కేసీఆర్ సర్కార్ కు హిమాన్షు షాక్.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ఆవేదన

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు హిమాన్షు బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పరువును నిలువుగా గంగలో ముంచేశారు.  గౌలిదొడ్డిలోకి కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు తన స్నేహితులతో కలిసి రూ.40 లక్షలు కంట్రిబ్యూట్ చేసి పాఠశాలకు సకల సౌకర్యాలూ కల్పించారు. ఇది హర్షించదగ్గ విషయమే. ముఖ్యమంత్రి మనవడు బాధ్యత వహించి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించవచ్చ. కానీ అదే సమయంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సర్కారు స్కూళ్ళ దుస్థితి ని పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ పాఠశాలను సందర్శించిన హిమాన్షు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల వెంబడి నీళ్లోచ్చాయని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి  బీఆర్ఎస్ సర్కార్ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద పీట వేశాం, సౌకర్యాలు కల్పించాం అని చెప్పుకుంటున్నదంతా మాటలకే పరిమితమని స్వయంగా సీఎం మనవడే చెప్పినట్లైంది.  రాష్ట్రం  అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా  పరుగులు పెడుతోందంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే కేశవనగర్ పాఠశాల దుస్థితిపై హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ ప్రచారం చూస్తుంటే సర్కార్ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతను గుర్తుకు తెస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం వేదికగా కేసీఆర్ సర్కార్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనడానికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.    స్వంత చొరవతో సమకూర్చిన నిధులతో బాగుపడిన ఆ స్కూల్‌లోని కొత్త తరగతి గదులు, ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం( జూలై 12) ప్రారంభించారు.  ఆ సందర్భంగా హిమాన్షు ప్రసంగం క్షేత్ర స్థాయిలో మన వూరు  మన బడి కార్యక్రమం ఎంత సుందరముదనష్టంగా అమలు అవుతోందో కళ్లకు కట్టింది.

చంద్రయాన్‌ 3కు .కౌంట్‌డౌన్‌ ప్రారంభం

చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం (జూలై 13)మధ్యాహ్నం 2 గంటల 35 నిముషాల 13 సెకండ్లకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై 24 గంటల పాటు కొనసాగుతుంది. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 35 నిముషాల13 సెకండ్లకు  గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెడుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్‌ షార్ కు చేరుకుని వాహక నౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి గృహంలో చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.   2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.   చందమామపైకి ల్యాండర్‌ను విజయవంతంగా జారవిడిచిన చంద్రయాన్‌ -1  తరువాత  ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. లోపాలను సవరించుకొని  చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం (జూలై14)నుంచి సరిగ్గా 40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది.  

వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేష్ న్యాయ పోరాటం.. పాదయాత్రకి బ్రేక్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట నాలుగువేల కిమీ పాదయాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ రెండు వేల కిమీ పాదయాత్ర పూర్తి చేసుకోగా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే, యువగళం యాత్రకు రెండు రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తనపై, తన కుటుంబంపై త‌ప్పుడు వార్తలు రాస్తూ, త‌న‌ని అప్రతిష్టపాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోందంటూ   గతంలో ఆయన ఒక దినపత్రికపై ప‌రువున‌ష్టం దావా వేశారు. వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు.  వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో   శుక్రవారం (జూలై 13) న‌మోదు చేయ‌నున్నారు. దీంతో యువ‌గ‌ళం పాద‌యాత్రకి  శుక్రవారం (జులై 13), శనివారం (జూలై 14) ల‌లో విరామం ప్రక‌టించారు. 12న పాదయాత్ర ముగించుకొని లోకేష్  అమ‌రావ‌తి కి వెళ్లనున్నారు. అనంతరం మళ్ళీ  ఆదివారం (జూలై15) యువగళం యాత్ర పునఃప్రారంభం కానుంది. కాగా, గతంలో వైసీపీ నేతలు.. టీడీపీ, చంద్రబాబు, నందమూరి కుటుంబాలపై తీవ్రంగా విషం చిమ్మిన సంగతి తెలిసిందే. చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కూడా చంద్రబాబుపై అసత్య ప్రచారం చేశారు. అలాగే ఆ మధ్య లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై కూడా వైసీపీ నేతలు సోష‌ల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన లోకేష్ అప్పట్లో  క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు విచారణకి వచ్చాయి.  ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారని ఫేక్ ప్రచారం చేశారు.  త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటికి లోకేష్ త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి కార్యాల‌యాల‌కు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివ‌రికి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు.  మరో వైసీపీ నేత, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సెప్టెంబ‌రు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని.. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని   ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌పైనా మందూ మగువ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సునీత చేసిన దారుణ‌మైన   వ్యాఖ్యలపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖ‌లు చేశారు. త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ‌పోరాటం మొద‌లుపెట్టారు. ఇప్పుడు ఈ కేసులలో లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు చేయనుంది.

స్పీడ్ న్యూస్ -2

21.సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు. 22.భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోయే అవకాశమే లేదని, అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని జనసేనానికి  ఎపి ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి హితవు పలికారు. పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదని తేల్చిచెప్పారు.  23. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.  24.  మూడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అని ఆయన అభివర్ణించారు. 25. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమాచారం. 26.   ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోసభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. 27.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో వరుసగా రెండోసారి ఓడిపోయిన భారత్.. నెల విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది.  భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.   28.ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు.  29. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రద్దా వాకర్ హత్య ఘటన తరహాలో మరో యువతి హత్య జరిగింది. 30.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్‌ ఫ్లాట్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. 31.బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ ఇటీవల ప్రయాణం రద్దు చేసుకుని ఎయిర్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ.13,820 పెట్టి కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేస్తే సదరు ఎయిర్ లైన్స్ కంపెనీ తిరిగిచ్చింది. కేవలం 20 రూపాయలు మాత్రమే చార్జి వసూలు చేసింది. 32. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. 33.ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వచ్చే నెల లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 34. గత రెండు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలు, ఆంధ్రతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మంలో ఎక్కువగా ఉన్న ఆంధ్ర సెటిలర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు టీకాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.గులాబీ పార్టీ నేతల వైఖరిపై ఆంధ్ర సెటిలర్స్‌లో ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 35. బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం మూడు పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలని విమర్శించారు.  36.ప్రఖ్యాత మైత్రి  బ్యానర్ ఇప్పుడు ఇతర భాషా చిత్రాల నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయడం మొదలెట్టింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. అలాగే మల్లూవుడ్ లోను ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 37.సంచలనం సృష్టించిన జగన్ పై దాడి కేసు విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నిన్న ఈ కేసు విచారణ జరిగింది.  38.అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది.  అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.  39.వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.  40.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడంలేదు. వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర" అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. 41.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని ఓ వాలంటీర్ కాళ్లు కడిగారు. 42.ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో అనేక జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైంది.  43. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వివాదానికి తెరపడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  తెలిపారు. తాను స్వయంగా కడియం కులం గురించి ప్రస్తావించలేదని, గతంలో ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఉటంకించినట్లు చెప్పారు. 44.ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక, విహార యాత్రకు వెళ్లారు. 45.ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో మరో చీతా మృతి చెందింది. నాలుగు నెలల వ్యవధిలో ఇది 7వ చీతా మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో జరిగింది.  46.తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. సీఎంగా ఎవరికైనా అవకాశం లభించవచ్చని, ఇప్పుడు చెప్పలేమని తెలిపారు.  47.  వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా టాటా స్ట్రైడర్  కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.  48.యూనిఫామ్ సివిల్ కోడ్‌పై అభిప్రాయాలు తెలపాలని 22 వ లా కమిషన్ జూన్ 14 వ తేదీన ప్రకటన విడుదల చేసింది. జులై 10 వ తేదీ సాయంత్రం వరకు 46 లక్షల అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  49.ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.  50.మనీల్యాండరింగ్ కేసులో  నిందితులుగా ఉన్న పాకిస్థాన్ ప్రధాని  షెహబాజ్ షరీష్ ( కుమారుడు సులేమాన్ షేబాజ్‌ సహా పలువుర్ని ప్రత్యేక జిల్లా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రూ.1,600 కోట్ల పీకేఆర్ మనీ ల్యాండరింగ్ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ప్రధాని కుమారుడు సులేమాన్ షేబాజ్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. 

