తెలంగాణ బీజేపీ మూడు ముక్కలు!
posted on Jul 12, 2023 @ 2:09PM
తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. బీజేపీ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం పేరుతో వలస నేతలను ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు బీజేపీలో నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈ అసమ్మతిని తొలగించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆ అసమ్మతి రాగం ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. పైగా అది పెరిగి పార్టీని ముక్కలు చేస్తున్నది. అంతర్గత కుమ్ములాటను తగ్గించేందుకు తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున మార్పులను చేసింది. ముఖ్యంగా నాయకత్వ మార్పుతో అయినా పార్టీ గాడిన పడుతుందని అధిష్టానం భావించింది. అయితే అందుకు భిన్నంగా అంతకు ముందు పార్టీలో రెండు వర్గాలు ఉంటే ఇప్పుడు ప్రక్షాళన తరువాత మూడవ వర్గం ఏర్పడి పార్టీ లో మూడు ముక్కలాట పరిస్థితి ఏర్పడింది.
ఈ మధ్యనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. నిజానికి బండిని తప్పించాలనే డిమాండ్ మరో సీనియర్ నేత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుది. వీళ్ళు బాహాటంగానే బండి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బండిని తప్పించాలని కోరిన వారికి కాకుండా కిషన్ రెడ్డికి పార్టీ అప్పగించింది అధిష్టానం. రెండు వర్గాలను కలుపుకుపోతాడనే కిషన్ కు ఈ పని అప్పజెప్పింది. కానీ, ఆ రెండు వర్గాలు కలిసిపోవడం సంగతెలా ఉన్నా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కిషన్ కు మరో వర్గం ఏర్పడింది. ఫలితంగా ఇప్పుడు ఒకే రాష్ట్ర శాఖలో మూడు వర్గాలు ఏర్పడి ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
దీంతో ఇలాంటి పరిస్థితుల్లో కిషన్‌రెడ్డిని ఎంపిక చేయడం బీజేపీకి ఏమాత్రం కలిసొచ్చే విషయం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ మూడు వర్గాలలో ప్రధానంగా ఈటల వర్గం తనకు అధ్యక్ష పదవి దక్కలేదనే ఆవేశంలో ఉండగా.. బండి వర్గం తమ నేతలు తప్పించడంపై అసమ్మతి వెళ్లగక్కుతుంది. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వెనక సీఎం అభ్యర్థిగా హామీ ఉందనే ప్రచారంతో ఈటల, బండి వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మరోవైపు ఈటలకు చేరికల కమిటీ బాధ్యతలు ఇవ్వడంపై కూడా ముందు నుండీ పార్టీలో ఉన్న సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరికి వారు మూడు వర్గాలు తన నాయకుడే సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో మూడు ముక్కలాటతో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది.
అధిష్ఠానం తీసుకున్న నాయకత్వ మార్పు నిర్ణయం వల్ల క్యాడర్‌లో ఇంకా గందరగోళం పెరిగింది. వర్గపోరు చల్లారకపోగా మరింత ఎక్కువైంది. దీంతో ఇప్పుడు సగటు బీజేపీ కార్యకర్తల్లో బీజేపీని నమ్ముకోవడం కరెక్టు కాదేమో అన్న సందిగ్ధతకు బీజం పడినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వర్గ పోరు బీజేపీకి తగులుకుంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే తెలంగాణలో బీజేపీ మళ్ళీ జీరో స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఈ నేతల అసంతృప్తిని మాఫీ చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.