వైసీపీలో వైఎస్సార్ బ్రాండ్ మాయం!
posted on Jul 10, 2023 7:24AM
దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అసలైన వారసులు ఎవరంటే కుమారుడు వైఎస్ జగన్ తో పాటు కుమార్తె షర్మిల కూడా నేనున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే, అసలైన వారసుడిగా జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన కొన్ని సంక్షేమ పనులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టాయి. వైఎస్ఆర్ పాలనపై నమ్మకం కుదిరిన వారే జగన్ కోరిన ఒక్క ఛాన్స్ నినాదానికి పడిపోయారు. ఏది ఏదైతేనేం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది వైఎస్ఆర్ కుమారుడిగానే. అందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, కట్టే ప్రతి నిర్మాణానికి ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడెప్పుడో కట్టిన వాటికి సైతం పేర్లు మార్చి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.
ఇక, ఈ నాలుగేళ్ళలో ఎప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లె స్థాయి కార్యకర్త నుండి సాక్షాత్తు సీఎం వరకు ఈ వేడుకలను ప్రత్యేకంగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఈ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించేవారు. ఇడుపులపాయను సుందరంగా అలంకరించి తమ నేతకు ఘన నివాళి అర్పించేవారు. కానీ, తాజాగా జులై 8న వచ్చిన వైఎస్ఆర్ జయంతిలో ఎక్కడా గతంలో స్థాయిలో జోష్ కనిపించలేదు. సాక్షాత్తూ ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్ రెడ్డే తన తండ్రి ఘాట్‌కు వెళ్లి పూలుచల్లి నివాళి అర్పించి అటు నుండి అటు పులివెందుల పర్యటనకి వెళ్లిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా కూడా 150 మంది ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించలేదు. రాయలసీమలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్నా చితకా సేవా కార్యక్రమాలు నిర్వహించగా రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడా ఆ స్థాయి కార్యక్రమాలు కూడా లేవు. గ్రామాలలో అంతకు ముందు మూడేళ్లు కేక్ కటింగ్, స్వీట్లు పంచడం, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించగా ఈసారి దాదాపుగా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీలో వైఎస్ఆర్ మ్యానియా ఏమైందని సహజంగానే అనుమానాలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు, పెద్దలు కావాలనే ఈసారి వైఎస్ఆర్ జయంతిని పక్కన పెట్టారా? లేక అధిష్టానం చెప్పినా ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఆ పార్టీ శ్రేణులలోనే మొదలైంది.
కారణం ఏంటన్నది తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం లేదు. అంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం ఇప్పుడు తెచ్చే పథకాలకు జగనన్న పేరు వచ్చేలా చూసుకుంటున్నారు., పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే కనిపిస్తుంది.. వినిపిస్తున్నది. బహుశా తండ్రి లెగసీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు తన సొంత ఇమేజ్ ప్రజలపై ఉండేలా చూడాలనే ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడూ అదే క్రమంలోనే వైఎస్ఆర్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా సోసోగానే చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. అయినా ఈసారి వైసిపీ ఆ పని చేయలేదు.
ఒకవైపు అధిష్టానం ఈ వేడుకలపై ఫోకస్ పెట్టకపోగా.. ఆ పార్టీలో ఇతర సమస్యల కారణంగా నేతలు కూడా మొహం చాటేసినట్లు కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేక లైట్ తీసుకున్న వాళ్ళు కొందరు, తనకు ఈసారి టికెట్ వస్తుందనే ఆశలేని నేతలు కొందరు.. ఇలా ఎవరికివారే మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న నెల్లూరు లాంటి జిల్లాలలో ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోవడం.. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తితో ఉండడం లాంటి కారణాలు కూడా వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మమ అనిపించేయడానికి కారణంగా చెబుతున్నారు. అయితే, అసలే ఎన్నికల సమయం కనుక కనీసం అధిష్టానం అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం చూస్తుంటే దీని వెనక వాళ్ళ ఆలోచన మరేదైనా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది.