అన్ స్టాపబుల్ లోకేష్..
posted on Jul 12, 2023 7:01AM
యువగళం@2000KM! నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్ష్ పూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలక మైలురాయికి చేరుకుంది. లోకేశ్ యువగళం పాదయాత్ర మంగళవారం (జూలై11) 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో లోకేష్ 153వ రోజున ఈ 50 శాతం లక్ష్యం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ వడివడిగా అడుగులు వేస్తూ నిర్ధేశించిన గడువు కంటే ముందే యాభై శాతం లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నారు.
కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27న యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర దోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు చారిత్రాత్మక 1000 కి.మీ మైలురాయి చేరుకుంది. ఇక ఇప్పుడు 153వ రోజున నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10 కిలోమీటర్ల చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్.. 153 రోజుల్లో సగటున 13.15 కి.మీల చొప్పున నడక సాగించారు. ఈ పాదయాత్రలో లోకేష్ ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకోగా.. మొత్తం 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల గుండా నడక సాగించారు. 49 చోట్ల బహిరంగసభలలో ప్రసంగించిన ఈ యువనేత వివిధవర్గాలతో ఫేస్ టూ ఫేస్ సమావేశాలు నిర్వహించారు. ఈ యాత్రలో మొత్తం 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందుకున్న లోకేష్.. 5 చోట్ల ప్రజల మధ్య నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లె ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఇక పాదయాత్ర విషయానికి వస్తే రాయలసీమలో లోకేష్ యువగళం చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ఇప్పటివరకు 29 రోజులు 425 కి.మీ మేర పాదయాత్ర పూర్తయింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్యమైన సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, లోకేష్ విజయవంతంగా 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా లోకేష్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా నారా లోకేష్ పాదయాత్ర 2వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా.. 3వ స్థానంలో #2000kmOfYuvaGalam హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వేదికగా వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. యువనేత పాదయాత్రకి విశేష స్పందన లభిస్తున్నది.
ఈ పాదయాత్రపై ప్రత్యర్ధులు అవాకులు చవాకులు పేలినా లోకేష్ యాత్ర ముమ్మాటికీ సూపర్ సక్సెస్ అయింది. గతంలో లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండో అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి ఈ యువగళం యాత్ర చెంపపెట్టు లాంటి జవాబిచ్చింది. ఇన్ని వేల కిలోమటర్ల దూరం ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ.. సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగడం అంటే సామాన్య విషయం కాదు. ఒక వైపు ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం ఇస్తూనే లోకేష్ ఒక్కో మెట్టు ఎదగడం విశేషం. ఉదాహరణకు పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ మొత్తం యాత్రకు హైలైట్ కాగా.. టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జగన్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా.. ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా అంటూ లోకేష్ విసిరిన బాణాలు సూటిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలాయి.
వీటితో పాటు ప్రతి వంద కిలోమీటర్లకు ఓ వరాన్ని ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్.. ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతూ.. నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను పెట్టిన ఇబ్బందులను గుర్తుచేస్తూ.. వైసీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూ టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల విడమర్చి చెప్తూ జనంలోకి చొచ్చుకుపోతున్నారు. అయితే, ఇది సగమే. మరో అర్ధం భాగం ఉందంటే లోకేష్ ప్రజలకు ఇంకెంత చేరువ అవుతారో అర్ధం చేసుకోవచ్చు.