ఛత్తీస్ గఢ్ మళ్లీ కాంగ్రెస్ కే.. పీపుల్స్ సర్వే వెల్లడి
posted on Jul 8, 2023 6:55AM
ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎలా చూసినా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ అని చెప్ప వచ్చు. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలే ఛత్తీస్ గఢ్ లో మరోసారి అధికార పగ్గాలు అందుకునేది హస్తం పార్టీయే అని తేలింది. మూడ్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ పేరిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే మేరకు కాంగ్రెస్ పార్టీ 53 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, బీజేపీ 20 నుంచి 27 స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నది సర్వే ఫలితం.
90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి కావలసిన స్థానాలు 46. ఆ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. 2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈ సారి 46 శాతం ఓట్లు దక్కించుకుంటుందని సర్వే పేర్కొంది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ ఈ సారి కొంత మెరుగు పడి 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకుంది. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం బీజేపీ ఛత్తీస్ గఢ్ లో మరో సారి అధికారానికి దూరమయ్యే పరిస్థితులే ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.
వరుసగా రెండో సారి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని సర్వే తేల్చింది. ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే కారణమని పేర్కొంది. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్ ఛత్తీస్‌గఢ్ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్’ వంటి నినాదాలు ప్రజలను ఆకర్షించాయని సర్వే తేల్చింది.
ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్’’ ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేశాయి. అన్నిటికీ మించి 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు బెన్ ములాఖత్ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ విజయానికి దోహదపడుతున్నాయని సర్వే పేర్కొంది.