నిన్నటి వరకూ జగన్.. ఇప్పుడు అవినాష్.. వైనాట్ 175
posted on Jul 8, 2023 7:20AM
వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి 175కి 175 సీట్లు ఖాయమని సీఎం జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌నే ఆదరిస్తున్నారని చెప్పారు. గురువారం (జూన్ 6) పులివెందుల బాకరాపురం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఎన్ని మాయ మాటలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారంటూ సోదరుడిపై అవినాష్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌ను ఎవరు ఏమీ చేయలేరన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలే.. ఆయన్నిమరోసారి ముఖ్యమంత్రి చేస్తాయని అవినాష్ రెడ్డి క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
అయితే అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల వేళ.. మీ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని... ఆ హత్య కేసులో మీరు, మీ తండ్రి భాస్కరరెడ్డిలు రోపణలు ఎదుర్కొంటున్నారని.. అయితే తెరచాటు రాజకీయం చేసి.. మిమ్మల్ని రక్షిస్తోంది ఎవరో.. ప్రతీ ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యమేనని వారు పేర్కొంటున్నారు. వివేకా హత్య కేసుకు ముగింపు చెప్పకుండా.. దోషులు ఎవరో అధికారికంగా ప్రకటించకుండా.. వారికి శిక్షలు పడకుండా.. మీరు ఎన్నికలకు వెళ్లితే జరిగే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ముందుగా వాటికి సిద్దంగా ఉండాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
హత్య కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి.. అప్రూవర్‌గా మారి సీబీఐ ఏదుట హత్య జరిగిన తీరు తెన్నుల నాటి నుంచి నిన్న మొన్నటి వరకు అంటే.. మీ తల్లిగారి అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మీరు అక్కడే ఉండిపోవడం... ఆ సమయంలో సీబీఐ, మీరు ఆడిన దొంగా.. పోలీస్ ఆట మాత్రం.. చాలా రసవత్తరంగా సాగిందంటూ వైయస్ అవినాష్ రెడ్డిపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.
మరోవైపు 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి, వైయస్ వివేకా హత్యల వెనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉందంటూ నాటి ప్రతిపక్ష నేత జగన్.. స్వయంగా ఆరోపణలు గుప్పించారని.. అలా ఆ ఎన్నికల్లో గెలిచిన మీరు.. ఈ కేసులో నిజా నిజాలు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేని స్థితిలో ఉండిపోవడం నిజంగా సిగ్గు చేటని అంటున్నారు.
మరి ఈ కేసులో దోషులు ఎవరో తేలకుండా.. ఎన్నికలకు వెళ్లితే.. మీకు, మీ పార్టీకే నష్టమని... ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివేకా హత్య కేసు దర్యాప్తునకు ముగింపు పలకాలని వారు సూచిస్తున్నారు. ఈ హత్య కేసులో దోషులు ఎవరో తేలి... వారికి కఠిన శిక్ష పడితే.. వరుసగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై జగన్ కూర్చుంటారని వారు ఢంకా భజాయించి మరీ చెబుతుండడం విశేషం.
ఇక గత ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. రాష్ట్ర ప్రజలే కాదు.. వైయస్ జగన్ తల్లి, సోదరి వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తదితరులంతా ఒక్కటై జగన్ వెంటే అడుగులో అడుగు వేసి నడిచారని.. కానీ నేడు వారంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మీ కోసం, మీ పార్టీ కోసం ఐ ప్యాక్ తప్ప రంగంలోకి దిగేవారు ఎవరు ఉన్నారంటూ అవినాష్‌రెడ్డిని నెటిజన్లు సూటిగా ప్రశ్నస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకే అవుతోందా? అనేది ఒక్క సారి మనస్సాక్షిని అడగాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండి.. సొంత బాబాయి హత్య కేసు... నేటికి తెలకపోవడం చూస్తుంటే.. మీ గొయ్యి మీరే తవ్వుకొన్నట్లుగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఈ విషయాన్ని కాస్త శ్రద్ద పెట్టి పరిశీలించాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.