టైగర్ నాగేశ్వరరావును నిలిపేయండి
posted on Jul 12, 2023 7:29AM
టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదల అయితే తమ మనోభావాలు దెబ్బతింటాయని గిరిజన సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ని నిలిపి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ కమిషనర్, డీజీపీకి వారు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో నేరస్తుల రాజధాని స్టూవర్ట్ పురం. ఈ గ్రామానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావుపై చిత్రం తెరకెక్కిస్తున్నట్లు.. ఆ చిత్ర టీజర్ విడుదల సమయంలో సినిమా నిర్మాతలు ప్రకటించారన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారని.. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వల్ల .. తమ సామాజిక వర్గం పట్ల.. ప్రజల్లో ఓ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల తమకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సదరు గిరిజన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో సైతం ప్రస్తుత తమ సామాజిక వర్గానికి ఉద్యోగాలు దొరకడం లేదని.. అలాంటి వేళ ఇటువంటి సినిమాలు విడుదల అయితే తమ పరిస్థితి మరింత దిగజారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఎరుకుల ప్రజలన్నా.. స్టూవర్ట్‌పురం అన్నా ప్రజల్లో ఓ విధమైన చులకన భావం ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలని అటు సినిమాటోగ్రఫీ కమిషనర్, ఇటు డీజీపీని కోరినట్లు వారు వివరించారు.
డీజీపీని, సినిమాటోగ్రఫీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో గిరిజన నాయకులు చుక్కా పాల్ రాజు, స్టూవర్ట్‌పురం వైస్ ప్రెసిడెంట్ శ్రీరాగాల రాము, విశ్రాంత ఎస్‌ఐ వల్లాగి కాంతారావు, ఎబినేజర్, రామారావుతోపాటు విజయవాడకు చెందిన ప్రముఖ గిరిజన నాయకులు తిమ్మాసర్తి నాగేశ్వరరావు, మల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.