పొత్తులుంటాయి కేంద్ర మంత్రి.. చులకన కాదల్చుకోలేదు.. బాబు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ, బీజేపీలు అడుగులు వేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్న అంచనాల నడుమ మరో సారి అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీసీ ఆడుతున్న మైండ్ గేమ్ కు బీజేపీ తోడైందంటున్నారు. అటువంటి మైండ్ గేమ్ లో భాగంగానే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం, జనసేనలతో బేజీపీ పొత్తు ఉంటుందన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు స్పందించబోనని ,అలా స్పందించి చులకన కాబోననీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ తో  వైసీపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపడం, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు, రాష్ట్రపర్యటనకు వచ్చిన ఆ పార్టీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడం ప్రజలలో  కన్ఫ్యూజన్ క్రియోట్ చేయడమనే వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో సారి అధికారంలోకి రావాలంటే మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పేరుకే కేంద్రంలో ఉన్నది  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అయినా.. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలేవీ సొంతంగా ఒకింత బలం ఉన్న పార్టీలు కావు. లోక్ సభలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  బీజేపీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను అధిగమించి బలం చాటాలంటే ఎన్డీయేను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి. మరో వైపు ఇటీవలి కాలం వరకూ బలహీనంగా కనిపించిన కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒక్కసారిగా బలోపేతం అయ్యాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతే ఇందుకు కారణమని వేరేగా చెప్పాల్సిన  అవసరం లేదు.  ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పాత మిత్రులను దరి చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఈ నెల 18న సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంలో మోడీ సర్కార్ పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతో పాత మిత్రులను కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలోనే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఒకే సమయంలో అధికార, విపక్షాలతో సంబంధాలను నెరపుతూ.. అవసరాన్ని బట్టి.. అంటే వచ్చే ఎన్నికలలో   వైసీపీ, తెలుగుదేశంల పెర్ఫార్మెన్స్ ను బట్టి, తన అవసరాలను బట్టి జట్టు కట్టాలన్న వ్యూహంతో కమలనాథులు పావులు కదుపుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఒకలా, హస్తినలో ఒకలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కేంద్రం స్థాయిలో జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే.. రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కర్రవిరగకుండా, పాము చావకుండా అన్న టెక్నిక్ ను ఉపయోగిస్తోందంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై చంద్రబాబు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా స్పందించడమే కాకుండా   దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.   ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్ దుర్మార్గపాలనను అంతమొందించడమే తన ధ్యేయమని చెప్పారు. ఇదొక పెద్ద బాధ్యత అందుకే పెద్ద ఆలోచనలూ చేయాలి.  పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ.  జగన్.. ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదన్న చంద్రబాబు,    ఓట్ల అవకతవకలపై ఢిల్లీని వదిలిపెట్టేది లేదన్నారు. ఓట్ల తీసివేత, దొంగ ఓట్ల నమోదులను సరిదిద్దకపోతే కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోతుందన్నారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన ఖండించారు.  వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందనీ, వలంటీర్ల ఉద్యోగాలకు ఢోకా లేదనీ భరోసా ఇస్తూనే వాలంటీర్ల సేవలను పౌర సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా ఆయన కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై స్పందించి చులకన కాదలచుకోలేదంటూనే ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియోట్ చేయడానికి జగన్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా రాజీలేకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 

తెలంగాణ బీజేపీ మూడు ముక్కలు!

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు  అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి.   బీజేపీ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం పేరుతో వలస నేతలను ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు బీజేపీలో నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈ అసమ్మతిని తొలగించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు  అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆ అసమ్మతి రాగం ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. పైగా అది పెరిగి పార్టీని ముక్కలు చేస్తున్నది. అంతర్గత కుమ్ములాటను తగ్గించేందుకు తెలంగాణ బీజేపీలో   ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున మార్పులను చేసింది. ముఖ్యంగా నాయకత్వ మార్పుతో అయినా పార్టీ గాడిన పడుతుందని అధిష్టానం భావించింది.  అయితే అందుకు భిన్నంగా అంతకు ముందు పార్టీలో రెండు వర్గాలు  ఉంటే ఇప్పుడు ప్రక్షాళన తరువాత మూడవ వర్గం ఏర్పడి పార్టీ లో మూడు ముక్కలాట పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. నిజానికి బండిని తప్పించాలనే డిమాండ్ మరో సీనియర్ నేత ఈటల రాజేందర్, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావుది. వీళ్ళు బాహాటంగానే బండి నాయకత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, బండిని తప్పించాలని కోరిన వారికి కాకుండా కిషన్ రెడ్డికి పార్టీ అప్పగించింది అధిష్టానం. రెండు వర్గాలను కలుపుకుపోతాడనే కిషన్ కు ఈ పని అప్పజెప్పింది. కానీ, ఆ రెండు వర్గాలు కలిసిపోవడం సంగతెలా ఉన్నా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కిషన్ కు మరో వర్గం ఏర్పడింది. ఫలితంగా ఇప్పుడు ఒకే రాష్ట్ర శాఖలో మూడు వర్గాలు ఏర్పడి ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.   దీంతో ఇలాంటి ప‌రిస్థితుల్లో కిష‌న్‌రెడ్డిని ఎంపిక చేయ‌డం బీజేపీకి ఏమాత్రం క‌లిసొచ్చే విష‌యం కాదంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఈ మూడు వర్గాలలో ప్రధానంగా ఈటల వర్గం తనకు అధ్యక్ష పదవి దక్కలేదనే ఆవేశంలో ఉండగా.. బండి వర్గం తమ నేతలు తప్పించడంపై అసమ్మతి వెళ్లగక్కుతుంది. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వెనక సీఎం అభ్యర్థిగా హామీ ఉందనే ప్రచారంతో ఈటల, బండి   వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మరోవైపు ఈటలకు చేరికల కమిటీ బాధ్యతలు ఇవ్వడంపై కూడా ముందు నుండీ పార్టీలో ఉన్న సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరికి వారు మూడు వర్గాలు తన నాయకుడే సీఎం అభ్యర్థిగా  ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో  మూడు ముక్కలాటతో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది.  అధిష్ఠానం తీసుకున్న నాయకత్వ మార్పు నిర్ణ‌యం వ‌ల్ల క్యాడ‌ర్‌లో ఇంకా గందరగోళం పెరిగింది. వ‌ర్గ‌పోరు చ‌ల్లార‌క‌పోగా మ‌రింత ఎక్కువైంది. దీంతో ఇప్పుడు స‌గ‌టు బీజేపీ కార్య‌క‌ర్త‌ల్లో బీజేపీని న‌మ్ముకోవ‌డం క‌రెక్టు కాదేమో అన్న సందిగ్ధ‌త‌కు బీజం పడినట్లు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజానికి మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వర్గ పోరు బీజేపీకి తగులుకుంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే తెలంగాణలో బీజేపీ మళ్ళీ జీరో స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఈ నేతల అసంతృప్తిని మాఫీ చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.

స్పీడ్ న్యూస్ 1

1.దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు. 2.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీతక్క కూడా సీఎం అయ్యే అవకాశం ఉందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేవంత్ మాటలపై సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు.  3.ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశమయ్యారు.  4. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రమంగళవారం సాయంత్రం కావలి నియోజకవర్గంలో పూర్తయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు  గిట్టుబాటు ధర కల్పిస్తామని  ఈ సందర్బంగా నారా లోకేశ్      హామీ ఇచ్చారు.  5. 2016-17 నుండి 2021-22 మధ్య ఆరేళ్ల కాలంలో ఇతర అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూడు రెట్లు ఎక్కువగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే వస్తున్నాయి. 6. రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  7.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు.  8. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అన్నారు. 9.ఉమ్మడి పౌర స్మృతి  బిల్లు ఒకసారి పార్లమెంటులో పాస్ అయ్యాక, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. కె సి ఆర్ దేశం విడిచివెళతానంటే ఎవరూ ఆపరని అన్నారు. 10.జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఏలూరుజిల్లా ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమయ్యారు.  వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 11.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకైనా వచ్చిన సమస్య ఏమిటని ఆమె ప్రశ్నించారు. 12.ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న, ఇప్పటికే చేసిన పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. 13.ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు.  14. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు అనుమతులను ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం సిఫారసు చేయనుంది.  15.తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టడమే గాక విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని పట్టుకుని వధువు బంధువులు మండపంలోనే చితకబాదారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం గయ జిల్లాలో జరిగింది. 16.తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. 17.బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్  సలహాతో తాను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని మరో బాలీవుడ్ నటి కశ్మీరా షాతెలిపింది. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించమని సల్మాన్ చెప్పారని... ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తమ జంట  తల్లిదండ్రులమయ్యామని   చెప్పింది. 18.  మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.  వీటిలో పూర్ టు రిచ్ విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది.  పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా... ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు అన్నారు. 19. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ఆమె ప్రారంభోత్సవ  సభలో కాసేపు మాట్లాడి కూర్చుండిపోయారు. 20. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నాలుగో తరగతి గిరిజన విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు.జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.

లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకొంది. ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం (జులై 11)  ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లిలో 2 వేల కిలోమీటర్లు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా లోకేశ్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.   అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర .. కేవలం 153 మూడు రోజల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొన్న సందర్బంగా కొత్తపల్లిలో నారా లోకేశ్  పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర.. అప్రతిహతంగా సాగుతోండడం పట్ల.. టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  లోకేశ్ చేపట్టిన పాదయాత్ర రాయలసీమలో ప్రారంభమై.. 53 నియోజకవర్గాల్లోని 135 మండలాల మీదగా వందలాది గ్రామాల్లో నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో నారా లోకేశ్ .. 30 లక్షల మందిని నేరుగా కలవగా.. వివిధ వర్గాల ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.    ఇంకోవైపు ప్రతీ 100 కిలోమీటర్లకు ఆయన ఓ హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా శిలాఫలకాలను  ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్బంగా కొత్తపల్లిలో పిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తామని ప్రజల్లో నారా లోకేశ్ భరోసా కల్పిస్తున్నారు.    ఇక నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఎక్కడా విరామం లేకుండా సాగుతోంది. అయితే అత్యవసరం అయితే తప్ప.. అంటే.. నందమూరి తారకరత్న మరణించిన సమయంలో.. ఆయన బౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఒక సారి.. అలాగే ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తరాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పార్టీ పండగ మహానాడు సందర్బంగా మాత్రమే.. నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన విషయం విదితమే.    అధికార జగన్ పార్టీ, పోలీసులు కలిసి ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. నారా లోకేశ్ మాత్రం తనదైన శైలీలో.. తాను అనుకున్న లక్ష్యం దిశగా వడి వడిగా అడుగులు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నారు. లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్రను నాలుగు వందల రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. అంటే నారా లోకేశ్ సగం లక్ష్యాన్ని పూర్తి చేసుకొని.. ఆయన అడుగులు లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ నారా లోకేశ్.

సుప్రీంలో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ.. అమరావతి కేసుల విచారణ డిసెంబర్ కు వాయిదా

ఏపీ రాజధాని విశాఖ ఇప్పట్లో.. ఇప్పట్లో ఏంటి అసలు సాధ్యమే కాదని తెలుగువన్ ముందే చెప్పింది. ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీం కోర్టు  అమరావతి కేసుల విచారణను  డిసెంబర్ కు వాయిదా వేసింది. సత్వర విచారణ కోసం ఏపీ తరఫు న్యాయవాదులు పదే పదే విజ్ణప్తి చేసినా సుప్రీం కోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు. దీంతో త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతుంది.. తాను  కూడా త్వరలోనే విశాఖకు మకాం మార్చేస్తున్నానంటూ జగన్ చెబుతున్న మాటలు ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేదన్నది తేటతెల్లమైపోయింది. రాజధాని కేసుల విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్ కు వాయిదా వేయడంతో వచ్చే ఎన్నికలలోగా జగన్ విశాఖ కలలు నెరవేరే అవకాశం లేదన్నదీ తేటతెల్లమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్  విశాఖ మకాం మార్పు గురించి చెప్పారు. అది జరిగి ఇప్పటికి ఐదు నెలలు అయ్యింది.  వాస్తవానికి విశాఖ గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు అసెంబ్లీలో, మీడియా సమావేశాలలో, పలు  సభలలో కూడా జగన్ తాను విశాఖ నుంచే పాలన సాగిస్తాననీ, సీఎం ఎక్కడ ఉంటే అది రాజధాని అవుతుందని చెప్పిన సంగతి విదితమే. తన మకాం విశాఖ మార్చేందుకు జగన్ ఇప్పటికే పలు ముహూర్తాలు నిర్ణయించారు. ఒకసారి ఈ సంక్రాంతి, ఇంకోసారి ఈ దసరా.. ఇలా ఎప్పటికప్పడు ముహుర్తాలు  ఫిక్స్ అయితే చేశారు కానీ ఆయన అడుగు మాత్రం తాడేపల్లి ప్యాలస్ దాటి పడలేదు.  ఒక సమయంలో అయితే సీఎం విశాఖలో ఉండేందుకు నివాసం కోసం గాలింపు మొదలైందనీ, బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారనీ కూడా వార్తలు వచ్చాయి. అయితే  ఇప్పటికీ ఆయనకు విశాఖలో నివాసం ఉండేందుకు ఇల్లు దొరకలేదు. మూడు రాజధానుల ముచ్చట ముందుకు సాగలేదు.  విశాఖ నుండే పరిపాలన అన్న మాటలు సముద్ర అలల్లా ముందుకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లిపోయాయి.  సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన ఘటనతో  నగర ప్రతిష్ట బంగాళాఖాతంలో కలిసిపోయిందనీ, దీంతో  వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు విశాఖ రావడం అటుంచి..  ఉన్నవారు నగరం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్నారు. స్వయంగా విశాఖ వైసీపీ ఎంపీ కూడా తన వ్యాపారాలను హైదరాబాద్ కు మార్చేసుకుంటున్నారు.    ఏపీ రాజధాని కేసులను సుప్రీంకోర్టు వచ్చే డిసెంబర్ కు వాయిదా వేసింది. అత్యవసరం అని.. వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు లాయర్ అదేపనిగా ఒత్తిడి చేసినా ధర్మాసనం కుదరదని తేల్చి చెప్పేసింది. ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన వెంటనే వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సందర్భంలో ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని చెప్పిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ధర్మాసనాన్ని కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది.  దీంతో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. 

ఏపీ సీఈవోకు సీఈసీ పిలుపు.. కారణమేంటో?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. ఆయనను హస్తిన రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆఘమేఘాల మీద ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఢిల్లీ  వెళ్లడంతో ఇప్పుడు రాజకీయవర్గాలలో ముఖేష్ కుమార్ మీనా హస్తిన పర్యటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ముందుగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన సన్నాహకాలలో బిజీగా ఉంది. అయినా అంతటి పని ఒత్తిడిలోనూ ఏపీ సీఈవో ( ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి)ని హస్తినకు పిలిపించుకుంది. దీంతో  రాజకీయవర్గాలలో ఆయన హస్తిన పర్యటనపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఓట్ల గల్లంతుపై వివరణ కోరేందుకు ఆయనను సీఈసీ హస్తినకు పిలిపించుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు ఆరోపణలపై ఎక్స్ ప్లనేషన్ కోరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  ఎందుకంటే ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదుపై ఏపీ లో ప్రధాన ప్రతిపక్షం   తెలుగుదేశం ఆధారాలతో  ఎన్నికల సంఘానికి  పలు ఫిర్యాదులు చేసింది.  తెలుగుదేశం ఫర్యాదులో చూపిన ఆధారాలతో  ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదు అసాధారణ స్థాయిలో ఉండటంతో  కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించిందనీ, ఇందులో భాగంగానే ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిపించుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.  మరో వైపు ఇటీవల జగన్ హస్తిన పర్యటనలో భాగంగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి చేసిన విజ్ణప్తి మేరకు.. అందుకు గల అవకాశాలపై చర్చించేందుకు సీఈసీ ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిచి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. ఏపీ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై పూర్తి వివరాలతో ఎస్ఈవో ఢిల్లీకి వెళ్లారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్రచారానికి బలం చేకూర్చే విధంగానే అధికారవర్గాల కథనం ఉంది. ఏపీలో ముందస్తు ఎన్నికల విషయంపై సీఎం జగన్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలతో మాట్లాడారనీ, అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారనీ అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముకేష్ కుమార్ మీనా హస్తిన పర్యటన నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట మళ్లీ జోరుగా మొదలైంది.  ఏపీలో ముందస్తుకు ఈసీ  సన్నాహకాల నేపథ్యంలోనే ఏపీ సీఈఓను హస్తినకు పిలిపించుకుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో షెడ్యూల్ రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  డిసెంబర్ లో పోలింగ్ జరుగుతుంది. ఇందు కోసం ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసింది. ఏపీలోనూ ఈ సన్నాహకాలు జరుగుతున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే బుధవారం (జూలై 12) సీఎం జగన్ కేబినెట్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఏపీలో ముందస్తు సన్నాహకాల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే!

ఏపీ సీఎం జగన్  తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఇంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా జగన్ సర్కార్ వాలంటీర్లను ఎందుకు వెనుకేసుకు వస్తోంది? వారి మీద ఈగ వాలినా ఎందుకు సహించడం లేదు. ఎందుకంటే వారు పార్టీ కార్యకర్తలు కనుక. వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం కోసం జగన్ పూర్తిగా వాలంటీర్లమీదే ఆధారపడ్డారు కనుక. ఈ విషయాన్ని మంత్రులు పలు సందర్భాలలో బాహాటంగానే చెప్పారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు అయితే ఒక అడుగుముందుకు వేసి వాలంటీర్లు పార్టీ కార్యకర్తలేనని కుండబద్దలు కొట్టారు. పార్టీకి వ్యతిరేకంగా వాలంటీర్లు ఎవరైనా ఉంటే చెప్పండి.. వారిని తీసేసి మరింత విశ్వాసంగా పార్టీ కోసం పని చేసే వారిని నియమిస్తామని  చెప్పేశారు.  ఇప్పుడు మనం మననం చేసుకోవలసిందేమిటంటే.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనన్న సంగతి ఈ వ్యవస్థను జగన్ తీసుకువచ్చిన రోజే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విస్పష్టంగా చెప్పారు.  ఇటీవల వారాహి యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే చెప్పారు. నేడో రేపో ఎన్నికల సంఘం కూడా అదే చెబుతుంది. ఉద్యోగులు, వాలంటీర్లు ఒక్కటి ఎంత మాత్రం కాదు. ప్రభుత్వోద్యోగులకు, వాలంటీర్లు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగులు రాజ్యాంగ వ్యవస్థకు చెందిన వారు. వాలంటీర్లు జగన్ సొంత వ్యవస్థకు చెందిన వ్యక్తలు. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలూ లేవు. అదే ప్రభుత్వోద్యోగులైతే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి, ఇంటర్వ్యూను ఎదుర్కొని అందులో సెలెక్ట్ కావాలి. అదే వాలంటీర్లకు అయితే ఎలాంటి పరీక్షలూ లేవు. ఇంటర్వ్యూలు అసలే ఉండవు. వారికి ఉండాల్సిన అర్హత అల్లా వైసీపీ నేతల ఆమోదం. ఆ పార్టీ కార్యకర్త అన్న ముద్ర. ఇప్పటికే ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వార్డ్ మెంబెర్లు, కౌన్సిలర్ల చేతులు కట్టేసింది జగన్ సర్కార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచిన, ప్రజా సేవ చేయడానికి,నాయకత్వ లక్షణాల ఉన్న  వార్డ్ మెంబెర్లు కు జీతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం, పార్టీ కార్యకర్తలుకు మాత్రం నెలకు 5000 రూపాయలు ఇచ్చి పార్టీ కోసం వాడుకుంటోంది. వారు చేసేది పార్టీ పని.. తీసుకునేది ప్రభుత్వ జీతం. ఈ  వాలంటర్ల వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తోంది. జనం సొమ్మును దుర్వినియోగం చేస్తున్నది.  పార్టీ ప్రయోజనాల సంగతి అలా ఉంచితే..  భవిష్యత్తులో ఇంక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టేశారనే చెప్పాలి.   ఎందుకంటే వాలంటర్లు అనే వ్యవస్థ  ప్రజల మీద కు జగన్ వదిలిన విషపు బాణం.   2024  ఎన్నికలలో  వైసీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి  మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతీ  ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రతీ ఉద్యోగి ప్రక్కన ఒక వైయస్సార్ కార్యకర్త అంటే వాలంటీర్ ఉంటాడు, ఉద్యోగులు ఏం చేయాలో వాళ్లే నిర్దేశిస్తారు.  ఇప్పటికే ప్రజలు వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా వైసీపీకి చేరిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే..  వ్యవస్థల గోప్యతకు కూడా చెల్లుచీటీ ఖాయమని అంటున్నారు.  ఈ విషయాన్ని అన్యాపదేశంగానైనా మంత్రి అంబటి రాంబాబు ఒక పార్టీ సమావేశంలో వెల్లడించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేననీ, వైసీపీ కోసం, మరో సారి వైసీపీకి అధికారం దక్కడం కోసం జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదినీ చెప్పారు.  జగన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము అంటే వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు నియమితులైన వారేనని విస్ఫష్టంగా చెప్పారు. ఏ దాపరికం లేకుండా  వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని చెప్పాశారు. వాలంటీర్లలో ఎవరైనా వైసీపీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహ రిస్తుంటే చెప్పండి.. వారిని తీసేసి కొత్త వారిని పెడతాం అని హామీ కూడా ఇచ్చారు.   నిజానికి ఇప్పుడేంటి.. గతంలోనే అప్పట్లో వైసీపీలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి వాలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే నని చెప్పారు. వాలంటీర్లు   పార్టీకి కూడా పని చేస్తారని వివరణ కూడా ఇచ్చారు.  ఇక   పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు మీడియా ముందుకు వచ్చి వైసీపీ కార్యకర్తలలాగే మాట్లాడారు. తమ కర్తవ్యం, బాధ్యత అంతా కూడా మరో సారి వైసీపీని, జగన్ ను అధికారంలోకి తీసుకురావడమేనని ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. 

టైగర్ నాగేశ్వరరావును నిలిపేయండి

టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదల అయితే తమ మనోభావాలు దెబ్బతింటాయని గిరిజన సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ని నిలిపి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ కమిషనర్, డీజీపీకి వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో నేరస్తుల రాజధాని స్టూవర్ట్ పురం. ఈ గ్రామానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావుపై చిత్రం తెరకెక్కిస్తున్నట్లు.. ఆ చిత్ర టీజర్‌ విడుదల సమయంలో సినిమా నిర్మాతలు ప్రకటించారన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారని.. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వల్ల .. తమ సామాజిక వర్గం పట్ల.. ప్రజల్లో ఓ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల తమకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సదరు గిరిజన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో సైతం ప్రస్తుత తమ సామాజిక వర్గానికి ఉద్యోగాలు దొరకడం లేదని.. అలాంటి వేళ ఇటువంటి సినిమాలు విడుదల అయితే తమ పరిస్థితి మరింత దిగజారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికే ఎరుకుల ప్రజలన్నా.. స్టూవర్ట్‌పురం అన్నా ప్రజల్లో ఓ విధమైన చులకన భావం ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలని అటు సినిమాటోగ్రఫీ కమిషనర్, ఇటు డీజీపీని కోరినట్లు వారు వివరించారు.   డీజీపీని, సినిమాటోగ్రఫీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో గిరిజన నాయకులు చుక్కా పాల్ రాజు, స్టూవర్ట్‌పురం వైస్ ప్రెసిడెంట్ శ్రీరాగాల రాము, విశ్రాంత ఎస్‌ఐ వల్లాగి కాంతారావు, ఎబినేజర్, రామారావుతోపాటు విజయవాడకు చెందిన ప్రముఖ గిరిజన నాయకులు తిమ్మాసర్తి నాగేశ్వరరావు, మల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. ఏది నిజం.. ఏది అబద్దం?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో బర్నింగ్ అంశం నడుస్తున్నది. రెండో విడత వారాహీ విజయయాత్ర మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్   వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏలూరులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు ఎవరు ఎవరి మనిషి.. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి.. ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  వాలంటీర్లపై ఇంతటి స్థాయి ఆరోపణలు చేసిన పవన్ ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని, దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని చేసిన  వ్యాఖ్యలు ఇటు వాలంటీర్లలో, అటు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. వాలంటీర్లు, వైసీపీ నేతలు, మహిళా కమిషన్ స్పందన ఎలా ఉన్నా అసలు పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? వాలంటీర్ వ్యవస్థకు ఉన్న నిబద్దత ఎంత? అన్నదానిపై ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద నిజంగానే ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. వారేం చేస్తారు.. ఆదాయం ఎంత.. కులం ఏంటి? యువతీ యువకులు ఎంతమంది? వారేం చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇంట్లో వితంతువులు ఉన్నారా? వారికి ఆదాయం ఉందా? ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు, అప్పులు, బ్యాంక్ వివరాలు, గర్భవతులు ఎవరు? ఇలా ఒక్కటేమిటీ ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక్క క్లిక్ తో వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వం భద్రత కల్పించిందా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని అడిగే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో వాలంటీర్ల వద్ద సమాచారానికి మేము కల్పించిన భద్రత ఇదని ప్రభుత్వం ముందుగా చెప్పాలి.  ఇక పవన్ కల్యాణ్ వాలంటీర్లు టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలను చూస్తే.. వాలంటీర్లపై ఈ నాలుగేళ్ళలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల నుండి ప్రభుత్వ పథకాల వరకూ వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపుగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే. ఈ మాట వైసీపీ నేతలే బహిరంగంగానే చెప్పేశారు. ఆ కారణంగానే పవన్ అంత పెద్ద ఆరోపణ చేయగలిగారు. ఇక పవన్ వ్యాఖ్యల వెనక మరో కారణం వైసీపీని రెచ్చగొట్టడంగా కనిపిస్తుంది. వారాహీ తొలి విడత యాత్రతో జనసేనలో జోష్ కనిపించింది. అయితే, పవన్ చేసిన ఆరోపణలకు మాత్రం వైసీపీ నుండి సమాధానం రాలేదు. పైగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ దాడి చేసింది. అందుకే పవన్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. పవన్ అనుకున్నట్లుగానే వైసీపీ నుండి, ప్రభుత్వం నుండి జెట్ స్పీడ్ లో రెస్పాన్స్ వచ్చింది. పవన్ యాత్రకి ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చేసింది. మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో.. ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి ఉంది.

