వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. ఏది నిజం.. ఏది అబద్దం?
posted on Jul 12, 2023 7:23AM
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరో బర్నింగ్ అంశం నడుస్తున్నది. రెండో విడత వారాహీ విజయయాత్ర మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏలూరులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు ఎవరు ఎవరి మనిషి.. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి.. ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
వాలంటీర్లపై ఇంతటి స్థాయి ఆరోపణలు చేసిన పవన్ ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని, దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని చేసిన వ్యాఖ్యలు ఇటు వాలంటీర్లలో, అటు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. వాలంటీర్లు, వైసీపీ నేతలు, మహిళా కమిషన్ స్పందన ఎలా ఉన్నా అసలు పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? వాలంటీర్ వ్యవస్థకు ఉన్న నిబద్దత ఎంత? అన్నదానిపై ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద నిజంగానే ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు.. వారేం చేస్తారు.. ఆదాయం ఎంత.. కులం ఏంటి? యువతీ యువకులు ఎంతమంది? వారేం చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇంట్లో వితంతువులు ఉన్నారా? వారికి ఆదాయం ఉందా? ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు, అప్పులు, బ్యాంక్ వివరాలు, గర్భవతులు ఎవరు? ఇలా ఒక్కటేమిటీ ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి సమాచారం ఒక్క క్లిక్ తో వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వం భద్రత కల్పించిందా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు కావాలని అడిగే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో వాలంటీర్ల వద్ద సమాచారానికి మేము కల్పించిన భద్రత ఇదని ప్రభుత్వం ముందుగా చెప్పాలి.
ఇక పవన్ కల్యాణ్ వాలంటీర్లు టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలను చూస్తే.. వాలంటీర్లపై ఈ నాలుగేళ్ళలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల నుండి ప్రభుత్వ పథకాల వరకూ వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది అక్షరాలా నిజం. ఎందుకంటే దాదాపుగా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే. ఈ మాట వైసీపీ నేతలే బహిరంగంగానే చెప్పేశారు. ఆ కారణంగానే పవన్ అంత పెద్ద ఆరోపణ చేయగలిగారు. ఇక పవన్ వ్యాఖ్యల వెనక మరో కారణం వైసీపీని రెచ్చగొట్టడంగా కనిపిస్తుంది. వారాహీ తొలి విడత యాత్రతో జనసేనలో జోష్ కనిపించింది. అయితే, పవన్ చేసిన ఆరోపణలకు మాత్రం వైసీపీ నుండి సమాధానం రాలేదు. పైగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాత్రమే వైసీపీ దాడి చేసింది. అందుకే పవన్ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. పవన్ అనుకున్నట్లుగానే వైసీపీ నుండి, ప్రభుత్వం నుండి జెట్ స్పీడ్ లో రెస్పాన్స్ వచ్చింది. పవన్ యాత్రకి ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చేసింది. మరి ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో.. ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి ఉంది.