ఏపీలో మరో పార్టీ.. ముహూర్తం ఎప్పుడంటే?

ఏపీలో ఇప్పటికే సుమారు పదికిపైగా రాజకీయాలు పార్టీలున్నాయి. ఇందులో  ఐదు పార్టీలు మాత్రమే ప్రజలకు బాగా తెలుసు. ఒకటి అధికారంలో ఉన్న వైసీపీ, రెండు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, మూడు జనసేన. మరో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఇవి కాకుండా ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఏపీలో ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. వాటిలో ఈ మధ్యనే పుట్టుకొచ్చిన కొత్త పార్టీ భార‌త చైత‌న్య యువజ‌న పార్టీ(బీసీవైపీ)  కూడా ఉంది. గతంలో జనసేనలో పనిచేసి, వైసీపీతో యుద్ధం చేసి, బీజేపీకి దగ్గరైన బోడె రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. దీంతో పాటు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఎప్పటి నుండో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసమని జై భీం పార్టీ, అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా రైతు సంక్షేమ పార్టీ    ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు తెచ్చుకొనే పనిలో ఉన్నాయి. ఇవి కాకుండా బీఎస్పీ లాంటి ఇతర రాష్ట్రాలలో పుట్టి జాతీయ  గుర్తింపు కోసం తపన పడే మరికొన్ని కూడా ఇక్కడ పోటీ చేస్తుంటాయి. ఇక   ఉన్నవి చాలవన్నట్లు మరో పార్టీ కూడా పుట్టుకొస్తున్నది. అదే  పూలే అంబేద్క‌ర్ రాజ్యాంగ స‌మితి (పీఏఆర్ ఎస్‌పీ). ఈ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాల బాగు కోసమేనని ప్రత్యేకంగా వాళ్ళు ప్రకటించాల్సిన పని కూడా లేదు. ఈ పీఏఆర్ ఎస్‌పీ ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబ‌రులో అట్టహాసంగా పార్టీని  ప్రారంభించ‌నున్న‌ట్టు ఆ స‌మితి క‌న్వీన‌ర్ క‌టిక‌ల శివ భాగ్యారావు తెలిపారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకునే ప‌నిలో ఉన్నామ‌ని ,ఆ ప్రక్రియ పూర్తి కాగానే ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. పీఏఆర్ ఎస్‌పీ ఒక్కటే కాదు ఇలాంటి ఎన్నో పార్టీలు ఎన్నికలకు ముందు రావడం సహజమే. ప్రతిసారి ఎన్నికలకు ముందు బయటకి రావడం.. ఇతర పార్టీల రెబల్స్, అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసి పోటీ చేయిస్తూ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ వర్గాలు రెగ్యులర్ గా చూస్తున్నదే, చేస్తున్నదే. అయితే  ఈసారి ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. ఒకవైపు వైసీపీ, తెలుగుదేశం. జనసేన ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయ చందరంగం ఆడుతుంటే, బీజేపీ పై నుండి ఎవరిని దెబ్బకొట్టి పై చేయి సాధించాలా అని ప్రణాళికలు రచించుకుంటున్నది. ఈ క్రమంలోనే ఇలా కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటే సహజంగానే అటెన్షన్ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాటైన రామచంద్ర యాదవ్ బీసీవైపీ.. రాష్ట్రంలో బీసీల ఓట్లను చీల్చేందుకేనని గట్టి ప్రచారం జరుగుతున్నది. తెర వెనక బీజేపీ నడిపిస్తున్న డ్రామాగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇలా పీఏఆర్ఎస్పీ, జై భీం పార్టీలు ఎస్సీ, ఎస్టీ వర్గాలను టార్గెట్ చేసి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పార్టీల వెనక కూడా బలమైన శక్తులే ఉండే అవకాశం ఉందన్నది  పరిశీలకుల విశ్లేషణ  వీటితో పాటు ప్రాంతాల ప్రాతిపదికన ఏర్పాటైన రాయలసీమ పార్టీలు, త్వరలో రాబోతున్న అమరావతి పార్టీలు కూడా బలమైన కారణం చేత రాబోతున్న పార్టీలే. ఇవన్నీ ఎంత మేరకు ఓట్లు చీల్చనున్నాయంటే ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. కానీ, పరిస్థితులు తారుమారైతే ఇవే పెద్ద పెద్ద పార్టీలకు కూడా చిక్కులు తెచ్చి పెడతాయి. గుర్తులలో పోలికలు, అసంతృప ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారి పోటీకి దిగడం.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అసంతృప్తి.. ఇవి ప్రభావం చూపి ఒక్కోసారి గెలుపోటములను కూడా తారుమారు చేస్తుంటాయి. ఈ క్రమంలో ఈసారి ఏపీలో వీటి ప్రభావం ఎవరిపై పడనుందో చూడాల్సి ఉంది.

72 మందితో జగన్ ఫస్ట్ లిస్ట్.. 22 మంది కొత్త మొహాలే!

ఏపీలో వైసీపీకి అస్సలు టైం బాగాలేదు. ఒకవైపు టీడీపీ, జనసేన గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పలేని ఆరోపణలతో సతాయిస్తుంటే.. సొంత పార్టీ నేతలేమో కుమ్ములాటలు పెట్టుకొని పార్టీ పరువు బజారున పడేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, గత ఎన్నికలలో ఇచ్చి  ఇప్పటికీ నెరవేర్చని హామీలు, వివేకానంద రెడ్డి హత్యకేసు వెక్కిరిస్తున్నాయి. అన్నిటినీ పొలిటికల్ మేనేజ్మెంట్ తో ఓవర్ టేక్ చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ పెద్దలు మిగతా వారి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 72 మందితో ఈ తొలి జాబితా ఉంటుందని, ఇప్పటికే ఈ 72 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఈ 72 మందితో రానున్న తొలి జాబితాలో 22 మంది కొత్త ముఖాలే కావడం విశేషం అంటున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన, పోటీ చేసిన 22 మందికి ఈసారి టికెట్లు కేటాయించలేదని తెలుస్తుంది. ఈ మొదటి జాబితా 72 మందితో సిద్ధం చేయగా అందులో 50 మంది మాత్రమే సిట్టింగులు కాగా మిగిలిన 22 మంది కొత్తముఖాలని తెలుస్తున్నది. ఏ ఏ నియోజకవర్గాలతో ఈ మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం బయటకి పొక్కకపోయినా 22 మంది కొత్త మొఖాలతో ఈ జాబితా బయటకి రావడం పక్కా అంటున్నారు. రెడీ అయిన ఈ తొలి జాబితాను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని దసరా పండుగ నాటికి ఫైనల్ చేసి బయటకి వదలనున్నట్లు తెలుస్తుండగా.. ఎంత క్రాస్ చెక్ చేసినా ఒకటీ రెండు స్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉండగా 20కి పైగా కొత్త అభ్యర్థులతో ఈ జాబితా రానున్నట్లు కనిపిస్తుంది. కాగా, ఈ 72 మంది జాబితాలోనే 22 మంది కొత్త వారంటే.. ఇక రాష్ట్రం మొత్తం మీద 175 స్థానాలలో వంద కూడా సిట్టింగులకు దక్కే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఇందులో సీనియర్లు, మాజీ మంత్రులు, మంత్రులు కూడా ఉండడం గ్యారంటీ  అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఉత్తరాంధ్ర నుండి అవంతి, నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ నుండి రోజా లాంటి వారికే ఈసారి సీటు దక్కడం అనుమానమే అని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. సగానికి సగం మందిని కొత్త వారిని దించే క్రమంలోనే ఎంత వీలయితే అంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజలకు చేరువ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తున్నది. కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజలలోకి పంపి తమ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకి తీసుకెళ్లాలన్నది జగన్ అభిమతంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు, సీఎం జగన్ సొంత  సంస్థల ఫీడ్ బ్యాక్ అన్నటినీ కలిపితే వచ్చిన ఫలితాల ఆధారంగానే  సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇప్పటికే ఒకటీ రెండు సార్లు జగన్ హెచ్చరించినా ఎమ్మెల్యేలలో ఏ మాత్రం మార్పు లేదని, అందుకే సంపూర్ణ ప్రక్షాళన దిశగానే ఈ అభ్యర్థుల జాబితాలు బయటకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరి ఇంత పెద్ద మొత్తంలో సిట్టింగులకు చాన్స్ లేదంటే.. ఈసారి వైసీపీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది.  ఈ పరిస్థితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

పవన్ కు బీజేపీ ఆఫర్.. కలిసి నడిస్తే చిరంజీవికి రాజ్యసభ?

ఏపీ రాజకీయాలలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ తీరానికి చేరుతుందా అన్న స్పష్టత రాలేదు. జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంది.  అదే సమయంలో  టీడీపీతో కూడా కలిసి వెళ్లాలని ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన వైఖరిని చాలాసార్లు ఓపెన్ గానే చెప్పేశారు. అయితే, బీజేపీ నుండి ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి వెళ్లాలా అనే దానిపై ఇంకా సందిగ్దత కొనసాగుతున్నది. మరోవైపు టీడీపీ కూడా జనసేనతో అయితే ఒకే కానీ.. బీజేపీతో అవసరమా అన్నట్లుగా ముభావంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేసి టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారని కూడా పెద్దగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే  ఇటీవల పవన్ ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరై బీజేపీతోనే ప్రయాణం అన్న స్పష్టత ఇచ్చేశారు.  అదే సమయంలో  ఏపీలో  ప్రస్తుతం బీజేపీ కలిసి వస్తే సరే లేకుంటే తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం   గట్టిగానే జరుగుతుంది. అందుకే బీజేపీ ముందుగానే మేల్కొని సరికొత్త ప్రతిపాదనలతో  రాజకీయం మొదలు పెట్టినట్లుగా  రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీని కాదని తనతో కలిసి ఉండేలా బీజేపీ పవన్ కళ్యాణ్ కు కొన్ని ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది.  తమతో జనసేన కలిసి నడిస్తే.. పవన్ సోదరుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ పవన్ కళ్యాణ్ కు అఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో   ప్రచారం జరుగుతున్నది. చిరంజీవి గతంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తరువాత కాంగ్రెస్ తరఫున  ఒకసారి రాజ్యసభకు వెళ్లి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, ఈసారికి బీజేపీ ఆయనను  రాజ్యసభకు పంపే  ఆలోచన చేస్తున్నదని, అందుకు ఏపీలో జనసేన తమ పార్టీతో కలిసి నడవాలన్న కండీషన్ పెట్టిందని అంటున్నారు. నిజానికి  తెలుగుదేశం పార్టీని కాదని జనసేన బీజేపీతో ఎన్నికలకు వెళ్తే ఆ రెండు పార్టీల కూటమి పెర్ఫార్మెన్స్ ప్లాప్ కాక తప్పదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏపీలో ఒక్క శాతం ఓట్లు దక్కించుకుంటే అదే బ్రహ్మాండం. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తన హీరో ఇమేజ్ ను ఎంతవరకు ఓట్లుగా మలచుకోగలరన్నది ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఇన్నేళ్లైనా ఎలాంటి క్లారిటీ లేకుండానే మిగిలిపోయింది.   అదే టీడీపీతో కలిసి వెళ్తే పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు ఎంతో కొంత మంది జనసేన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలరని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన సోదరుడికి రాజ్యసభ సభ్యత్వం అన్న ఒకే ఒక్క ఆఫర్ ను అంగీకరించి బీజేపీతోనే ప్రయాణిస్తారా అంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు అంటున్నారు.   మరోవైపు బీజేపీ ఏపీలో పాగా వేయడానికి ఎన్నాళ్ళుగానో ఆరాటపడుతున్నది. అందులో భాగంగానే పవన్ ద్వారా మెగా ఫ్యామిలీని గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదంటున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. గతంలో  అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి ఏవో చర్చలు జరిపారు. తమకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరగా జూనియర్ ఎన్టీఆర్   సున్నితం తిరస్కరించినట్లుఅప్పట్లో ప్రచారం జరిగింది. ఇలా మొత్తంగా ఏదో ఒక మార్గాన ఏపీలో జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతున్నది. అందులో భాగంగానే టీడీపీ నుండి పవన్ ను దూరం చేసి తద్వారా రెండు పార్టీలనూ బలహీనం చేయడం ద్వారా రాష్ట్రంలో తన పెత్తనానికి ఢోకా లేకుండా చూసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ బీజేపీ బంధిత పార్టీయే అంటూ వారు వివరిస్తున్నారు.  

కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు!

ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాదన వచ్చును,  ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అదేదో ..జోక్ అన్నట్లు కొట్టెయ వచ్చును, కానీ, కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి రగులుతోంది... ఇది నిజం. అయితే, ఎమ్మెల్యేల అసంతృప్తి ఇప్పటికిప్పుడు భగ్గుమనే పరిస్థతి లేదు. ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు, కాదంటే, నియోజక వర్గ ప్రజల్లో చులకన కా కూడదన్న ఆలోచనతో , పత్రికలలో ప్రచారం కోసం  అసంతృప్తి రూట్ ఆశ్రయించి ఉంటే ఉండవచ్చును. అయినా మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతోంది అనేది నిజమని కాంగ్రెస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. సెగ లేనిదే పొగరాదు ..స్వయంగా ముఖ్యమంత్రి సిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అసంతృప్తి ప్రస్తావన చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చిని పరిశీలకులు అంటున్నారు.   ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీఎల్పీ సమావేశంలోనే మంత్రులకు క్లాసు తీసుకున్నారు. మంత్రుల పట్ల  ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని, ఎమ్మెల్యేల ఫిర్యాదులను మంత్రుల ముందుంచి ... ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కుని గెలిచిన ఎమ్మెల్యేలు, నిండా రెండు నెలలు అయినా నిండకుండానే ఎందుకు నొప్పులు పడుతున్నారో, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మీడియాకు ఉప్పందిస్తునారు.  ప్రజల నమ్మకాల మేరకు పని చేయలేకపోతున్నామని, మా నియోజకవర్గ పనులపై ఇంఛార్జ్ మంత్రులు స్పందించడం లేదని, నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సీనియర్ నేత బీఆర్ పాటిల్ సహా 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆప్పట్లో  అది ఫేక్ లేఖగా కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు.   తాజాగా మరో ఎమ్మెల్యే తన ఆవేదన వెళ్లగక్కతూ సీఎం సిద్ధరామయ్యకు అదే తరహలో లేఖ రాశారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నానని... తనను కనీసం ఏదో ఒక మంత్రికి పీఏగానో, ఓఎస్డీగానో నియమించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో ఎమ్మెల్యే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను వారో వీరో ఎవరో కాకుండా సీఎల్పీ సమావేశంలో స్వయంగా సిద్ధరామయ్య బయటపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారు. కాగా ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల అసంతృప్తిని వారి ఎదుటే బయట పెట్టడంతో సిఎల్పీ సమావేశంలో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అందుబాటులోకి రావడం లేదని ఫిర్యాదు చేశారని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. అయితే, తమ ఫిర్యాదుల్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఏ మంత్రిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. అదలా ఉంటే, పాటిల్ లేఖపై సంతకాలు చేసినట్లు చెపుతున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు    ముఖ్యమంత్రి  దృష్టిని ఆకర్షించేందుకే లేఖ రాశామని చెప్పగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారిని మందలించారు. అటువంటి వ్యూహాలకు పాల్పడకుండా నేరుగా ఫిర్యాదులను తన వద్ద ప్రస్తావించాలని ఆయన వారిని కోరినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలోనే చన్నగిరి ఎమ్మెల్యే తన అభ్యర్థనపై ఎటువంటి స్పందన రాలేదని, కాబట్టి తనను ఓఎస్‌డీ లేదా ఏ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించాలని సీఎంను అభ్యర్థించారు. అయితే, తర్వాత ఈ లేఖ ఓ జోక్ అంటూ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.అయితే ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం ఏమంటే..ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలు ఆనుకున్న విధంగా సాగకపోవడతో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలలో అసంతృప్తి అగ్గి రాజుకుందని అంటున్నారు.అయితే. ఈ మొతం వ్యవహారానికి కొసమెరుపు ఏమంటే,  నిధుల కొరతను కారణంగా చూపించి ఈ ఏడాదికి హామీల అమలు విషయంలో  సర్దుకుపోవాలని, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ చేతులేత్తశారు.

ఏపీ రాజకీయాలలో రోజా ప్రస్థానం ముగిసిందా?

ఏపీ రాజకీయాలలో ఆమె పేరు ఎంత ప్రముఖమో అంత వివాదాస్పదం కూడా. ప్రత్యర్థులను తన విమర్శలతో చీల్చి చెండాడటం.. పంచ్ డైలాగులతో రెచ్చిపోవడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఆమే రోజా. అయితే ఇప్పుడు రోజాకు ఏపీ రాజకీయాలలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీలోనే ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆమె చూపు తమిళనాడు వైపు మళ్లింది. అసలు తెలుగు రాష్ట్రాలలో అటు సినీ పరిశ్రమలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ పరిచయం అక్కర్లేని పేరు రోజా. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా రెండు పడవల మీదా కాలేసి కూడా సక్సెస్ ఫుల్ గా రెండు రంగాలలోనూ రాణించిన రోజా.. రాజకీయాలలో మాత్రం ఎంతగా పాపులర్ అయ్యారో అంతగా వివాదాలలో కూడా నిలిచారు. తెలుగుదేశంతో ప్రారంభమైన ఆమె పొలిటికల్ కెరీర్ వైసీపీలో చేరి మంత్రి అయ్యేవరకూ నిర్విఘ్నంగా సాగింది. ఆమె వాగ్ధాటి, ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో విరుచుకుపడే తీరు ఆమెకు అతి తక్కువ కాలంలోనే రాజకీయరంగంలో కూడా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.  తెలుగుదేశం తరఫున ఆమె పోటీ చేసి పరాజయం పాలైన తరువాత పార్టీ శ్రేణులే తన విజయాన్ని అడ్డుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసి ఆ పార్టీకి దూరమై వైసీపీలో చేరారు. మధ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్ గూటికి చేరదామనుకున్న ఆమెకు అప్పట్లో పరిస్థితులు పెద్దగా కలిసి రాలేదు. ఆయన మరణానంతరం జగన్ వైసీపీ పేరిట సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయగానే రోజా ఆ పార్టీలో చేరిపోయారు. వరుసగా 2014, 2019 ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి విడతలోనే మంత్రి పదవి ఆశించిన రోజాకు నిరాశే ఎదురైంది. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. దీంతో రెండో విడతలో రోజాను మంత్రి పదవి వరించింది. అయితే అప్పటి నుంచీ రోజాకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం నగరిలోనే ఆమెకు వ్యతిరేకత ఆరంభమైంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తో తొలి నుంచీ ఉన్న విభేదాలకు తోడు నగరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల నుంచీ వ్యతిరేకత ఎదురైంది. నియోజవర్గంలో జరిగే ప్రారంభోత్సవాలకు సైతం ఆమెకు ఆహ్వానం అందని పరిస్థితి. మరో వైపు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మరో సారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న జగన్  పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పని తరు, ఆయా నియోజకవర్గాలలో వారికి ఉన్న సానుకూలత, ప్రతికూలత తదితర అంశాలపై పలు సర్వేలు నిర్వహించుకుని, నివేదికలు తెప్పించుకుని ఫిల్టర్ చేస్తున్నారని అంటున్నారు. ఆ నివేదికలలో నియోజకవర్గంలో మంత్రి రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతో వచ్చే ఎన్నికలలో ఆమెకు టికెట్ అనుమానమేనని పార్టీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అంతే కాకుండా మంత్రిగా రోజా తీరు పట్ల కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు. క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి మరీ కలెక్షన్ క్వీన్ గా అవతరించారన్న విమర్శలూ వెల్లవెత్తుతున్నాయి.  వీటన్నిటినీ గమనించి మంత్రి రోజా  ఏపీ రాజకీయాలలో తనకు మనుగడ లేదన్న నిర్ణయానికి వచ్చేసి తమిళనాడు వైపు దృష్టి సారించారన్న వార్త రాజకీయ సర్కిల్స్ లో సర్క్యేలేట్ అవుతున్నారు. రోజాకు తమిళనాడులో కూడా నటిగా మంచి గుర్తింపు ఉంది. ఆమె భర్త సెల్వమణి తమిళనాడులో పేరెన్నికగన్నదర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళరాజకీయ రంగ ప్రవేశానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.  అందుకు తార్కానంగా  కొంత కాలం కిందట ఆమె కాలునొప్పితో బాధపడుతూ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా ఫోన్ చేసి మరీ రోజా క్షేమ సమాచారాలు కనుక్కున్నారు.  అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ ఇటీవల  మంత్రి రోజాను   కలిశారు? వీరి భేటీ కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగునటి అయినా కూడా తమిళనాట రమ్యకృష్ణకు స్టార్ ఇమేజ్ ఉంది. ఆమె కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనీ, తమిళనాట తనకు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించాలని భావిస్తున్నారనీ ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. రమ్యకృష్ణ డీఎంకేకు దగ్గర అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రమ్యకృష్ణ రోజా భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. రోజా తమిళరాజకీయలపై కన్నేసిన నేపథ్యంలో రమ్యకృష్ణ ఆమెతో భేటీ కావడంతో ఇరువురూ ఆ రాష్ట్రంలో అధికార డీఎంకేకు గ్లామర్ స్టార్స్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసి వచ్చే ఎన్నికలలో అక్కడ నుంచి పోలీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. 

మాజీ మంత్రి బాలినేని గోడ దూకేస్తున్నారా? వైసీపీలో అనుమానాలు!

