స్పీడ్ న్యూస్ 1
posted on Jul 11, 2023 @ 1:05PM
1.తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో కలకలం రేగుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో కరువు పరిస్థితి దాపురిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
2.ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో ప్రవేశించింది. 153వ రోజు కావలి పట్టణంలో యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి.
4.ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పీపీఏ సభ్యులు హాజరయ్యారు.
5.భారత దేశం 2075 కల్లా అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాతో పాటూ జపాన్, జర్మనీని కూడా భారత్ వెనక్కు నెడుతుందని పేర్కొంది.
6.మూడు పడవల్లో వెళ్తున్న 300 మంది వలసదారులు అట్లాంటిక్ మహా సముద్రంలో అదృశ్యమయ్యారు. 15 రోజుల క్రితం వీరంతా సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలండ్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
7.ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ వెళుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో, భారత్-ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించనుంది.
8.పాతబస్తీవాసులకు త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.
9.ఉమ్మడి పౌర స్మృతి బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సయిఫుల్లా రెహ్మానీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, తదితరులు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి, యూసీసీని వ్యతిరేకించాలని కోరారు.
10.మణిపూర్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల పట్ల దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది రాష్ట్ర ప్రభుత్వాల పని అని స్పష్టం చేసింది.
11. మూడు నాలుగు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది.
12.పలు హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
13.నటుడు ధనుష్, ఐశ్వర్యలకు మద్రాస్ హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్ ’ సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన కేసును కొట్టేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
14.అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా మహాసభలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని చెప్పారు.
15.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
16.బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ కోర్టులో హాజరుపరిచారు.
17.ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.
18.తెలంగాణ గవర్నర్ తమిళసైకీ ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. సోమవారం సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆమె కాన్వాయ్ కాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది.
19.ప్రముఖ దర్శకుడు, తన మాజీ భర్త శేఖర్ కపూర్ గురించి నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను మోసగించడంతోనే తమ వైవాహిక బంధం ముగిసిందని చెప్పారు.
20. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి వివాదం బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది. ఇరువురు నేతలతో బీఆర్ ఎస్ అధిష్టానం విడివిడిగా చర్చలు జరుపుతోంది.
21. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా చానల్ తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది.
22.హిందువుల మనోభావాలు దెబ్బతింటే.. సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదని.. యావత్తు భారతీయులదని ఎపీ సీఎం జగన్ గుర్తుంచుకోవాలన్నారు.
23. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.తాను అందరు వాలంటీర్లను అనడం లేదని స్పష్టతనిచ్చారు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే.
24.ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.
25.ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని జులై 14 నుండి 16 మధ్య ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు.