ఎన్నికలే టార్గెట్.. బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్లు?
posted on Jul 7, 2023 @ 4:19PM
ఏపీలో రానున్న ఎన్నికలు వైసీపీకి చావో రేవో అన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే.. జగన్ పాలనను ఏపీ ప్రజలు మెచ్చినట్లు రెఫరెండం. జగన్ ఆశించినట్లుగానే మూడు రాజధానులకు ప్రజలు కూడా సిద్ధమేనని వైసీపీ బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. ఐదేళ్ల కాలంలో జగన్ తీసుకొచ్చిన పథకాలు మహా గొప్పవిగా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అదే ఓడితే జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశాం.. ఇక చాలు పొమ్మని సాగనంపినట్లే. భవిష్యత్ లో కూడా మరో చాన్స్ అని అడిగే అవకాశం మూసుకుపోయినట్లే. మూడు రాజధానుల నిర్ణయం నుండి తన పాలనలో తీసుకొచ్చిన విధానాలు, తన పనితీరు వంటివాటినన్నిటినీ ఏపీ ప్రజలు తిరస్కరించినట్లే లెక్క. అందుకే ఈసారి మాయ చేసి.. మంత్రమేసి అయినా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికలకు కేంద్రం సాయం కోసం జగన్ తాపత్రయపడుతున్నారు.
తాజాగా సీఎం జగన్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జగన్ బీజేపీ పెద్దలను కలిసి పలు విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధుల మంజూరు నుండి విభజన హామీల వరకు ఈ భేటీలో చర్చించినట్లు ఏపీలో వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే, జగన్ ఢిల్లీ టూర్ వెనక వేరే కారణం ఉందని రాజకీయ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రం సాయాన్ని కోరిన సీఎం జగన్.. ఈ పర్యటనలో బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికలలో తనకు సాయం చేస్తే.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని బీజేపీకి జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
రానున్న ఎన్నికలలో ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా ఖరారైంది. అప్పుడప్పుడూ పొత్తు ఉంటుందా అనేలా అనుమానాలు కలిగిస్తున్నా.. రెండు పార్టీలు పొత్తుకు సుముఖంగానే ఉన్నటు ఆ రెండు పార్టీల నేతలే సన్నిహితులతో చెప్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ సమస్యలపై కలిసే కదం తొక్కుతున్నాయి. అయితే.. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిసి కూటమి అవుతుందా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. నిజానికి ఏపీలో బీజేపీ ఓట్లు లేవు. సీట్లు వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. కానీ కేంద్రంలో అధికారం ఉంది కనుక అంతో ఇంతో సాయంగా ఉంటుందనే టీడీపీ-జనసేనలు బీజేపీని కలుపుకుపోవాలని భావిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే వారిని కలుపుకుపోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీలో బీజేపీ స్నేహం టీడీపీతోనా? వైసీపీతోనా అన్నదే తేలాల్సి ఉంది.
బీజేపీ పొత్తు సస్పెన్స్ కొనసాగుతుండగానే ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ బీజేపీ పెద్దల ముందు భారీ ప్రతిపాదనలే పెట్టినట్టు తెలుస్తుంది. గత ఐదేళ్లుగా వైసీపీ బీజేపీతో రహస్య చెలిమి చేస్తూనే.. కేంద్రం తీసుకొనే ప్రతి నిర్ణయానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నది. ఇకపై కూడా కేంద్రం తనకు మద్దతుగా ఉండాలని కోరిన జగన్.. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. వైసీపీ-బీజేపీ ప్రత్యక్ష పొత్తు లేకుండా.. బీజేపీ ఒంటరిగానే పోటీచేయాలని.. రాష్ట్రంలో బీజేపీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా.. కేంద్రం తనకు అండగా ఉండి మళ్ళీ గలిపిస్తే.. తన ప్రభుత్వంలో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఇస్తామని జగన్ ఆశ చూపినట్లు చెప్తున్నారు.
లోక్‌సభ, రాజ్యసభ కలిపి పార్లమెంటులో ఇప్పుడు వైసీపీకి 46 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. టీడీపీ-వైసీపీలలో రానున్న ఎన్నికలలో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో చెప్పలేం. కనుక ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉండే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా అసలు ఓట్లే లేని రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కుతాయన్న ఆశ ఒకటి. 2014 ఎన్నికలలో ఇదే విధంగా తెలుగుదేశం బీజేపీకి మంత్రిపదవులు ఇచ్చింది. పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ సీట్లను కూడా అప్పట్లో బీజేపీ గెలుచుకుంది. ఎన్నికల తర్వాత జగన్ అడ్డం తిరుగుతారా అంటే ఆయన జుట్టు ఇప్పుడు ఉణ్నట్లుగానే అప్పుడు కూడా కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఇన్ని ప్లస్సు పాయింట్లు ఉన్న అవకాశాన్ని బీజేపీ వదులుకుతుంటుందా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నాటకలో అధికారంలో ఉండీ, అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నా విజయం సాధించలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీని నమ్ముకుని ముందుకు అడుగేస్తుందా అన్న అనుమానాలను సైతం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ జగన్ ఆఫర్ లను అంగీకరించి.. రాష్ట్రంలో జగన్ పార్టీ ఓడిపోతే అప్పుడు పరువు మంటగలిసిపోతుందన్న భయం కూడా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోందంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఫలితం అటూ ఇటైతే రెంటికీ చెడ్డ రేవడలా పరిస్థితి మారిపోతుందన్న జంకు కూడా బీజేపీలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఏపీ విషయంలో ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉందంటున్నారు.