రణరంగం తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి vs కేతిరెడ్డి
posted on Jul 8, 2023 @ 5:42PM
తాడిపత్రిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు బజారుకెక్కి బూతులతో విరుచుకుపడే స్థాయికి చేరింది. ఏడాది క్రితం వేసిన చీనీ తోట మూడేళ్ళకు కాపుకు రావాల్సి ఉండగా ఏడాదికే కాపు రాక నష్టపోయినట్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 13.89 లక్షల పంట బీమా కొట్టేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు చీనీ తోటలను పరిశీలించేందుకు కేతిరెడ్డి తోటకు వెళ్తానంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ వచ్చిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని.. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాదు పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.. ఆ పదవే ఇప్పుడు లేకపోతే జేసీని ఇంటిలో నుంచి బయటకి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పేవాడినని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వాడిని ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు.
కాగా, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆరోపణల పర్వం తాడిపత్రి పట్టణమంతా వ్యాపించింది. టీడీపీ, వైసీపీ వర్గాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలోని మిగతా టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు చినీ తోటకి కాపలా ఉన్నారు. దీంతో ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనేలా వాతావరణం మారిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏది ఏమైనా జేసీ వర్గం చీనీ తోటకి వెళ్లి సందర్శించి అసలు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలని చూస్తుంటే ఎమ్మెల్యే వర్గం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది.
అయితే, నిజానికి జేసీ ఆరోపించిన దానిలో నిజం లేకపోతే ఎమ్మెల్యే కేతిరెడ్డి భయపడాల్సిన పనిలేదు. మీడియాతో సహా ఓ హార్టికల్చర్ అధికారిని తీసుకుని చీనీ తోటకి వెళ్లి చూసుకుంటే అసలు నిజం తేలిపోతుంది. నిజంగానే పంట పెట్టి మూడేళ్లయినా కాపు లేక నష్టపోయి ఉంటే ఆరోపణలు చేసిన జేసీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. కానీ, అదేమీ లేకుండా అసలు తోటకి వెళ్లే వారిని అడ్డుకోవడం.. ఇలా వాడు వీడు అంటూ చెప్పుతో కొడతా అంటూ బూతులు లంకించుకోవడం చూస్తుంటే జేసీ ఆరోపణలే నిజమా అన్న భావన కలుగుతున్నది.
ఓ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడంతో మరోసారి వైసీపీ నైజం ఇదేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మంత్రుల దగ్గర నుండి మహిళా ఎమ్మల్యేల వరకూ ఈ బూతు పురాణంలో చెడ్డపేరు తెచ్చుకోగా కేతిరెడ్డి వారి జాబితాలోనే చేరి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నారు. ఇక తాడిపత్రిలో ఈ హీటెక్కిన రాజకీయం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.