నిప్పులు చిమ్మే విమర్శలు పైపైనే.. లోన మాత్రం బీఆర్ఎస్ దిక్సూచి బీజేపీనే?!

తెలంగాణలో బీఆర్ఎస్  ఇప్పుడు తీవ్రమైన రాజకీయ ఆరోపణ ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ బీజేపీ పైకి శత్రువులుగా కనిపించినా లోపల ఆ రెండు పార్టీలు మిత్రులేనని.. ఆ రెండు పార్టీలూ కాంగ్రెస్ ఓటమి కోసమే పనిచేస్తున్నాయన్నది  విశ్లేషకుల మాట. రాజకీయాలంటేనే పార్టీలు సహజంగా ప్రత్యర్థుల ఓటమి కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తున్నది అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటమితో పాటు బీజేపీకి మేలు చేసే పనులు మాత్రమే చేస్తుందన్నది తెలంగాణ రాజకీయాలలో నడుస్తున్న చర్చ. ఒకప్పుడు కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టే వారే లేరని.. ఆ బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నానని కేసీఆర్ చెప్తే ఏమో కావచ్చులే అనుకున్న జనం ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ చూసిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసమే పనిచేస్తున్నదని అనుమానిస్తున్నారు. తన పార్టీని టీఆర్ఎస్ ను  బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన నినాదం జల్ జంగిల్ జమీన్. దేశవ్యాప్తంగా ఈ నినాదం మీదనే తన కార్యాచరణ ఉంటుందని చెప్పారు. అదే సమయంలో మోడీ పాలన కంటే మన్మోహన్ సింగే నయమని.. ఎన్డీయే కంటే యూపీఏనే నయమన్నారు. అంతేకాదు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి ఏమేం చేయాలనుకుంటోందో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు. మరి నిజంగానే కేసీఆర్ బీజేపీ విముక్తి కోరుకుంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్ అంటే బీజేపీ బీ టీం అనేంతగా పరిస్థితిలో ఎందుకు మార్పు వచ్చింది? బీజేపీని ఢీ కొట్టేందుకే ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతటి విమర్శ ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ నేతలు సాదా సీదా కౌంటర్లకే పరిమితమవడం ఏ సంకేతాలు ఇస్తున్నాయి? అసలు నిజంగానే తెర వెనక ఏదైనా జరుగుతున్నదా అన్న చర్చలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్, కేసీఆర్ పై ఈ స్థాయిలో ఆరోపణలకు కారణం ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవడం.. అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీపై దూకుడు తగ్గించడం.. కాంగ్రెస్ కు అనువుగా ఉన్న చోట బీఆర్ఎస్ పాగా వేయాలని చూడడం. గత నాలుగేళ్లలో బీజేపీపై కేసీఆర్ కారాలు మిరియాలు నూరినా, అప్పుడప్పుడు పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లొల్లి చేసినా అంతిమంగా బీజేపీ తెచ్చిన వాటికి అనుకూలంగానే ఓటేసేవారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా కేంద్రం వద్దకు వెళ్లేసరికి రెండు పార్టీల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంటూ వస్తుంది. ఒక దశలో టీఆర్ఎస్ ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరిపోతుందని, అప్పట్లో ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా కేసీఆర్ బీజేపీపై విమర్శల వాన కురిపించడం మొదలు పెట్టారు. ఇక్కడ రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్-బీజేపీ శత్రువులే అన్నట్లు నిత్యం ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి రావడం.. రేపో మాపో కవితను అరెస్ట్ అనేంతగా హీటెక్కించి హఠాత్తుగా ఆ ఎపిసోడ్ ను ముగించారు. ఆ దర్యాప్తు ఏమయ్యిందో తెలియదు.. కేసు ఉందో లేదో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య తిట్ల దాడి తగ్గింది. ఇంతలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ రావడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అనేది బలంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. కూతురు కవిత కోసమే కేసీఆర్ బీజేపీపై దూకుడు తగ్గించారా? లేక అసలు ఈ రెండు పార్టీల వ్యూహమే ఇలా బెడిసి కొట్టిందా? అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని ఎన్నికల ముందే సినిమా క్లైమాక్స్ కి వచ్చేసిందా? అనేలా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి. అయితే, ఒక పార్టీ ఉమ్మడి శత్రువులు మిత్రులుగా మారడం రాజకీయాలలో పెద్ద విడ్డూరమేమీ కాదు. బీఆర్ఎస్ నినాదమే కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కాగా.. బీజేపీ కోరుకుంటున్నది కాంగ్రెస్ ముక్త్ భారత్. రెండిటి లక్ష్యం ఒక్కటే అయినపుడు దగ్గరవడం సహజమే. కానీ.. ఇది రెండు పార్టీలు కలిసి ఆడించిన ఆటానా.. లేక బీజేపీ ప్లాన్ చేసి కలిసేలా చేసుకుందా అన్నది ఆసక్తికరం. ఇక అసలు ఈ ఊహాగానాలు నిజమా.. లేక బీజేపీపై కేసీఆర్ పోరాటమే నిజమా? చూడాలి.

అన్ స్టాపబుల్ లోకేష్..

యువగళం@2000KM! నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్ష్ పూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలక  మైలురాయికి చేరుకుంది. లోకేశ్ యువగళం పాదయాత్ర మంగళవారం (జూలై11) 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో లోకేష్ 153వ రోజున ఈ 50 శాతం లక్ష్యం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్‌ వడివడిగా అడుగులు వేస్తూ నిర్ధేశించిన గడువు కంటే ముందే యాభై శాతం లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నారు.  కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27న యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర దోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు చారిత్రాత్మక 1000 కి.మీ మైలురాయి చేరుకుంది. ఇక ఇప్పుడు 153వ రోజున నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10 కిలోమీటర్ల చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్.. 153 రోజుల్లో సగటున 13.15 కి.మీల చొప్పున నడక సాగించారు. ఈ పాదయాత్రలో లోకేష్ ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకోగా.. మొత్తం 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల గుండా నడక సాగించారు. 49 చోట్ల బహిరంగసభలలో ప్రసంగించిన ఈ యువనేత వివిధవర్గాలతో ఫేస్ టూ ఫేస్ సమావేశాలు నిర్వహించారు. ఈ యాత్రలో మొత్తం 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందుకున్న లోకేష్.. 5 చోట్ల ప్రజల మధ్య నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లె ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇక పాదయాత్ర విషయానికి వస్తే రాయలసీమలో లోకేష్ యువగళం చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ఇప్పటివరకు 29 రోజులు 425 కి.మీ మేర పాదయాత్ర పూర్తయింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్యమైన సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, లోకేష్ విజయవంతంగా 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా లోకేష్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా నారా లోకేష్ పాదయాత్ర 2వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా.. 3వ స్థానంలో #2000kmOfYuvaGalam హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వేదికగా వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. యువనేత పాదయాత్రకి విశేష స్పందన లభిస్తున్నది.  ఈ పాదయాత్రపై ప్రత్యర్ధులు అవాకులు చవాకులు పేలినా లోకేష్ యాత్ర ముమ్మాటికీ సూపర్ సక్సెస్ అయింది. గతంలో లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండో అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి ఈ యువగళం యాత్ర చెంపపెట్టు లాంటి జవాబిచ్చింది. ఇన్ని వేల కిలోమటర్ల   దూరం ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ.. సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగడం అంటే సామాన్య విషయం కాదు. ఒక వైపు ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం ఇస్తూనే లోకేష్ ఒక్కో మెట్టు ఎదగడం విశేషం. ఉదాహరణకు పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ మొత్తం యాత్రకు హైలైట్ కాగా.. టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా.. ఒక్క ఉద్యోగ‌మైనా ఇప్పించ‌గ‌లిగాన‌ని ప్రక‌టించ‌గ‌ల‌వా అంటూ లోకేష్ విసిరిన బాణాలు సూటిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలాయి.  వీటితో పాటు ప్రతి వంద కిలోమీటర్లకు ఓ వరాన్ని ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్.. ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతూ.. నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను పెట్టిన ఇబ్బందులను గుర్తుచేస్తూ.. వైసీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూ టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల విడమర్చి చెప్తూ జనంలోకి చొచ్చుకుపోతున్నారు. అయితే, ఇది సగమే. మరో అర్ధం భాగం ఉందంటే లోకేష్ ప్రజలకు ఇంకెంత   చేరువ అవుతారో అర్ధం చేసుకోవచ్చు.

స్పీడ్ న్యూస్ -2

26.అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.  ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 27. తెలంగాణ రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏడుపు ఎందుకని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై మీకు, మీ పార్టీకి కక్ష ఎందుకని రేవంత్ రెడ్డిని నిలదీశారు.  28.మహారాష్ట్రలోని నాసిక్ లో కొంతమంది దొంగలు ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లారు. దర్జాగా లారీ తీసుకొచ్చి, మెషిన్ ను అందులోకి ఎక్కించి తీసుకెళ్లారు. 29.  ఆగస్టు 1న పూణెలో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రధాని మోదీ అందుకోబోతున్నారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అందిస్తున్న ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు అజిత్  కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది.  30.ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి వారితో పొదిలి నుంచి కాకినాడకు వెళ్తున్న బస్సు దర్శి సమీపంలో అదుపుతప్పి సాగర్ కాల్వలో పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు.  31.అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  32.పవన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఏపీ ప్రభుత్వ నేతలు వాలంటీర్లను రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసిగొల్పారు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది.  33.ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. నేపాల్‌లో జరిగిందీ ఘటన. మేనేజింగ్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్ 9ఎన్-ఏఎంవీ (ఏఎస్ 50) సోలుకుంబు నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా చాపర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఉదయం 10.12 గంటలకు అది రాడార్ నుంచి అదృశ్యమైంది.  34. హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు మరో హెలికాప్టర్‌ను పంపారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.  35. టెక్ కంపెనీల్లో గతేడాది మొదలైన కొలువుల కోతలు ఇటీవల కొంత నెమ్మదించాయి. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటుండగానే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్‌లకు తెరలేపి వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. 36. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ మాటలు వ్యక్తిగతమని, ఆయన చెప్తే ఫైనల్ కాదన్నారు. 37. దర్శి దుర్ఘటన మానవ తప్పిదమా? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణమా  అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలని జన సేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.  క్షతగాత్రులకు మేలైన వైద్య సదుపాయం కలిగించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయపడాలని కోరారు.  38. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ‘ఎక్స్ టర్’ ను సోమవారం మార్కెట్ కు పరిచయం చేసింది. 39. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. 40.  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5 వేల విరాళాన్నిటీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేశ్ కు అందజేశారు.  41. దర్శి ఆర్టీసీ బస్సు  ప్రమాదంపై సీఎం జగన్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  42.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు  కోటి రూపాయలు ఖర్చు చేసి రీడెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్ లా మారిపోయింది.  43.: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని లాక్కున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 44.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు. 45. ఇంటర్మీడియట్‌లో పరీక్షా పేపర్ మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఓ విద్యార్థి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో  మంగళవారం విచారణ చేపట్టింది.  వాదనలు విన్న కోర్టు విద్యార్థి పరీక్ష పత్రాలను పున: సమీక్షించాలంటూ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

