ఏపీ సీఈవోకు సీఈసీ పిలుపు.. కారణమేంటో?
posted on Jul 12, 2023 @ 10:35AM
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. ఆయనను హస్తిన రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆఘమేఘాల మీద ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఢిల్లీ వెళ్లడంతో ఇప్పుడు రాజకీయవర్గాలలో ముఖేష్ కుమార్ మీనా హస్తిన పర్యటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ముందుగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన సన్నాహకాలలో బిజీగా ఉంది. అయినా అంతటి పని ఒత్తిడిలోనూ ఏపీ సీఈవో ( ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి)ని హస్తినకు పిలిపించుకుంది. దీంతో రాజకీయవర్గాలలో ఆయన హస్తిన పర్యటనపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఓట్ల గల్లంతుపై వివరణ కోరేందుకు ఆయనను సీఈసీ హస్తినకు పిలిపించుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు ఆరోపణలపై ఎక్స్ ప్లనేషన్ కోరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదుపై ఏపీ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఆధారాలతో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం ఫర్యాదులో చూపిన ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదు అసాధారణ స్థాయిలో ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించిందనీ, ఇందులో భాగంగానే ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిపించుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మరో వైపు ఇటీవల జగన్ హస్తిన పర్యటనలో భాగంగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి చేసిన విజ్ణప్తి మేరకు.. అందుకు గల అవకాశాలపై చర్చించేందుకు సీఈసీ ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిచి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. ఏపీ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై పూర్తి వివరాలతో ఎస్ఈవో ఢిల్లీకి వెళ్లారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్రచారానికి బలం చేకూర్చే విధంగానే అధికారవర్గాల కథనం ఉంది.
ఏపీలో ముందస్తు ఎన్నికల విషయంపై సీఎం జగన్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలతో మాట్లాడారనీ, అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారనీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముకేష్ కుమార్ మీనా హస్తిన పర్యటన నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట మళ్లీ జోరుగా మొదలైంది. ఏపీలో ముందస్తుకు ఈసీ సన్నాహకాల నేపథ్యంలోనే ఏపీ సీఈఓను హస్తినకు పిలిపించుకుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో షెడ్యూల్ రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో పోలింగ్ జరుగుతుంది. ఇందు కోసం ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసింది. ఏపీలోనూ ఈ సన్నాహకాలు జరుగుతున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం (జూలై 12) సీఎం జగన్ కేబినెట్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఏపీలో ముందస్తు సన్నాహకాల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.