నిప్పులు చిమ్మే విమర్శలు పైపైనే.. లోన మాత్రం బీఆర్ఎస్ దిక్సూచి బీజేపీనే?!
posted on Jul 12, 2023 7:05AM
తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ ఆరోపణ ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ బీజేపీ పైకి శత్రువులుగా కనిపించినా లోపల ఆ రెండు పార్టీలు మిత్రులేనని.. ఆ రెండు పార్టీలూ కాంగ్రెస్ ఓటమి కోసమే పనిచేస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. రాజకీయాలంటేనే పార్టీలు సహజంగా ప్రత్యర్థుల ఓటమి కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తున్నది అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటమితో పాటు బీజేపీకి మేలు చేసే పనులు మాత్రమే చేస్తుందన్నది తెలంగాణ రాజకీయాలలో నడుస్తున్న చర్చ. ఒకప్పుడు కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టే వారే లేరని.. ఆ బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నానని కేసీఆర్ చెప్తే ఏమో కావచ్చులే అనుకున్న జనం ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ చూసిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసమే పనిచేస్తున్నదని అనుమానిస్తున్నారు.
తన పార్టీని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన నినాదం జల్ జంగిల్ జమీన్. దేశవ్యాప్తంగా ఈ నినాదం మీదనే తన కార్యాచరణ ఉంటుందని చెప్పారు. అదే సమయంలో మోడీ పాలన కంటే మన్మోహన్ సింగే నయమని.. ఎన్డీయే కంటే యూపీఏనే నయమన్నారు. అంతేకాదు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి ఏమేం చేయాలనుకుంటోందో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు. మరి నిజంగానే కేసీఆర్ బీజేపీ విముక్తి కోరుకుంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్ అంటే బీజేపీ బీ టీం అనేంతగా పరిస్థితిలో ఎందుకు మార్పు వచ్చింది? బీజేపీని ఢీ కొట్టేందుకే ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతటి విమర్శ ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ నేతలు సాదా సీదా కౌంటర్లకే పరిమితమవడం ఏ సంకేతాలు ఇస్తున్నాయి? అసలు నిజంగానే తెర వెనక ఏదైనా జరుగుతున్నదా అన్న చర్చలు జోరందుకున్నాయి.
బీఆర్ఎస్, కేసీఆర్ పై ఈ స్థాయిలో ఆరోపణలకు కారణం ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవడం.. అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీపై దూకుడు తగ్గించడం.. కాంగ్రెస్ కు అనువుగా ఉన్న చోట బీఆర్ఎస్ పాగా వేయాలని చూడడం. గత నాలుగేళ్లలో బీజేపీపై కేసీఆర్ కారాలు మిరియాలు నూరినా, అప్పుడప్పుడు పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లొల్లి చేసినా అంతిమంగా బీజేపీ తెచ్చిన వాటికి అనుకూలంగానే ఓటేసేవారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా కేంద్రం వద్దకు వెళ్లేసరికి రెండు పార్టీల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంటూ వస్తుంది. ఒక దశలో టీఆర్ఎస్ ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరిపోతుందని, అప్పట్లో ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా కేసీఆర్ బీజేపీపై విమర్శల వాన కురిపించడం మొదలు పెట్టారు.
ఇక్కడ రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్-బీజేపీ శత్రువులే అన్నట్లు నిత్యం ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి రావడం.. రేపో మాపో కవితను అరెస్ట్ అనేంతగా హీటెక్కించి హఠాత్తుగా ఆ ఎపిసోడ్ ను ముగించారు. ఆ దర్యాప్తు ఏమయ్యిందో తెలియదు.. కేసు ఉందో లేదో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య తిట్ల దాడి తగ్గింది. ఇంతలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ రావడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అనేది బలంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. కూతురు కవిత కోసమే కేసీఆర్ బీజేపీపై దూకుడు తగ్గించారా? లేక అసలు ఈ రెండు పార్టీల వ్యూహమే ఇలా బెడిసి కొట్టిందా? అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని ఎన్నికల ముందే సినిమా క్లైమాక్స్ కి వచ్చేసిందా? అనేలా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి.
అయితే, ఒక పార్టీ ఉమ్మడి శత్రువులు మిత్రులుగా మారడం రాజకీయాలలో పెద్ద విడ్డూరమేమీ కాదు. బీఆర్ఎస్ నినాదమే కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కాగా.. బీజేపీ కోరుకుంటున్నది కాంగ్రెస్ ముక్త్ భారత్. రెండిటి లక్ష్యం ఒక్కటే అయినపుడు దగ్గరవడం సహజమే. కానీ.. ఇది రెండు పార్టీలు కలిసి ఆడించిన ఆటానా.. లేక బీజేపీ ప్లాన్ చేసి కలిసేలా చేసుకుందా అన్నది ఆసక్తికరం. ఇక అసలు ఈ ఊహాగానాలు నిజమా.. లేక బీజేపీపై కేసీఆర్ పోరాటమే నిజమా? చూడాలి.