కేసీఆర్ సర్కార్ కు హిమాన్షు షాక్.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ఆవేదన
posted on Jul 13, 2023 @ 9:46AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు హిమాన్షు బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పరువును నిలువుగా గంగలో ముంచేశారు. గౌలిదొడ్డిలోకి కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు తన స్నేహితులతో కలిసి రూ.40 లక్షలు కంట్రిబ్యూట్ చేసి పాఠశాలకు సకల సౌకర్యాలూ కల్పించారు.
ఇది హర్షించదగ్గ విషయమే. ముఖ్యమంత్రి మనవడు బాధ్యత వహించి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించవచ్చ. కానీ అదే సమయంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సర్కారు స్కూళ్ళ దుస్థితి ని పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ పాఠశాలను సందర్శించిన హిమాన్షు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల వెంబడి నీళ్లోచ్చాయని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి బీఆర్ఎస్ సర్కార్ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద పీట వేశాం, సౌకర్యాలు కల్పించాం అని చెప్పుకుంటున్నదంతా మాటలకే పరిమితమని స్వయంగా సీఎం మనవడే చెప్పినట్లైంది.
రాష్ట్రం అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతోందంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే కేశవనగర్ పాఠశాల దుస్థితిపై హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ ప్రచారం చూస్తుంటే సర్కార్ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతను గుర్తుకు తెస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం వేదికగా కేసీఆర్ సర్కార్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనడానికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.
స్వంత చొరవతో సమకూర్చిన నిధులతో బాగుపడిన ఆ స్కూల్‌లోని కొత్త తరగతి గదులు, ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం( జూలై 12) ప్రారంభించారు. ఆ సందర్భంగా హిమాన్షు ప్రసంగం క్షేత్ర స్థాయిలో మన వూరు మన బడి కార్యక్రమం ఎంత సుందరముదనష్టంగా అమలు అవుతోందో కళ్లకు కట్టింది.