ఏపీ సీఎం జగన్ కు సమీప బంధువు, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయన అడుగులో అడుగేస్తూ నడుస్తూ వస్తున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా పార్టీలో ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తన మంత్రి పదవిని ఊడబీకడం నుంచి మొదలైన అసంతృప్తి ఆటుపోటుల్లా అప్పుడప్పుడు పీక్స్ వెళ్లడం.. తరువాత తాడేపల్లి బుజ్జగింపులతో చల్లారడం జరుగుతూ వస్తోంది. మధ్యలో ఒక సారి తాను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పని చేస్తారనీ, అంతకు మించి పార్టీ బాధ్యతలను చేపట్టే ఉద్దేశం లేదని చెప్పారు. జిల్లా సమన్వయ కర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంత మాత్రాన ఆయన జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా విపక్ష తెలుగుదేశంపై విమర్శల విషయంలో మాత్రం చురుకుగానే ఉంటూ వస్తున్నారు. అయితే లోకేష్ యువగళం పాదయాత్ర ఎప్పుడైతే  ప్రకాశం జిల్లాలో ప్రవేశించిందో అప్పటి నుంచీ వైసీపీ శ్రేణుల్లో బాలినేనిపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో కొనసాగితే ఆ జిల్లాలో.. ఆ నియోజకవర్గంలో  వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయా మంత్రలు, నేతలు, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో, ఒంగోలు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగినా ఆయన బాలినేనిని పన్నెత్తు మాట అనలేదు.  చిన్న పాటి విమర్శ చేయలేదు. బాలినేనిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావించనే లేదు. దీంతో బాలినేనిపై వైసీపీ వర్గాలలో అనుమానాలు బయలుదేరాయి. ఆయన గోడ దూకి దేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ మారే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని ఆరాతీశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.   లోకేష్ తనను విమర్శించకపోవడం కూడా తన తప్పేనా అని బాలినేని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తరచే తనను అవమానించడం రివాజుగా మారిపోయిందని బాధపడుతున్నారు. సొంత పార్టీ వారే తనను టార్గెట్ చేసి జగన్ వద్ద బ్యాడ్ చేస్తున్నారన్నది బాలినేని ఆవేదనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  మొత్తం మీద  బాలినేని తెలుగుదేశం గూటికి చేరి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు నుంచి లోక్ సభ బరిలో దిగుతారన్న ఊహాగానాలైతే వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలకు బాలినేని ఒకింత దూరంగా ఉండటాన్ని పార్టీ వర్గాలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. ఒంగోలు ఎంపీగా పోటీ కి ఫిక్సయ్యారన్న ప్రచారం జరుగుతోంది .   

బీజేపీ డబుల్ గేమ్.. వైసీపే షాడో ఫైటింగ్

దక్షిణాదిలో  ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు, బీజేపీ పట్టువీడని విక్రమార్కునిలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిజానికి, తెలంగాణ విషయం ఎలా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏమి చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలి పోతోంది. ఇది చరిత్ర.  అయినా, ఓటమి నుంచి ఓటమికి సాగే ప్రయాణంలో కమల దళం’ కొత్త ఎత్తులు, పొత్తులతో ప్రయోగాలు  చేస్తోంది.  ఇప్పుడు అదే, క్రమంలో నేషన్ ఫస్ట్ ... అని ప్రవచనాలు పలికే బీజీపీ ... రాష్ట్ర  ప్రయోజనాలతో  పాటుగా దేశ ప్రయోజనాలను సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున వైసీపే అరాచక, అసమర్ధ పాలనక కొనసాగింపుకు తెర వెనక కుట్రలకు తెర తీసిందనే  అనే అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. అవును, అందుకే, తెలుగు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వైసేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ తేరా వెనక కుట్రలు   పన్నుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈకుతల్లో భాగంగానే తెలుగు దేశం పార్టీని ఒంటరిని చేసేందుకు ఇటు జగన్ రెడ్డిని, అటు పవన్ కళ్యాణ్’ను కమల దళం దువ్వుతోందని అంటున్నారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా, 40 శాతం ఓట్లు తెచ్చుకుని జన పక్షంగా నిలిచింది. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. మరో వంక,జగన్ రెడ్డి ‘ఒక్క ఓటు’ అభ్యర్ధనకు మోసపోయిన ప్రజలు, ఆయన గారి నిజ రూపాన్ని తెలుసుకుని  అతగాడిని సాగనంపేందుకు  సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి, రాజధాని అయినా లేని రాష్ట్రంగా నవ్యాన్ధ్రను మిగిల్చిన జగన్ రెడ్డికి  మరో ఛాన్స్ ఇచ్చేది లేదని ‘గడప గడప’ ముఖం మీదనే తలుపులు వేస్తున్న సమయంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీ సర్కార్’కు ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.  ముఖ్యంగా ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన కలవటం ఖాయమైన నేపధ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం మొదలు తీసుకుంటున నిర్ణయాలు,   తాజా పాత్ర అనుమానస్పదంగా ఉందని అంటున్నారు. ఓ వంక జనసేన నేత పవన్ కళ్యాణ్’ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో ముందుకు సాగుతుంటే, అదే సమయంలో పవన్’ను దగ్గరకు తీసిన బీజేపీ, టీడీపీతో దూరంగా ఉంటోంది. అంతే కాదు, బీజేపీ  జగన్ రెడ్డికి మేలు చేసేందుకు పవన్ కళ్యాణ్’ను కూడా తమవైపుకు తిప్పుకుని ముక్కోణపు పోటీ వ్యూహ రచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.     ఈనేపధ్యంలో ఇప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్ర బీజేపే నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు, మరో వంక వైసీపీ నాయకులూ ముందెన్నడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా పురందేశ్వరికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. విరుదుచ్కు పడుతున్నారు. రాష్ట్రంలో నిండా ఒక శాతం ఓటు లేని బీజేపీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పురందేశ్వరికి  ఉన్న కుటుంబ సంబంధాలను తెర మీదకు తెచ్చి మంత్రులు సహా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్రంలో పోటీ, వైసీపీ, బీజేపీల మధ్యనే ఉంటుందనే ‘చిత్రా’న్ని చూపించే ప్రయత్నం వైసీపే చేస్తోంది.  పోనీ అదీ నిజం అనుకుందామంటే, అదే సమయంలోనే కేంద్రం ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తోంది. అంతే  కాదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శిస్తున్న కమల నాధులు, అడిగిందే తడవుగా నిబంధనలను తుంగలో తొక్కి మరీ రాష్ట్రాన్ని, మరింత అప్పుల ఊబిలోకి తీసుకుపోయే విధంగా ఆర్థిక వెసులు బాటు పేరున జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసులుకుంటోంది. ఒక విధంగాచూస్తే జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకు, రాష్ట్ర ప్రజల మెడలకు అప్పుల ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో   చంద్రబాబు నాయుడు  ఎంతగా అడిగినా పట్టించుకోని రెవిన్యూ లోటు నిధులు ఇప్పుడు విడుదల చేసింది, మోదీ ప్రభుత్వం. రాష్ట్రానికి నిధులు విడుదల  చేయడం స్వాగతించదగిన పరిణామమే అయినా, ఆ నిర్ణయం వెనక ఉన్న కుట్ర, కుతంత్రం ఏమిటన్నదే ఇప్పడు అసలు ప్రశ్న, అంటున్నారు.  తాజాగా కేంద్రం జగన్ హాయంలో ఏపీలో గతం కంటే పెట్టుబడులు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో అసలు పెట్టబుడులు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని ప్రకటించింది. ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని నీతి అయోగ్ నిర్ధారించింది. పేదరిక నియంత్రణకు జగన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు మేలు చేశాయని పేర్కొంది. మరో వంక మణిపుర్ హింసాకండను నిరసిస్తూ ప్రతిపక్ష కూటమి లోక్ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం, రాష్త్రాల హక్కులను హరించేందుకు ఉద్దేశించిన, ‘ఢిల్లీ ఆర్డినెన్సు’ స్థానంలో ప్రవేశ పెట్టే బిఅల్లు సహా, ఎన్నికల్ సమయంలో మోదీ ప్రభుత్వానికి కీలకంగా మారిన ఇతర వివాదాస్పద బిల్లులకు వైసీపీ, అడగక ముందే  జీ హుజూర్ అంటూ’ జై కొట్టింది.  ఇలా ఒకరి కొకరు పరస్పరం సహకరించుకుంటున్న బీజేపీ, వైసీపీ రాష్ట్రంలో మాత్రం షాడో గిభ్ట్ చేస్తున్నారు. అయితే, ప్రజలు అమాయకులు కాదు .. ఆరు నూరైనా ..మళ్ళీ మరో మరు జగన్ రెడ్డికి అధికారం అప్పగించేంది లేదని సప్స్తం చేస్తున్నారు.

ఇండియా కూటమి మూడో భేటీ ముంబైలో?

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో, అధికారం నిలుపుకునేందుకు, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి కొత్త మిత్రులను చేర్చుకునే ప్ర్యతాన్ చేస్తుంటే, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఒకటైన ఐఎన్డీఐఎ (ఇండియ)కూటమి, అధికార ఎన్డీ కూటమిని ఎదుర్కునేందుకు వరస సమావేశాలతో ఐక్యతను చాటుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.  ఓ వంక మణిపుర్  హింస పై పార్లమెంట్ లో మోదీ ప్రభుతానికి వ్యత్గిరేకంగా, అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించిన ఐఎన్డీఐఎ కూటమి మరోవంక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పోరాటాలకు సిద్దమవుతోంది. అలాగే, ఇప్పటికే... పాట్న, బెంగుళూరులలో రెండు సార్లు సమావేశమైన విపక్ష కూటమి తదుపరి మూడవ  సమావేశం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 24-25 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. జూలై 18న  26 పార్టీలు హాజరైన  జూలై 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో కూటమి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సహా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల గాంధీతో పాటుగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్  హాజరుకావడం బెంగుళూరు సమావేసానికి హైలైట్‌గా నిలిచింది.  ముంబైలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో కో-ఆర్డినేషన్ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర ప్యానల్‌్ఫను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. కాగా, ముంబై సమావేశంలో 11 మంది సభ్యులతో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి అధ్యక్షుడు, కన్వీనర్‌ను కూడా ముంబై సమావేశంలో ఎంచుకుంటారు. కాగా, కూటమి అధ్యక్ష పదవికి అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అంతిమంగా సోనియా గాంధీ నాయకత్వంపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని అంటున్నారు.

అంతా మా ఇష్టం అన్నట్లుగా బొత్స వ్యాఖ్యలు!

రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది.. మన దేశంలో అదే సుప్రీమ్. దాని ప్రకారమే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలి. దేశంలో అన్ని వ్యవస్థలు ఎలా ఉండాలో  రాజ్యాంగంలో   పెద్దలు పొందుపరిచారు. ఒ రాజ్యాంగ అమలులో ఎలాంటి లోపాలు ఉన్నా న్యాయస్థానాలు కల్పించుకొని సరిదిద్దుతాయి. ముందుగా హెచ్చరించి అప్పటికీ వినకపోతే మొట్టికాయలు వేసి మరీ అమలు చేయాలని ఆదేశిస్తాయి. అయితే, అంతిమంగా ఆదేశాలు అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వాలే. సరిగ్గా ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు న్యాయస్థానాలలో మొట్టికాయలు తిన్నావైసీపీ నేతల తీరు మారడం లేదు. ఉన్నతాధికారులను సైతం బోనులలో నిలబెట్టి మొట్టికాయలు వేసి పంపింది. కానీ, తీరు మారనే లేదు.  తాజాగా హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు అధికారులు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయినా, ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంలో తామే కరెక్ట్ అని.. కోర్టులే తప్పని దబాయించడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. జగన్ సర్కార్ స్కూల్ విద్యార్థులకు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ చేస్తూ వస్తున్నది. కాగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఈ సభకు భారీ ఎత్తున స్కూలు విద్యార్దుల్ని, వారి తల్లితండ్రుల్ని తరలించారు.  పెద్ద సంఖ్యలో పిల్లలు హాజరైన ఈ సభలో  పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై  సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.  ఒక రాజకీయ సభకు విద్యార్థులను తరలించడం రాజ్యాంగానికి విరుద్ధం. పైగా చిన్నారులు ఉన్న ఒక సభలో పెళ్లిళ్లు, కాపురాలు అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దారుణం. దీంతో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ సభలకు విద్యార్ధుల్ని తరలించవద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని ప్రభుత్వం ఉల్లంఘించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్ధానిక విద్యాశాఖాధికారి సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా దాఖలైన ఈ పిటిషన్ పై శుక్రవారం( జూలై 28) హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌, హోంశాఖ కార్యదర్శి దీనిపై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది.  దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అమ్మ ఒడి సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పు కాదని.. ఇంకా చెప్పాలంటే అసలు ఇలాంటి సభలకు పిల్లలు కాకుంటే సినీ నటులు వస్తారా? అని వెటకారంగా మాట్లాడారు. దీంతో మరోసారి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అభం శుభం ఎరుగని అమాయక  చిన్నారుల ముందు ఈ సిగ్గులేని రాజకీయాలు మాట్లాడకూడదని, ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల మెదళ్లలో ఈ కుళ్ళు రాజకీయాల బీజం పడకూడదనే.. రాజకీయ సభలకు విద్యార్థులను తరలించకూడదని కోర్టు చెప్పింది. కానీ, మన మంత్రి గారేమో చిన్నారులు కాకుండా సినీ స్టార్లు వస్తారా అని వెటకారంగా మాట్లాడడం చూస్తే వీళ్ళు మన రాజ్యాంగానికి ఏపాటి విలువ ఇస్తున్నారన్నది అవగతమౌతుంది. ఒకపక్క కోర్టులు ఇంతగా మొత్తుకుంటున్నా.. బోనులోకి పిలిచి వాయిస్తున్నా మాకు మేమే సుప్రీం, మేము రాసుకున్నదే రాజ్యాంగం అనేలా వైసీపీ నేతలు ప్రవర్తించడం సమాజానికే శ్రేయస్కరం కాదన్నది మేధావుల వాదన.

