జగనన్న సురక్ష.. ఎందుకీ శిక్ష
posted on Jul 8, 2023 @ 1:03PM
ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా ఆదరాబాదరా కార్యక్రమాలు, పథకాలను ప్రకటించేయడం.. క్షేత్ర స్థాయిలో వాటి అమలును పట్టించుకోకపోవడం జగన్ సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. రాబోయే ఎన్నికలే తమ ప్రభుత్వానికి రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయన్న భావనతో ఏపీ సర్కార్ తీసుకువచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమం కూడా అదే కోవలోకి చేరిపోయింది. ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన సచివాలయ ఉద్యోగులే ఏమిటీ శిక్ష అని విసుగు చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థ జగన్ మానస పుత్రిక అన్న సంగతి విదితమే. ఆ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల అనాసక్తిగా ఉన్నారు. అది తమకొక శిక్షగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం కింద అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తామన్న ప్రభుత్వం అయితే ఆర్భాటంగా ప్రకటించేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకం పేరుతో స్టేషనరీ దుర్వినియోగం తప్ప మరేం జరగడం లేదని జనం విమర్శిస్తున్నారు. ఎవరికి ఏ సర్టిఫికెట్ అవసరమో అది మాత్రమే.. ఆ అవసరం అయిన వారికి ఉచితంగా అందజేయాలి.
అయితే క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏమిటి? అన్నది ఎవరికీ అర్ధం కాకుండా జరుగుతోంది. వాలంటీర్లు ఇష్టారీతిగా దరఖాస్తులను తెచ్చి సచివాలయ ఉద్యోగులకు అందజేయడం.. క్షేత్ర స్థాయి పరిశీలనలో అవన్నీ నకిలీవనో, అవసరం లేకపోయినా ఏదో పని చేస్తున్నామని అనిపించుకోవడానికి తెచ్చిన దరఖాస్తులుగా తేలడం.. పై అధికారులు మాత్రం సచివాలయ ఉద్యోగులపై ఇదేంటి? అదేంటి? ఇంకా దరఖాస్తుల మేరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదా అంటూ ఒత్తిడి తేవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో జగనన్న సురక్ష కార్యక్రమం కాదు కానీ ఇదే మాకో శిక్షగా మారిపోయిందని సచివాలయ సిబ్బంది తలలు కొట్టుకుంటున్నారు.
వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిద్దామన్నా వారు వినే పరిస్థితిలో లేకుండా ఎంత సేపూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జగనన్న సురక్ష పథకం పేర క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతును పరిశీలింది.. అవసరమైన వారి నుంచే వాలంటీర్లు దరఖాస్తులను స్వీకరించి తమకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు.