మా నిధులు మీరెలా వాడేశారు.. జగన్‌పై కేంద్రం సీరియస్
posted on Jul 10, 2023 7:20AM
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా తెచ్చిన అప్పులు పెరిగి ఇప్పుడు పెద్ద అనకొండలా మారిపోయాయి. రాష్ట్రంలో దెబ్బతిన్న అభివృద్ధి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకపోవడం, వైసీపీ నేతల తీరు కారణంగా పెట్టుబడులు పెట్టేవారు రాష్ట్రం వైపు చూడడమే మానేశారు. ఉన్న వాళ్ళలో కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేక పప్పు బెల్లం మాదిరి తలకి ఇంత చొప్పున చేసే పంపకాలు పెరిగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. మరో వైపు కరోనాతో దెబ్బతిన్న సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిపై భారీగా ధరల పెంపు పిడుగు పడడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉన్న ఆదాయం కూడా దిగజారిపోయింది. దీంతో ఏపీ పరిస్థితి ఆర్ధికంగా అగమ్యగోచరంగా మారిపోయింది.
ఏపీలో గత ఏడాది కాలం నుండి నెలా నెలా జీతాలకు, పెన్షన్లకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితి. గత రెండేళ్లుగా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒకటో తేదీన జీతం అందలేదు. కొందరైతే ఏ నెలకి ఆ నెల జీతం చూడడంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, బాండ్లు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, పలు దేవాలయాల ఆదాయాన్ని కూడా తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా పరిమితికి మించి అప్పులు చేసింది. ఇవి చాలవని వివిధ కార్పొరేషన్ల నిధులు, కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా తన ప్రభుత్వాన్ని నడిపేందుకు వాడుకున్నారు. అలాగా ఇప్పుడు కేంద్రం ఒక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వగా.. జగన్ ప్రభుత్వం దాన్ని సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను తక్షణమే సంబంధిత ఖాతాలో జమ చేసి రసీదులను పంపించాలని ఆదేశించింది. ఈ విషయం ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపింది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కూడా ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ మధ్యనే అందుకోసం కేంద్రం నిధులకు కేటాయిస్తుంది. ఈ క్రమంలో భాగంగా 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వనుండగా 10 శాతం నిధులను రాష్ట్రాలు భరించాలి. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధి దారులను ఎంపిక చేసి, ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇస్తుండగా.. ఈ మధ్యనే పలు రాష్ట్రాలకు నిధులను జమ చేసింది. ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్లను జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లించింది. దీంతో కేంద్రం ఆగ్రహించింది.
కేంద్ర పథకానికి, పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులపై సమాచారం లేకుండా మల్లింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.639 కోట్లను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఆ నిధులను సింగిల్ నోడల్ ఖాతాకు జమ చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకసారి విడుదల చేసిన రూ.1879 కోట్లలో నుంచి రూ.639 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. నిజానికి ఈ పథకంలో భాగంగా రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా జమ చేయకపోవడం వలనే ఈ నిధులు అలా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇవ్వాల్సినని ఇవ్వకపోగా.. సమాచారం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నిధులను మళ్లించడం కేంద్రానికి కోపం తెప్పించింది.