మోడీ తెలంగాణ పర్యటన.. బీజేపీలో కనిపించని జోష్!
posted on Jul 8, 2023 @ 11:05AM
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీలో ఎలాంటి హడావుడీ కనిపించడం లేదు. నిన్న మొన్నటి దాకా ఎన్నికలు జరగడమే తరువాయి.. అధికారంలోకి వచ్చేది మేమో అన్న స్థాయిలో హంగామా చేసిన తెలంగాణ బీజేపీ నేతలలో ఒక్క సారిగా నిశ్శబ్దం ఆవరించింది. కొత్తగా పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమితులైన ఈటల, మాజీ అధ్యక్షుడు బండి ఏదో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మోడీ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నారే కానీ పార్టీ క్యాడర్ లో మాత్రం ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు.
కర్నాటక ఎన్నికల ఫలితానికి తోడు.. తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన పేరుతో హైకమాండ్ ఇటీవల చేసిన మార్పులు తోడు కావడంతో బీజేపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. మొదటి నుంచీ పార్టీలోనే కొనసాగుతూ.. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు, ఉత్సాహం తీసుకువచ్చేలా వరుస కార్యక్రమాలతో బీఆర్ఎస్ ను బెంబేలెత్తించిన బండికి అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికి.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన ఈటలకు ప్రమోషన్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
అలాగే గతంలో రెండు సార్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసినా పార్టీ ఎదుగుదల విషయంలో పెద్దగా ప్రభావం చూపని కిషన్ రెడ్డికి మళ్లీ పార్టీ పగ్గాలు ఇవ్వడంపై కార్యకర్తలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
అన్నిటికీ మించి బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందనడానికి ఈ మార్పులు దోహదం చేశాయన్న భావన పార్టీలో అత్యధికుల్లో ఏర్పడిందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనూ, ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తరచూ విమర్శలతో విరుచుకుపడి.. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు దోహదపడిన బండి సంజయ్ ను అర్ధంతరంగా తప్పించడం పట్ల మెజారిటీ కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది. అలాగే లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవితకు ఆయాచితంగా దక్కుతున్న ఊరటపైనా బీజేపీ శ్రేణుల్లో పై స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం కేసులో కవిత వినా అందరూ అరెస్టయ్యారు.
కవితను ఈడీ, సీబీఐలు విచారించాయి. ఈడీ అయితే ఏకంగా ఆమె ఫోన్లనూ స్వాధీనం చేసుకుంది. చార్జిషీట్లలో ఆమె పేరూ ప్రస్తావించింది. అంతే అక్కడితో కవిత విషయంలో ఈడీ, సీబీఐలు సైలెంట్ అయిపోయాయి. మరో వైపు ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లో మగ్గుతున్నారు. ఆ కారణంగానే బీఆర్ఎస్, బీజేపీల మధ్య లాలూచీ ఉందా అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చి వరంగల్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయన వరంగల్ సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగే అవకాశాలున్నాయి. ఆయన ఎంత ఘాటుగా బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలు గుప్పించినా ప్రజలు మాత్రం విశ్వసించే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.