హిందుపురంలో బాలయ్య విజయం నల్లేరుమీద బండి నడకే
posted on Jul 8, 2023 @ 10:15AM
ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని లేదు.. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి మొదలైన అసమ్మతి గళం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ వ్యాపించింది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైసీపీ కూర్చున్న కొమ్మను నరుక్కునే కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని అత్యంత కీలకమైన హిందూపురం అసెంబ్లీ సెగ్మంట్లో వైసీపీ వర్గపోరు తార స్థాయికి చేరింది.
ఈ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్న బాలకృష్ణను ఈ సారి ఎలాగైనా ఓడించాలన్నది సీఎం జగన్ టాస్క్ గా పెట్టుకున్నారు. అయితే నియోజకవర్గంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులు మాత్రం జగన్ టాస్క్ నెరవేరేందుకు ఎంత మాత్రం అనుకూలంగా లేవు. హిందుపురం ఇన్ జార్జీ, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఇక్బాల్ కు నియోజవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఆ వ్యతిరేకత సొంత వైసీపీ నుంచే కావడంతో నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీనికి తోడు ఇక్బాల్ వ్యతిరేక వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించింది.
పార్టీ ఇన్ చార్జి తీరును గర్హిస్తూ నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్బాల్ వ్యతిరేక వర్గం వినతి పత్రం కూడా సమర్పించింది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడకుండా ఉండాలంటే ఈ హిందూపురం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయడమొక్కటే మార్గమని ఇక్బాల్ వ్యతిరేక వర్గం వారు గట్టిగా చెబుతున్నారు. తమ డిమాండ్ జగన్ చెవికి చేరే వరకూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని అంటున్నారు.
నియోజకవర్గంలో నవీన్ నిశ్చల్, ఇక్బాల్ ల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్బాల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఓటమికి వర్గపోరే కారణమని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా ఇక్బాలే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో నవీన్ నిశ్చల్ వర్గీయులు ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అందుకు ప్రతిగా ఇక్బాల్ వర్గం కూడా ప్రతి చర్యలు మొదలు పెట్టింది. దీంతో హిందూపురం నియోజకవర్గంలో నిత్యం వైసీపీ వర్గ పోరు విపక్షాలకు ఆనందాన్ని కలిగిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు తోడు వైసీపీలో విభేదాలు హిందుపురంలో వైసీపీని నామమాత్రంగా మార్చేశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇక్కడ నందమూరి బాలకృష్ణ విజయాన్ని నల్లేరుమీద బండినడకగా మార్చేస్తాయని చెబుతున్నారు. ఇక్బాల్ స్థానంలో మరో ఇన్ చార్జిని నియమించి వైసీపీ అధిష్ఠానం నష్ట నివారణకు చర్యలు చేపట్టినా.. ఇప్పటికే ఆలస్యమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.