స్పీడ్ న్యూస్ 2
1. రాష్ట్రం గంజాయి సరఫరా వెనుక ముఖ్యమంత్రి వైయస్ జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అందుకే గంజాయిని ఆరికట్ట లేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయిపై రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. భారతదేశానికి డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందంటూ వివరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారని లోకేశ్ తెలిపారు.
................................................................
2. పశ్చిమ గోదావరి జిల్లా అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల అక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని అందులో పేర్కొన్నారు. 1950 నుంచి దాదాపు 3,255 ఎకరాల భూమి అటవీ శాఖ అధీనంలో ఉందని.. కానీ, సంబంధిత శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై కోర్టులో వివాదం నడుస్తోందన్నారు.
...................................................
3. వాలంటీర్ల పోస్టులంటే యువతను నిర్వీర్యం చేయడమే కదా? అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై ఢిల్లీలో ఆయన మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని విజయసాయిరెడ్డి వంటి వాళ్లే చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. కుటిల రాజకీయ నీతితో నిర్మించిందే వాలంటీర్ల వ్యవస్థ. సేవ చేసేందుకు వచ్చిన వాళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తారా? మీరు తెచ్చిన వ్యవస్థపై మీకే నమ్మకం లేక అంబటి రాయుడితో కితాబు ఇప్పించుకున్నారా? వాలంటీర్ల పేరుతో ఇంతమంది యువత భవష్యత్తును నాశనం చేస్తారా?అని రఘురామ నిలదీశారు.
..................................................
4. కోనసీమ జిల్లాలోని శివకోటి ఆక్వా చెరువు వద్ద బోరుబావి నుంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడటానికి గ్యాస్ పైప్‌లైన్ కారణం కాదని, అక్కడ అసలు పైప్‌లైన్ లేదని ఓఎన్జీసీ సిబ్బంది తేల్చారు. భూమి పొరల్లో గ్యాస్, నీరు ద్వారానే మంటలొచ్చాయని చెప్పారు. బోరును మరింత లోతుగా తవ్వడం వల్లే అగ్నికీలలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రత్యేక బృందం వస్తుందని, వారు వచ్చాకే మంటల్ని అదుపు చేయడం సాధ్యపడుతుందన్నారు.
.............................................
5. రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు పూర్ణ కలశంతో స్వాగతం పలికిన అర్చకులు షోకాజ్ నోటీసులు అందుకొన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా రామతీర్ధం కూడలిలో అశోక్ గజపతిరాజును ఆరుగురు అర్చకులు ఆశీర్వదించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కిషోర్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అశోక్ గజపతి రాజును ఆశీర్వదించిన ఆరుగురు అర్చకులకు ఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమకు తెలియకుండా టీడీపీ నేతలకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
.....................................................
6. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించిన తర్వాత.. ఆ దంపతులకు అర్చకులు ఆశీస్సులు, ప్రసాదం, శేషవస్త్రం అందించారు.
...........................................................
7. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మందికిపైగా మృతి చెందారు. రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరన్‌లో ముగ్గురు, ఔరంగాబాద్, తూర్పు చంపరాన్ జిలాల్లో చెరో ఇద్దరు, బంక, వైశాలి జిల్లాలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
.....................................
8. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద.. ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని.. అలాగే ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
...............................
9. గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్‌కు రేవంత్ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. దీంతో వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.
.........................................
10. విదేశాలకు వెళ్లి అక్కడ మరణించిన భారతీయుల మృతదేహాలు లేదా ఆస్థికలు స్వదేశానికి తీసుకురావడానికి ప్రామాణిక నిర్వహణ పద్దతులను విదేశీ వ్యవహారాల శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించాలని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 13న ఆదేశించింది. భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిర్వహించే పౌర విమానయాన సంస్థలు కూడా తమ వెబ్‌సైట్లలో ఎస్‌ఓపీని ప్రచురించాలని తెలిపింది. భారతీయ పర్యాటకులు విదేశాల్లో మరణిస్తే, అక్కడి భారత రాయబార కార్యాలయం మృతుని కుటుంబంతో సంభాషణ సంప్రదింపులు జరపాలని, ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోతే మన దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసిన భారతీయ కమ్యూనిటీ సంక్షేమ నిధి నుంచి సముచిత చెల్లింపులు జరిపి ఆదుకోవాలని సూచించింది. ఇటీవల ఓ భారతీయ పర్యాటకుడు మాల్దీవులకు వెళ్లి మరణించారు. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తలెత్తడంతో వ్యవహారం హైకోర్టు దృష్టికి వచ్చింది. ఎస్ఓపీ, సంక్షేమ నిధి గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.