లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగులు
posted on Jul 12, 2023 @ 12:17PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకొంది. ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం (జులై 11) ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లిలో 2 వేల కిలోమీటర్లు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా లోకేశ్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర .. కేవలం 153 మూడు రోజల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొన్న సందర్బంగా కొత్తపల్లిలో నారా లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర.. అప్రతిహతంగా సాగుతోండడం పట్ల.. టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
లోకేశ్ చేపట్టిన పాదయాత్ర రాయలసీమలో ప్రారంభమై.. 53 నియోజకవర్గాల్లోని 135 మండలాల మీదగా వందలాది గ్రామాల్లో నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో నారా లోకేశ్ .. 30 లక్షల మందిని నేరుగా కలవగా.. వివిధ వర్గాల ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.
ఇంకోవైపు ప్రతీ 100 కిలోమీటర్లకు ఆయన ఓ హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్బంగా కొత్తపల్లిలో పిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తామని ప్రజల్లో నారా లోకేశ్ భరోసా కల్పిస్తున్నారు.
ఇక నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఎక్కడా విరామం లేకుండా సాగుతోంది. అయితే అత్యవసరం అయితే తప్ప.. అంటే.. నందమూరి తారకరత్న మరణించిన సమయంలో.. ఆయన బౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఒక సారి.. అలాగే ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తరాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పార్టీ పండగ మహానాడు సందర్బంగా మాత్రమే.. నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన విషయం విదితమే.
అధికార జగన్ పార్టీ, పోలీసులు కలిసి ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. నారా లోకేశ్ మాత్రం తనదైన శైలీలో.. తాను అనుకున్న లక్ష్యం దిశగా వడి వడిగా అడుగులు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నారు. లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్రను నాలుగు వందల రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. అంటే నారా లోకేశ్ సగం లక్ష్యాన్ని పూర్తి చేసుకొని.. ఆయన అడుగులు లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ నారా లోకేశ్.