వచ్చిందమ్మా వీరనారి..!
posted on Jul 7, 2023 @ 3:39PM
వాసిరెడ్డి పద్మ.. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం (జూలై 5) మహిళ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసిరెడ్డి పద్మ ఈ సదస్సులో సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వారిని రోడ్డుపైకి లాగి తంతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడి, అసభ్యకర యుద్దానికి సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతీ శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవంగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎవరినైనా లక్ష్యంగా చేయాలనుకుంటే వారి కుటుంబంలోని మహిళలను బయటకు లాగి ఆశ్లీల చిత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని వివరించారు. బయట సమాజంలో ఇలా మాట్లాడితే రోడ్డుపైనే తంతారని చెప్పారు. న్యాయవ్యవస్థ, పోలీసులు ఈ సమస్య తీవ్రతను గుర్తించాలని సూచించారు.
మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టాలంటేనే భయపడే రోజులు రావాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా అసభ్యకర పోస్టులు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను హత్యా నేరం కంటే తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. అయితే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించ లేదని చెప్పారు.
అయితే వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తనదైన శైలిలో స్పందించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత నిద్రలేచిన మహిళా కమిషన్.. వాసిరెడ్డి పద్మ అంటూ వ్యంగ్యంగా అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై దాడి అనేది ఆమెకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపితే సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేస్తున్నారో వాసిరెడ్డికి పద్మకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను టార్గెట్‌గా చేసుకొని సమాజం సిగ్గుపడేలా ఎవరు పోస్టులు పెడుతున్నారో ఈ చైర్ పర్సన్‌కు అవగాహన లేదా అంటూ చురకలంటించారు. సోషల్ మీడియలో కూలీలను పెట్టి మరీ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారంటూ అధికార జగన్ పార్టీపై సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు.
మరోవైపు వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ఓ మహిళ కమిషన్ ఉందని.. తామకు ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బండ బూతులు మాట్లాడారని.. ప్రతిపక్ష పార్టీల అధినేతలను వారి ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. అటు మీడియాలో .. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయారని.. నేటికీ సోషల్ మీడియాలో వారిని మానసికంగా దెబ్బ తీసేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా సాక్షిగా ఆడిస్తున్న తాంత్రిక యుద్ధ తంత్రం నీచంగా.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోనే విధంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేనని.. మరి అప్పుడు స్పందించని ఈ మహిళా కమిషన్..? తాజాగా తెరపైకి వచ్చి.. అసభ్యకర యుద్ధానికి ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారంటూ పేర్కొంటున్నారని.. దీనిని ఎలా చూడాల్సి ఉందని నెటిజన్లు ప్రశ్నించారు.
ఇంత కాలం.. వివిధ పార్టీల్లోని మహిళలు, ఆ పార్టీల అధినేతల ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. సాగించిన ఈ యుద్ధంతో.. సదరు పార్టీల అధినేతల ఫ్యామిల్లోని స్త్రీల మనస్సులు ఎంతగా కలత చెంది కల్లోలంగా మారాయో.. ఓ మహిళగా మీకు అర్థం కాలేదా? కనీసం ఓ మానవత్వం ఉన్న మనిషి అయినా.. ఆ నాడే మీరు.. మీ పెద్దరికాన్ని నిలుపుకున్నట్లుగా .. ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిదులను, లక్షలాది రూపాయిలు వెచ్చించి.. ప్రత్యర్ధి పార్టీలపై నిప్పు లేకుండానే పొగలు సృష్టించే సోషల్ మీడియా వింగ్‌ను సమావేశ పరిచి.. ప్రతిపక్ష పార్టీల అధినేతలే మన టార్గెట్.. అంతేకానీ వారి ఫ్యామిలీలు కాదు.. వారి జోలికి వెళ్లకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడడండంటూ ఓ పెద్దరికంతో కూడిన ఓ సలహా, ఓ సూచన నాడే మీరు చేసి ఉంటే.. నేడు.. మీరు .. ఇలా సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులుగా మారుతున్నారంటూ.. ఇటువంటి సదస్సు ఏర్పాటు చేయడం.. ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారంలా మహిళలను గౌరవించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి ఉండేవి కావని నెటిజన్లు ఈ సందర్బంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన.. నాటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాసిరెడ్డి పద్మ.. పవర్ పుల్ మహిళ కమిషన్ చైర్మన్ గిరి దక్కగానే.. మబ్బుల చాటుకు వెళ్లిన చంద్రుడిలా మారిపోయారని నెటిజన్లు
సెటైర్లు వేస్తున్నారు.
అధికారం కోసం.. రాజకీయ పార్టీల నడుమ జరుగుతోన్న యుద్దానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. అసభ్యకర కథనాలకు వండి వారుస్తున్న సంగతి మీకు తెలినిది కాదనీ.. అందుకే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదని.. వాటిని ఆహ్వానించి ఉంటే.. అధికార పార్టీ రంగు బట్టబయలు అయి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా.. రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న ఈ యుద్దంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను పిలవడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మను ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియో జరుగుతోన్న ఈ వ్యవహారంతో తమకు, తమ ప్రభుత్వానికి ఏ మాత్రం బంధం, అనుబంధం, సంబంధం లేదని.. ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వడం కోసం.. వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ఈ వీరనారి వాసిరెడ్డి పద్మ.. ఐ ప్యాక్ అదేశంతో ఈ సదస్సు నిర్వహించినట్లుగా అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.