చంద్రయాన్ 3కు .కౌంట్‌డౌన్ ప్రారంభం
posted on Jul 13, 2023 9:25AM
చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) సిద్ధమైంది. గురువారం (జూలై 13)మధ్యాహ్నం 2 గంటల 35 నిముషాల 13 సెకండ్లకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై 24 గంటల పాటు కొనసాగుతుంది.
శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 35 నిముషాల13 సెకండ్లకు గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెడుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ షార్ కు చేరుకుని వాహక నౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి గృహంలో చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు.
చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, ఎల్‌వీఎం-3పీ4 మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్, అసోసియేట్ మిషన్ డైరెక్టర్ నారాయణన్, వెహికల్ డైరెక్టర్ బిజూస్ థామస్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.
చందమామపైకి ల్యాండర్‌ను విజయవంతంగా జారవిడిచిన చంద్రయాన్ -1 తరువాత ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. లోపాలను సవరించుకొని చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం (జూలై14)నుంచి సరిగ్గా 40 రోజుల తర్వాత చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకొంటుంది.