వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే!
posted on Jul 12, 2023 @ 10:10AM
ఏపీ సీఎం జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఇంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా జగన్ సర్కార్ వాలంటీర్లను ఎందుకు వెనుకేసుకు వస్తోంది? వారి మీద ఈగ వాలినా ఎందుకు సహించడం లేదు. ఎందుకంటే వారు పార్టీ కార్యకర్తలు కనుక. వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం కోసం జగన్ పూర్తిగా వాలంటీర్లమీదే ఆధారపడ్డారు కనుక.
ఈ విషయాన్ని మంత్రులు పలు సందర్భాలలో బాహాటంగానే చెప్పారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు అయితే ఒక అడుగుముందుకు వేసి వాలంటీర్లు పార్టీ కార్యకర్తలేనని కుండబద్దలు కొట్టారు. పార్టీకి వ్యతిరేకంగా వాలంటీర్లు ఎవరైనా ఉంటే చెప్పండి.. వారిని తీసేసి మరింత విశ్వాసంగా పార్టీ కోసం పని చేసే వారిని నియమిస్తామని చెప్పేశారు.
ఇప్పుడు మనం మననం చేసుకోవలసిందేమిటంటే.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనన్న సంగతి ఈ వ్యవస్థను జగన్ తీసుకువచ్చిన రోజే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విస్పష్టంగా చెప్పారు. ఇటీవల వారాహి యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే చెప్పారు. నేడో రేపో ఎన్నికల సంఘం కూడా అదే చెబుతుంది. ఉద్యోగులు, వాలంటీర్లు ఒక్కటి ఎంత మాత్రం కాదు. ప్రభుత్వోద్యోగులకు, వాలంటీర్లు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగులు రాజ్యాంగ వ్యవస్థకు చెందిన వారు. వాలంటీర్లు జగన్ సొంత వ్యవస్థకు చెందిన వ్యక్తలు. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలూ లేవు. అదే ప్రభుత్వోద్యోగులైతే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి, ఇంటర్వ్యూను ఎదుర్కొని అందులో సెలెక్ట్ కావాలి. అదే వాలంటీర్లకు అయితే ఎలాంటి పరీక్షలూ లేవు. ఇంటర్వ్యూలు అసలే ఉండవు. వారికి ఉండాల్సిన అర్హత అల్లా వైసీపీ నేతల ఆమోదం. ఆ పార్టీ కార్యకర్త అన్న ముద్ర.
ఇప్పటికే ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వార్డ్ మెంబెర్లు, కౌన్సిలర్ల చేతులు కట్టేసింది జగన్ సర్కార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచిన, ప్రజా సేవ చేయడానికి,నాయకత్వ లక్షణాల ఉన్న వార్డ్ మెంబెర్లు కు జీతాలు కూడా ఇవ్వని ప్రభుత్వం, పార్టీ కార్యకర్తలుకు మాత్రం నెలకు 5000 రూపాయలు ఇచ్చి పార్టీ కోసం వాడుకుంటోంది. వారు చేసేది పార్టీ పని.. తీసుకునేది ప్రభుత్వ జీతం. ఈ వాలంటర్ల వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తోంది. జనం సొమ్మును దుర్వినియోగం చేస్తున్నది. పార్టీ ప్రయోజనాల సంగతి అలా ఉంచితే.. భవిష్యత్తులో ఇంక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టేశారనే చెప్పాలి. ఎందుకంటే వాలంటర్లు అనే వ్యవస్థ ప్రజల మీద కు జగన్ వదిలిన విషపు బాణం. 2024 ఎన్నికలలో వైసీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రతీ ఉద్యోగి ప్రక్కన ఒక వైయస్సార్ కార్యకర్త అంటే వాలంటీర్ ఉంటాడు, ఉద్యోగులు ఏం చేయాలో వాళ్లే నిర్దేశిస్తారు. ఇప్పటికే ప్రజలు వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా వైసీపీకి చేరిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. వ్యవస్థల గోప్యతకు కూడా చెల్లుచీటీ ఖాయమని అంటున్నారు. ఈ విషయాన్ని అన్యాపదేశంగానైనా మంత్రి అంబటి రాంబాబు ఒక పార్టీ సమావేశంలో వెల్లడించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేననీ, వైసీపీ కోసం, మరో సారి వైసీపీకి అధికారం దక్కడం కోసం జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదినీ చెప్పారు. జగన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము అంటే వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు నియమితులైన వారేనని విస్ఫష్టంగా చెప్పారు. ఏ దాపరికం లేకుండా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని చెప్పాశారు. వాలంటీర్లలో ఎవరైనా వైసీపీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహ రిస్తుంటే చెప్పండి.. వారిని తీసేసి కొత్త వారిని పెడతాం అని హామీ కూడా ఇచ్చారు.
నిజానికి ఇప్పుడేంటి.. గతంలోనే అప్పట్లో వైసీపీలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి వాలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే నని చెప్పారు. వాలంటీర్లు పార్టీకి కూడా పని చేస్తారని వివరణ కూడా ఇచ్చారు. ఇక పవన్ వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు మీడియా ముందుకు వచ్చి వైసీపీ కార్యకర్తలలాగే మాట్లాడారు. తమ కర్తవ్యం, బాధ్యత అంతా కూడా మరో సారి వైసీపీని, జగన్ ను అధికారంలోకి తీసుకురావడమేనని ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు.