పొత్తులుంటాయి కేంద్ర మంత్రి.. చులకన కాదల్చుకోలేదు.. బాబు
posted on Jul 12, 2023 @ 2:20PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ, బీజేపీలు అడుగులు వేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్న అంచనాల నడుమ మరో సారి అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీసీ ఆడుతున్న మైండ్ గేమ్ కు బీజేపీ తోడైందంటున్నారు. అటువంటి మైండ్ గేమ్ లో భాగంగానే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం, జనసేనలతో బేజీపీ పొత్తు ఉంటుందన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు స్పందించబోనని ,అలా స్పందించి చులకన కాబోననీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ తో వైసీపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపడం, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు, రాష్ట్రపర్యటనకు వచ్చిన ఆ పార్టీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడం ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియోట్ చేయడమనే వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో సారి అధికారంలోకి రావాలంటే మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పేరుకే కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అయినా.. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలేవీ సొంతంగా ఒకింత బలం ఉన్న పార్టీలు కావు. లోక్ సభలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను అధిగమించి బలం చాటాలంటే ఎన్డీయేను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి. మరో వైపు ఇటీవలి కాలం వరకూ బలహీనంగా కనిపించిన కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒక్కసారిగా బలోపేతం అయ్యాయి.
కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతే ఇందుకు కారణమని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పాత మిత్రులను దరి చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఈ నెల 18న సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంలో మోడీ సర్కార్ పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతో పాత మిత్రులను కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలోనే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఒకే సమయంలో అధికార, విపక్షాలతో సంబంధాలను నెరపుతూ.. అవసరాన్ని బట్టి.. అంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ, తెలుగుదేశంల పెర్ఫార్మెన్స్ ను బట్టి, తన అవసరాలను బట్టి జట్టు కట్టాలన్న వ్యూహంతో కమలనాథులు పావులు కదుపుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఒకలా, హస్తినలో ఒకలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
కేంద్రం స్థాయిలో జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే.. రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కర్రవిరగకుండా, పాము చావకుండా అన్న టెక్నిక్ ను ఉపయోగిస్తోందంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై చంద్రబాబు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా స్పందించడమే కాకుండా దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్ దుర్మార్గపాలనను అంతమొందించడమే తన ధ్యేయమని చెప్పారు. ఇదొక పెద్ద బాధ్యత అందుకే పెద్ద ఆలోచనలూ చేయాలి. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. జగన్.. ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదన్న చంద్రబాబు, ఓట్ల అవకతవకలపై ఢిల్లీని వదిలిపెట్టేది లేదన్నారు. ఓట్ల తీసివేత, దొంగ ఓట్ల నమోదులను సరిదిద్దకపోతే కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోతుందన్నారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన ఖండించారు. వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందనీ, వలంటీర్ల ఉద్యోగాలకు ఢోకా లేదనీ భరోసా ఇస్తూనే వాలంటీర్ల సేవలను పౌర సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా ఆయన కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై స్పందించి చులకన కాదలచుకోలేదంటూనే ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియోట్ చేయడానికి జగన్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా రాజీలేకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.