స్పీడ్ న్యూస్- 1
1. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది.
2.నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
3.దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి 16వ తేదీ వరకు గుంటూరు-విశాఖపట్టణం , 11 నుంచి నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్టణం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, సోమవారం నుంచి 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ, రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం రైళ్లను రద్దుచేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
4.ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు సోమవారం మధ్యాహ్నం కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.
5. గతేడాది నాకు ఇచ్చిన వాగ్ధానం మరిచారు అంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు.
6.రాజస్థాన్‌లో ఇంజినీరింగ్ ఆశావహుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడడం లేదు. కోటాలో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి తాజాగా తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
7.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు.
8.తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడ తమ సత్తా చాటుతున్నారని హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
9.ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించి ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
10.ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టి కొల్లాపూర్ సభపై కేంద్రీకృతమై ఉంది.
11.మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిధ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ పార్టీ నుంచి తప్పుకున్నారు.
12. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి.
తాజాగా ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందారు. 13 ఆంధ్ర ప్రదేశ్ అనకా పల్లిలో ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు.
14. ఇటీవల నందిగామలో ఓ మహిళపైనా, ఆమె బంధువులపైనా యాసిడ్ దాడి జరగడం తెలిసిందే.
నందిగామ యాసిడ్ దాడి ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం పరామర్శించారు.
15.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం సోమవారం హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు వద్ద నిర్వహించారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది.
16. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారికి బోనం తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తాను అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీరాయని, ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని, ఆ కోరిక కూడా తీరుతుందని నమ్ముతున్నానని తెలిపారు.
17. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత నెలలో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్ మెకానిక్ షాపులను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశారు.
18.ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ధనసరి సీతక్క సోమవారం పుట్టినరోజు సందర్బంగా సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
19. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు.
‘‘అనిల్‌కు ఇంటర్నేషనల్ నోటీసులు ఎందుకొచ్చాయి? పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
20. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 41 ఏళ్ల తర్వాత హస్తినలో 153 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కావడం ఇదే ప్రథమం.
21. తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి.
22.ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ కుటుంబం ఎలా బతికిందో చెబుతాను.. చెప్పుతో కొడుదువురమ్మంటూ సవాల్ విసిరారు.
23.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
24. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారుచేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. లేడీ యాంకర్ ను తలపించేలా గడగడా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను అబ్బుర పరిచింది.
25.ఎన్నడూ లేనంత స్థాయిలో టమాటా ధరలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని వారణాసిలో తన షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐ వార్తా సంస్థ ప్రచురించింది.