు, మీరు తలచుకుంటే సీఎం అవుతానని, మీరు తనని సీఎం చేయాలని మాట్లాడడం, పలుచోట్ల అభ్యర్థులకు టికెట్ల హామీ ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కు తగ్గినట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ చానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని.. ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడంతో పొత్తు అంశం వెనక్కు వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండడంతో టీడీపీ సానుభూతిపరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా.. ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు, పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ.. సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దని కోరారట. అంతే కాదు, పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ, పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దని.. ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట.
పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. లోతుగా అధ్యయనం చేశాకనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ సంయమనం పాటించాలని చెప్పారట. అయితే, టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావడంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీచేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈ లోగా టీడీపీ-జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్ళకి తాళం వేసినట్లు భావించాల్సి వస్తుంది.