హస్తినలో కాళ్ల బేరం.. ఏపీలో విమర్శల సమరం

తప్పును తప్పు అని చెప్పడం.. పెద్ద తప్పైపోయినట్లు తయారైంది అధికార వైసీపీ నేతలకు అన్న    చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్ గద్దెనెక్కిన తర్వాత.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది?... ఎంత మందికి సంక్షేమం చేరిందంటే ఆలోచించాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.  అలాంటి వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం  జోనల్ సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వ విధి విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్‌గా చేసుకొని వైసీపీ కీలక నేత  విజయ్ సాయిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతే.. ఇక రాష్ట్ర   మంత్రి ఆర్కే రోజా మీడియా సాక్షిగా.. అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జీ వైవీ సుబ్బారెడ్డి...   ఒకే రోజు.. అలాగే   ఒకే విధమైన ఆరోపణలు గుప్పించారు. అదీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా విమర్శలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అని పేర్కొన్నారు.    ఇక పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం  వస్తోందని మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లు ఏం మాట్లాడుతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురందేశ్వరీ విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని  రోజా హితవు పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్ట్ చదువుతున్నారని అనుమానంగా ఉందని విశాఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి కూడా మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు.  ఇక పురందేశ్వరీ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద పురందేశ్వరి కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దాచి పెట్టాల్సిన పని ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అన్ని విధాలా బీజేపీకి మద్దతిస్తున్నామని ఆయన  ఈ సందర్భంగా పేర్కొన్నారు.  మొత్తం మీద కేంద్రంలో బీజేపీకి అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్న వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో బీజేపీ నేతలు నోరెత్తితేనే ఉలికిపాటుకు గురౌతున్నారని అర్ధమౌతోంది. కేంద్రంలో కాళ్ల బేరం రాష్ట్రంలో విమర్శల సమరం అన్నట్లుగా వైసీపీ తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.

అధికార పార్టీలో బెరుకు బెదురు!?

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ సొంత చిన్నాన్న  వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఇటీవల చోటు చేసుకొంటున్న వరుస  పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలోని అత్యంత కీలక నేతల్లో నిద్రకరవైందనే   చర్చ ఆ పార్టీలోని ఓ వర్గంలో హల్‌చల్ చేస్తున్నది.  తన తండ్రి  వివేకా హత్య జరిగిన కొద్ది రోజులకు.. తన సోదరుడు, సీఎం  జగన్ భార్య వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులంతా ఒకే సారి తన ఇంటికి వచ్చారని.. ఆ సమయంలో   భారతీ ఆందోళన చెందుతూ కనిపించారని.. అలాగే ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడాలంటూ   భారతి.. తనకు సూచించారని డాక్టర్  సునీత పేర్కొన్నట్లు పలు కథనాలు జులై 22, 23వ తేదీల్లో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి.  ఆ వెంటనే అంటే.. ఆ రెండు రోజులకే జులై 25న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి... ఆ కథనాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా... వివేకా హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత.. తాను, తన ఫ్యామిలీ   సునీత నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చామని స్పష్టం చేశారు. అంతేకానీ  భారతి,   విజయమ్మ, తాను కలిసి   సునీత ఇంటికీ వెళ్ల లేదని చెప్పారు.  అయితే ఆ రెండు రోజుల తర్వాత.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ  అవినాష్‌రెడ్డి నేరుగా తాడేపల్లి చేరుకొని..  సోదరుడు, ముఖ్యమంత్రి  జగన్‌తోపాటు ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయి పలు కీలక అంశాలపై   సుదీర్ఘంగా చర్చించినట్లు ఓ చర్చ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది.    ఇది జరిగిన   రెండు రోజులకే సీఎం జగన్ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం... తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. వివేకా హత్య కేసులో ఇంతకు ముందు సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకుందని.. దీంతో వివేకా హత్య కేసు ఛార్జీషిట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని   పిటిషన్ దాఖలు చేశారు.   ఇలా వరుసగా ప్రతీ రెండు రోజులకు ఒకరు.. ఇలా బుల్లి తెర తెలుగు సీరియల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే ఇప్పటి వరకు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో.. ఈ హత్యకు స్కెచ్ చేసిందెవరో... అన్ని ప్రజలకు క్లియర్‌ కట్‌గా అర్థమైనా..  ఈ హత్య కేసులో   సజ్జల , అవినాష్ లు జగన్ తో భేటీ కావడం,   అనంతరం అజేయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే వివేకాహత్య కేసు విషయంలో అధికార పార్టీలో ఏదో బెరుకు, బెదురు కనిపిస్తున్నదని తేటతెల్లం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వారిలో మరొకరు ఎవరో బయటకొచ్చి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇంకోవైపు ఆగస్టు 14వ తేదీ కోర్టుకు హాజరుకావాలంటూ.. కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. అలాంటి వేళ ఈ అంశం  వైసీపీలోని అత్యంత కీలక నేతల్లో గుబులు రేపుతోందని, అందుకే సజ్జల, అవినాష్, జగన్ ల భేటీ, అజేయ్ కల్లాం పిటిషన్ అని అంటున్నారు. 

ఇక బాబు ప్రత్యక్ష యుద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే?

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ప్రతిపక్షాలు ఫుల్ స్వింగ్ లో ప్రజల వద్దకు దూసుకెళ్తున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు టీడీపీ నుండి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం వారాహీ విజయ యాత్రతో జనసైనికులలో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఏం చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇటు నారా లోకేష్, అటు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అటు సొంత పార్టీల కుమ్ములాట, ఇటు ప్రతిపక్షాల విమర్శల ధాటికి తట్టుకోలేక వైసీపీ ఢీలా పడిపోతుంది. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రంగంలోకి దిగబోతున్నారు. గత రెండు మూడు రోజులుగా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అందులో ప్రధానమైనది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి. ఈ ప్రాజెక్టుల పరిస్థితిపైనే చంద్రబాబు గత రెండు రోజులుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉంది?  గతంలో తమ ప్రభుత్వ హయంలో ఎంత ఖర్చు చేశారో..  ఆ ప్రాజెక్టులు ఎంతవరకు నిర్మాణం అయ్యాయి.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు చేసింది తదితర విషయాలను లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలు పెట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం ఎంతగా, ఎంతలా నిర్లక్ష్యం చేసిందో పూస గుచ్చినట్లు మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుల అంశంపైనే చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ముందుగా రాయలసీమ నుండి మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు మొదటి వారం నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, ప్రాజెక్టులపై ప్రత్యక్ష సమారానికి సిద్ధం కావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. స్వయంగా చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఉదాహరణలతో సహా ఎండగట్టనున్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులు మొదలు  పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులు  అన్నిటినీ సందర్శించి గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి? ఎవరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు ఎంతవరకు పూర్తి చేశారన్నది అంకెలతో సహా ప్రజలలోకి తీసుకెళ్లనున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటన్నది ఏపీ ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ నాలుగేళ్ళలో మీడియా కూడా ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ. జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో కొన్నాళ్ల పాటు హడావుడి జరిగింది. కానీ ఆ తర్వాత ఆ టెండర్లు ఏమయ్యాయో.. ఎంతవరకు వచ్చాయో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇక పోలవరం సహా  ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో.. ఈ ప్రభుత్వం వాటి కోసం ఎంత ఖర్చు పెట్టిందో కూడా ఎవరికీ పెద్దగాఅవగాహన లేదనే చెప్పాలి. సంక్షేమ జపం చేస్తూ, బటన్ నొక్కుడు, పందేరం పని వినా జగన్  ప్రభుత్వం ప్రాజెక్టులకు చేసిందేమీ లేదు.  అందుకే చంద్రబాబు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఇలా ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? అన్నది సోదాహరణంగా చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. అయితే జగన్ సర్కార్ చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను సక్రమంగా సాగనిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న!

జగన్ సభలకు పిల్లల తరలింపు.. కోర్టులో జడ శ్రవణ్ కుమార్ పిటిషన్

రాష్ట్రంలో ఆబాలగోపాలానికి దూషణల స్వరం వినిపించడమే జగన్ లక్ష్యంగా ఆయన సభలు సాగుతున్నాయి. అవేమీ పార్టీ సభలు కాదు. ప్రభుత్వ సభలు. ఆ సభలకు ప్రేక్షకులు ఎవరు అన్న దానితో సంబంధం లేకుండా జగన్ విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడా విషయం మళ్లీ కొత్తగా ప్రస్తావించడం ఎందుకు అనుకుంటున్నారా?    విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, విద్యాదీవెన కిట్ల పంపిణీ వంటి సభలకు తరలిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన కిట్లు పంపిణీ వంటి సభలకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలిస్తున్నారు. ఆయా సందర్భాలలో జగన్ ప్రసంగాలు ఆ కార్యక్రమానికి సంబంధించి కాకుండా విపక్ష నేతల పెళ్లిళ్లు కాపురాలు వంటి అంశాలపై ఉంటున్నాయి. విపక్ష నేతలను తూలనాడటంతో తన వాచాలతను చాటుకోవడానికి ఘనత వహించిన సీఎం జగన్  ఒకటో తరగతి పిలల్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా విద్యార్థులను తీసుకువచ్చి మరీ ఏర్పాటు చేసిన సభలలో జగన్ రోడ్డి  ప్రసంగాలు   పెళ్లాలు.. పెళ్లిళ్లు , కాపురాలు, కడుపులూ అంటూ వారిని పెడతోవ పట్టించేలా ఉంటున్నాయి. జగన్ ఈ తీరుపై   హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.   ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు చిన్న పిల్లలను తరలించవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు  ఉన్నా.. జగన్ పట్టించుకోవడంలేదు. దీంతో న్యాయవాది విశ్లేషకుడు జడ శ్రవణ్ కుమార్ హై కోర్టులో పిటిషన్ వేశారు.  ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సభలకు పిల్లలను తరలించరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పొందుపరుస్తూ, జగన్  కురుపాంలో జగన్ నిర్వహించిన అమ్మఒడి సభ కు పిల్లల తరలింపుపై  ఆర్టీఐ సమాచారంతో జడ శ్రవణ్ కుమార్.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం విచారించింది. హైకోర్టు చీఫ్ జస్జిస్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జస్టిస్ ఠాకూర్ విచారించిన తొలి పిటిషన్ ఇదే.  కేసు విచారణ సందర్భంగా పిల్లల్ని తరలించిన విషయాన్ని అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.   జగన్ నిర్ణయాలు, విధానాలే కాదు చివరాఖరికి ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రసంగాలు సైతం వివాదాస్పదమౌతున్నాయి. కోర్టుల ఎదుట న్యాయపరీక్షను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వానికీ, పార్టీకీ తేడా ఏముందన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరును పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. ఇప్పుడు కోర్టులో జగన్ కార్యక్రమాలకు పిల్లలను తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. అదే విధంగా తాను చేసిన ప్రసంగాలపై కోర్టు ఎదుట వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి జగన్ కు ఎదురైందని పరిశీలకులు చెబుతున్నారు. 

కల్వకుంట్లకు మహా కొలువు

అదొక కుటుంబ పార్టీ  తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రధాన ఆరోపణల్లో అదొకటి. అలాగే బీఆర్ఎస్ కుటుంబ పాలన  కుటుంబ అవినీతిపైన ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటాయి. కల్వకుట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని  కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించని రోజంటూ లేదు. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  విపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు పెద్దగా   కనిపించవు.  అయితే ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే ఐదుగురు పదవులు అనుభవిస్తున్న నేపధ్యంలో అవినీతి ఆరోపణలకు ఏదో విధంగా సమాధానం ఇచ్చుకున్నా, కుటుంబ  పార్టీ విమర్శలను కాదనే పరిస్థితి లేదు. విపక్ష పార్టీలు మాత్రమే కాదు  సామాన్య ప్రజలు కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ  అనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఒక విధంగా, బీఆర్ఎస్ ను ఫ్యామిలీ పార్టీగా కేటీఆర్ ను కేసీఆర్ వారసుడిగా అంగీకరిస్తున్నారు.  నిజానికి   ఒకానొక సందర్భంలో మంత్రి కేటీఆర్  కూడా రాష్ట్ర  శాసన సభలో కాదనకుండా, అవుననకుండా అవును మాది కుటుంబ పార్టీనే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం ..అంటూ   తెలివిగా సమాధానమిచ్చారు. అంతే  కాదు అనేక సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కేటీఆర్  ను కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్నారు, కొలుస్తున్నారు. రేపటి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే విషయంలో బీఆర్ఎస్ నేతల్లో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు.  అదలా ఉంటే ముఖ్యమంత్రి  బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్వకుట్ల ఫ్యామిలీ నుంచి మరొకరిని తెర పైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి కుర్చీని కుమారుడు కేటీఆర్ కు ఇచ్చి తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేందుకు తెరవెనక సన్నాహాలు చేసుకుంటున్న అయన  తమ అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా నియమించారు.  గత కొద్ది నెలలుగా కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయమం తెలిసిందే. అలాగే,2024 లోక్ సభ ఎన్నికల్లో అయన మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా  ఆయన తన అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా నియమించారు. వంశీధర్‌రావు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కొంతకాలం క్రియాశీలంగా ఉన్నారు. అనంతరం చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, ఇటీవల కొంతకాలంగా కేసీఆర్‌కు దగ్గరగా మెలుగుతున్నారు. దీంతో ఆయనకు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కేసీఆర్‌ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కు ఇన్‌చార్జితో పాటు 15 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని అధినేత కేసీఆర్‌ నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తెలిపారు. కమిటీ చైర్మన్‌గా కేసీఆర్‌ వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

విపక్షాలకు వరద దెబ్బ.. షా ,ప్రియాంక పర్యటన వాయిదా

రాష్ట్రంపై సుమారు పక్షం రోజులకు పైగా కమ్ముకున్న ముసురు చాలా వరకు సర్డుమణిగింది. అయితే, ఈ వారం పది  రోజులుగా   కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంటల నష్టం, ఆస్తుల నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా డా సంభవించింది. ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా స్పష్టం కాకపోయినా, నష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు.  అదలా ఉంటే, రాష్ట్ర రాజకీయాలను వరుణ దేవుడు వదిలి పెట్టలేదు. రాజకీయ కార్యకలాపాల పై వర్షం ప్రభావం చూపింది. ఈరోజు ( జులై 29) న జరగ వలసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర (ఖమ్మం) పర్యటన వర్షం  కారణంగానే వాయిదా పడింది. బీజేపీ రాష్ట్ర పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న‘విపరీత’ పరిణామాలు, అంతర్గత కుమ్ములాటల  నేపధ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనపై నేతలు, క్యాడర్ పెట్టుకున్న ఆశలపై వరుణ దేవుడు వర్షాన్ని కుమ్మరించారు. నిజానికి, గడచిన రెండు నెలల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడడడం ఇది రెండో సారి..గత నెల (జూన్)15 న ఖమ్మంలో జరప తలపెట్టిన భారీ బహిరంగ సభ, గుజరాద్ వరదల కారణంగా వాయిదా పడింది. ఇప్పదు ఈరోజు జరగ వలసిన సభ తెలంగాణ వరదల కారణంగా రద్దయింది.  అంతే కాదు, ఖమ్మ సభ రద్దయినా అమిత్ షా పర్యటనను హైదరాబాద్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో భగంగా  అమిత్ షా .. పూర్తిస్థాయిలో రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే  విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ముందుగా రాష్ట్ర నేతలో భేటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటన ముగింపులో భాగంగా కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా ప్లాన్ చేశారు. అయితే, జూన్ 24 నుంచి మళ్ళీ కురిసిన వర్ష బీజేపీ నేతల ప్రయత్నాలకు బ్రేకులు వేశాయి. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన  నిరవధికంగా వాయిదా పడిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకటించారు.  వాన బీజేపీనే కాదు, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. ఇక మొన్నీమధ్యే రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కదనోత్సాహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తాము నిర్దేశించుకున్న ప్రియాంక గాంధీ వధేరా పర్యటనను వాయిదా వేశారు. జులై 30న ప్రియాంక కొల్లాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరవ్వాల్సి వుంది. చాలా కాలంగా కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉద్దేశంతో కొల్లాపూర్ బహిరంగ సభను టీ.కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అదే సభలో మహిళా డిక్లరేషన్ పేరిట వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తమను గెలిపిస్తే మహిళల కోసం ఏం చేస్తామనే హామీలను గుప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయిదు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడ్డారని, చాలా ప్రాంతాల్లో కనీసం వారం రోజుల పాటు సహాయ చర్యలు నిర్వహించాల్సి వుంటుందని అందుకే ప్రియాంక పర్యటనను వాయిదా వేశామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలోనే చేరాల్సి వుండింది. కానీ, తన సొంత బలం చాటుకునేలా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని, పొంగులేటి రాహుల్ సమక్షంలో పార్టీలో చేరితే.. తాను ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావించారు. దానికోసం ప్రియాంక సమయమిచ్చే దాకా వెయిట్ చేశారు. ముందుగా జులై 20వ తేదీన కొల్లాపూర్ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీ దగ్గరపడుతున్నా ప్రియాంక రాక కన్ఫర్మ్ కాకపోవడంతో జూపల్లి ఒకింత కలవరపడినా.. చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యంతో ప్రియాంక రాకకు తేదీ ఖరారు చేశారు . జులై 30న ఆమె వస్తారని, ఆమె సమక్షంలో జూపల్లి పార్టీలో చేరతారని ప్రకటించారు. అయితే.. ఈ ఏర్పాట్లకిపుడు భారీ వర్షాలు గండి కొట్టాయనే భావించారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో టీ.బీజేపీ, ఇటు ప్రియాంక రాక వాయిదాతో టీ.కాంగ్రెస్ నేతలు కాస్త నిరాశలో పడినట్లయ్యింది.

జగన్ మేనమామకు నో టికెట్!?

ఆంధ్రప్రదేశ్ లో మరో సారి అధికారంలోకి రావాలన్న తన ఆకాంక్ష నెరవేరే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని స్వయంగా చేయించుకున్న సర్వేలు, చివరాఖరికి ఐప్యాక్ నివేదికలు సైతం తేటతెల్లం చేస్తుండటంతో జగన్ నేల విడిచి సాము చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా కొత్త వారిని నింపి తన ఫేస్ వేల్యూతో వారిని గెలిపించుకునే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. టికెట్ల ఎంపిక విషయంలో తనకు తన, పర బేధం లేదని చాటేందుకు ముందుగా సొంత వారికే టికెట్ నిరాకరించే అవకాశాలున్నాయంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే  నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చేసిన జగన్ చాలామంది సిట్టింగులకు పార్టీ టికెట్లు ఇల్లే అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారని చెబుతున్నారు. అలా ఇప్పటికే టికెట్ దక్కే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు అందుకున్న వారిలో జగన్ స్వంత మేనమామ  రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.     కమలాపురం నియోజకవర్గంలో  రవీంద్రనాథ్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉందనీ, వైసీపీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.  కమలాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల అసంతృప్తి  అవధులు దాటిన నేపథ్యంలో జగన్ స్వయంగా రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయనీ, నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కమలాపురం నియోజకవర్గంలో ముఖ్య నేతలను తాడేపల్లికి పిలిపించుకుని మరీ చర్చలు జరిపారనీ చెబుతున్నారు.   పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి తోడు నియోజకవర్గ ప్రజలలో కూడా రవీంద్రనాథ్ రెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమౌతున్నట్లు అందిన నివేదికల నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి జగన్ ఇప్పటికే వచ్చేశారని అంటున్నారు.    అలాగే సీఎం జగన్ కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ రెడ్డి వంటి పలువురు నేతలకు కూడా ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

నో సెకండ్ చాన్స్ టు వైసీపీ!?

వైనాట్ 175 అంటూ జగన్ వచ్చే ఎన్నికలలో రెండో సారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా చెబుతున్నారు.  2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతి, వైఎస్సార్ సెంటిమెంట్ సహా అన్ని సానుకూల అంశాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు కూడా గంపగుత్తగా వైపీపీకే పడటంతో ఆ పార్టీ విజయం నల్లేరుమీద బండి నడకగా మారిందంటున్నాయి. అయితే ఈ సారి ఏపీలో రాజకీయ పరిస్థితులు గతానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. సంక్షేమ ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పథకాలలో కోత, జగన్ బటన్ నొక్కినా ఖాతాలలో సొమ్ములు పడకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలన్నీ కొండెక్కిన చందంగా పెరిగిపోవడంతో వారిలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో  వందల రూపాయలు లాగేస్తోందన్న ఆగ్రహం జగన్ సర్కార్ పై సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇక గత ఎన్నికల సమయానికి కనీసం జనానికి మొహం చూపడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ ఉంది. దీంతో ఆ పార్టీ నేతలెవరూ బయటకు రాలేదనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రచారం కూడా తూతూ మంత్రంగానే చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు అంతా గంపగుత్తగా వైసీపీకి పడింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు ఇసుమంతైనా లేవు. గతంలోలా సంప్రదాయ కాంగ్రెస్ ఓటు వైసీపీవైపు మొగ్గు చూపే పరిస్థితులూ లేవు. ఆ ఓటు ఈ సారి తెలుగుదేశంకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటున్న జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే ఆ మాటకు కట్టుబడి ఉన్నానని చెబుతుండటంతో గత ఎన్నికలలో జరిగిన విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు కూడా కనిపించడం లేదు.   ఇక అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒక వేళ అదే జరిగితే వైసీపీ ఓటులోనే భారీగా చీలిక ఏర్పడటం ఖాయం. వైఎస్ తనయగా, ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న నిరాదరణకు గురైన చెల్లెలిగా ఆమెపై వైసీపీ శ్రేణులలో సానుభూతి వెల్లువెత్తుతుందని అంటున్నారు. వైసీపీలో ఉన్న వైఎస్ అభిమానలే కాదు.. వైసీపీ శ్రేణులు కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతాయని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో అంటకాగుతుండటం, కేంద్రం పదే పదే విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోకుండా దులిపేసుకుని మరీ ఆ పార్టీ కాళ్లా వేళ్లా పడుతుండటం, కోరకుండానే కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ప్రకటించేస్తుండటంతో రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీకి దూరమైందని చెబుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా మైనారిటీల సంక్షేమానికి పాటుపడిందనీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది.  గత ఎన్నికలలో వైసీపీకి అండగా నిలబడిన  మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పుడు దూరం అయ్యారు.   దీంతో ఎలా చూసినా జగన్ కు ఏపీ జనం మరో చాన్స్ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.