సుప్రీంలో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ.. అమరావతి కేసుల విచారణ డిసెంబర్ కు వాయిదా
posted on Jul 12, 2023 @ 11:24AM
ఏపీ రాజధాని విశాఖ ఇప్పట్లో.. ఇప్పట్లో ఏంటి అసలు సాధ్యమే కాదని తెలుగువన్ ముందే చెప్పింది. ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీం కోర్టు అమరావతి కేసుల విచారణను డిసెంబర్ కు వాయిదా వేసింది. సత్వర విచారణ కోసం ఏపీ తరఫు న్యాయవాదులు పదే పదే విజ్ణప్తి చేసినా సుప్రీం కోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు. దీంతో త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతుంది.. తాను కూడా త్వరలోనే విశాఖకు మకాం మార్చేస్తున్నానంటూ జగన్ చెబుతున్న మాటలు ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేదన్నది తేటతెల్లమైపోయింది.
రాజధాని కేసుల విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్ కు వాయిదా వేయడంతో వచ్చే ఎన్నికలలోగా జగన్ విశాఖ కలలు నెరవేరే అవకాశం లేదన్నదీ తేటతెల్లమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ విశాఖ మకాం మార్పు గురించి చెప్పారు. అది జరిగి ఇప్పటికి ఐదు నెలలు అయ్యింది. వాస్తవానికి విశాఖ గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు అసెంబ్లీలో, మీడియా సమావేశాలలో, పలు సభలలో కూడా జగన్ తాను విశాఖ నుంచే పాలన సాగిస్తాననీ, సీఎం ఎక్కడ ఉంటే అది రాజధాని అవుతుందని చెప్పిన సంగతి విదితమే. తన మకాం విశాఖ మార్చేందుకు జగన్ ఇప్పటికే పలు ముహూర్తాలు నిర్ణయించారు. ఒకసారి ఈ సంక్రాంతి, ఇంకోసారి ఈ దసరా.. ఇలా ఎప్పటికప్పడు ముహుర్తాలు ఫిక్స్ అయితే చేశారు కానీ ఆయన అడుగు మాత్రం తాడేపల్లి ప్యాలస్ దాటి పడలేదు. ఒక సమయంలో అయితే సీఎం విశాఖలో ఉండేందుకు నివాసం కోసం గాలింపు మొదలైందనీ, బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారనీ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఆయనకు విశాఖలో నివాసం ఉండేందుకు ఇల్లు దొరకలేదు.
మూడు రాజధానుల ముచ్చట ముందుకు సాగలేదు. విశాఖ నుండే పరిపాలన అన్న మాటలు సముద్ర అలల్లా ముందుకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లిపోయాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన ఘటనతో నగర ప్రతిష్ట బంగాళాఖాతంలో కలిసిపోయిందనీ, దీంతో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు విశాఖ రావడం అటుంచి.. ఉన్నవారు నగరం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్నారు. స్వయంగా విశాఖ వైసీపీ ఎంపీ కూడా తన వ్యాపారాలను హైదరాబాద్ కు మార్చేసుకుంటున్నారు. ఏపీ రాజధాని కేసులను సుప్రీంకోర్టు వచ్చే డిసెంబర్ కు వాయిదా వేసింది. అత్యవసరం అని.. వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు లాయర్ అదేపనిగా ఒత్తిడి చేసినా ధర్మాసనం కుదరదని తేల్చి చెప్పేసింది. ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభమైన వెంటనే వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సందర్భంలో ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని చెప్పిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.