మా స్థలాలు మాకు అప్పగించండి

జవహర్ లాల్ నెహ్రూ మ్యాక్ హౌజింగ్ సొసైటీకి  ఇళ్ళ స్థలాలను ఎందుకు  అప్పగించడం లేదని  ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి పదినెలలు పూర్తయినా ఈ స్థలాలు స్వాధీనం చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థలాల స్వాధీనం కోసం అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని, ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని జెఎన్‌జె సభ్యులకు సూచించారు.   సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఎన్‌జే సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణరావు అధ్యక్షతన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యాక్‌ హౌసింగ్‌ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్‌ హెచ్‌ఎస్‌) మీడియా సంపాదకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తుది తీర్పు తరువాత కూడా సుధీర్ఘకాలం  ఆ తీర్పు అమలు కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ప్రభుత్వానికి చేరువగా వున్నా ఏమాత్రం సభ్యులకు ఉపయోగ పడకపోవడం విచారకరమన్నారు.  ఎన్నికలు దగ్గర పడుతోన్న సందర్భంలో సుప్రీం తుదితీర్పు వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంలో తక్షణమే కోర్టు ధిక్కరణకు వెళ్లాల్సిందేనని ఆయన సూచించారు. జేఎన్‌జే స్థలాలు వారికే స్వాధీనం చెయ్యాలని గతంలోనే ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌కు సూచించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ స్థలాలు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో ఆర్థకావడంలేదన్నారు.  జేఎన్‌జే కి చెందిన 1100మంది సభ్యులతో మిగతా 5 వేలమంది స్థలాలతో ముడిపెట్టడం భావ్యం కాదని అన్నారు. ప్రభుత్వం చెడు ఆలోచనను ప్రశ్నించాల్సిందేనని స్పష్టం చేశారు. మీరు చేసే ఉద్యమానికి ప్రతిపక్షాల, ప్రజాసంఘాల సహకారం తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సలహా ఇచ్చారు. సుప్రీంతీర్పు అమలు ఎందుకు చేయడం లేదనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి వుంది. అయితే, ప్రభుత్వం సొసైటీ సభ్యులు ఇచ్చిన వినతి ప్రతాలకు సమాధానం చెప్పాల్సి వుండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమస్య జఠిలంగా మారిందన్నారు.   ఇదే సరైన సమయం: దిలీప్‌ రెడ్డి ఎన్నికల సమయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థలాలు సాధించుకోవాలని ఆర్టీఏ మాజీ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలోనే పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతాయని, ఇందులో భాగంగానే ఈ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య కూడా పరిష్కారమవుతోందని చెప్పారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మూడు దఫాలుగా ఇళ్ళస్థలాలు ఇచ్చిన చరిత్ర వుందని,  ప్రస్తుతం జెఎన్‌జె సొసైటీకి సంబంధించి స్థలాల అప్పగింత అంశం సుదీర్ఘంగా కొనసాగుతూనే వుండడం పట్ల  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే కోర్టు కేసులను కాదని ఇచ్చే అవకాశంకూడా వుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదని దిలీప్‌రెడ్డి స్పష్టం చేశారు.  జీవన్మరణ సమస్య: మిట్టపల్లి శ్రీనివాస్‌ మన తెలంగాణ సంపాదకులు మిట్టపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల స్థలాల సమస్య జీవన్మరణ సమస్యగా గుర్తించి ప్రభుత్వం స్పంధించాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో జర్నలిస్టులు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేవిధంగా కార్యక్రమాలు చేపడుతున్నారనీ, దీనిని తప్పుగా భావించకుండా స్థలాలను స్వాధీనం చేయాలన్నారు. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనపర్చాలన్నారు. ఈ స్థలాల స్వాధీనం కోసం అవసరమైతే నిరాహార దీక్షలు నిర్విరామంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, గాంధేయ విధానంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని సూచించారు. జర్నలిస్టులకు స్థలాల విషయంలో ఏకాభ్రిపాయం వున్నదని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి స్పష్టం చేశారు. స్థలాల కోసం జర్నస్టులంతా సామ, ధాన భేద దండోపాయాలను అనుసరించాల్సిందేనని ఆయన సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడేలోగా ఇళ్లస్థలాల సాధన ఉద్యమం తీవ్రతరం చేయాలన్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని మరింత చైతన్యంగా పోరాటం చేయాలని, అందరి సంఘీభావమే పునాధిగా ఏర్పరచుకుని, ముందుకు సాగాలని యాదగిరి అన్నారు. కలాలను పాశుపతాస్త్రాలుగా సంధించి స్థలాలు సాధించాలని పిలుపునిచ్చారు.  జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సరిగ్గా పనిచేయకపోవడం వలనే ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందని టివి9 అసైన్‌మెంట్‌ ఎడిటర్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. సభ్యులే టీమ్‌ జేఎన్‌జేగా ఏర్పడి పోరాటం చేయడంపట్ల ఆయన అభినందనలు తెలిపారు.  జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి అంబటి అంజనేయులు మాట్లాడుతూ హైదరాబాద్‌ జర్నలిస్టులు ఏం పాపం చేశారని, వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్ధం కావడంలేదన్నారు. జేఎన్‌జే సభ్యుల పోరాటం వల్ల ఇళ్ళస్థలాలు సాధించడం సానుకూల పరిస్థితులు ఏర్పడగలవన్నారు.  సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధు మాట్లాడుతూ జేఎన్‌జే సభ్యుల లక్ష్యం ఒక్కటేనని, ఇందులో ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఎంతో మంది సభ్యులు చనిపోయారని, వారి ఆత్మలు స్థలాలకోసం ఘోషిస్తున్నాయన్నారు. నాడు 2 లక్షల రూపాయల విలువైన స్థలాలు అవి నేడు 2 కోట్ల రూపాయలని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు క్షీరాభిషేకం చేసిన సభ్యుల కళ్ళల్లో నేడు రక్తం కన్పిస్తోందన్నారు. 70 ఎకరాల స్థలం మనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ఎందుకు జాప్యంజరుగుతోందని మెట్రో దినప్రతిక సంపాదకులు దేవరకొండ కాళీదాస్‌ ఆవేదన వ్యక్తం చేసారు. అధ్యక్షత వహించిన జెఎన్‌జే ఫౌండర్‌ మెంబర్‌ పి వి రమణరావు మాట్లాడుతూ ప్రతిసభ్యునికి స్థలాలు వచ్చేలాగా మా పోరాటం వుంటుందని స్పష్టం చేసారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సంపాదకులతో కూడిన. వినతి పత్రాన్ని ముఖ్య మంత్రి కే సి ఆర్ కు అందజేస్తామని ఆయన తెలిపారు. యూ.ఎన్‌.ఐ. బ్యూరో చీఫ్‌ నాగేశ్వరరావు, బిసి టైమ్స్‌ సంపాదకులు సూర్యారావు, సీనియర్‌ జర్నలిస్టులు ఆకుల ఆమరయ్య, మాలకొండయ్య, సుందర్‌శర్మ, కెవిఎస్‌ సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు.  రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సంపాదకుల సంతకాలతో కూడిన వినతి పత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని తక్షణమే జెఎన్‌జె సొసైటీకి అప్పగించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే పేట్‌ బషీరాబాద్‌ స్థలం స్వాధీనం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్దం చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థలకు చెందిన సంపాదకులు మరియు జెఎన్‌జె సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్పీడ్ న్యూస్ 1

1.తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో కలకలం రేగుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో కరువు పరిస్థితి దాపురిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  2.ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో ప్రవేశించింది. 153వ రోజు కావలి పట్టణంలో యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి. 4.ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పీపీఏ సభ్యులు హాజరయ్యారు.  5.భారత దేశం 2075 కల్లా అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్  నివేదిక వెల్లడించింది. అమెరికాతో పాటూ జపాన్, జర్మనీని కూడా భారత్ వెనక్కు నెడుతుందని పేర్కొంది.  6.మూడు పడవల్లో వెళ్తున్న 300 మంది వలసదారులు అట్లాంటిక్ మహా సముద్రంలో అదృశ్యమయ్యారు. 15 రోజుల క్రితం వీరంతా సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలండ్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  7.ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం  సందర్భంగా ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ వెళుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో, భారత్-ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించనుంది.  8.పాతబస్తీవాసులకు త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. 9.ఉమ్మడి పౌర స్మృతి  బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సయిఫుల్లా రెహ్మానీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, తదితరులు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి, యూసీసీని వ్యతిరేకించాలని కోరారు. 10.మణిపూర్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల పట్ల దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.  రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది రాష్ట్ర ప్రభుత్వాల పని అని స్పష్టం చేసింది. 11. మూడు నాలుగు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది.  12.పలు హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 13.నటుడు ధనుష్, ఐశ్వర్యలకు మద్రాస్ హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్ ’ సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన కేసును కొట్టేస్తూ న్యాయస్థానం  తీర్పు వెలువరించింది.  14.అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా మహాసభలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని చెప్పారు. 15.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 16.బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ కోర్టులో హాజరుపరిచారు.  17.ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.  18.తెలంగాణ గవర్నర్ తమిళసైకీ ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆమె కాన్వాయ్ కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. 19.ప్రముఖ దర్శకుడు, తన మాజీ భర్త శేఖర్ కపూర్‌ గురించి నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను మోసగించడంతోనే తమ వైవాహిక బంధం ముగిసిందని చెప్పారు. 20. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి వివాదం బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది. ఇరువురు నేతలతో బీఆర్ ఎస్ అధిష్టానం విడివిడిగా చర్చలు జరుపుతోంది.  21. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది.  22.హిందువుల మనోభావాలు దెబ్బతింటే.. సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదని.. యావత్తు భారతీయులదని ఎపీ సీఎం జగన్ గుర్తుంచుకోవాలన్నారు.  23. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.తాను అందరు వాలంటీర్లను అనడం లేదని స్పష్టతనిచ్చారు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే.  24.ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.  లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. 25.ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని జులై 14 నుండి 16 మధ్య ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు.