ఇక బాబు ప్రత్యక్ష యుద్ధం.. ముహూర్తం ఎప్పుడంటే?
posted on Jul 29, 2023 @ 3:32PM
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ప్రతిపక్షాలు ఫుల్ స్వింగ్ లో ప్రజల వద్దకు దూసుకెళ్తున్నాయి. దీంతో ఏపీలో ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు టీడీపీ నుండి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం వారాహీ విజయ యాత్రతో జనసైనికులలో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఏం చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇటు నారా లోకేష్, అటు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అటు సొంత పార్టీల కుమ్ములాట, ఇటు ప్రతిపక్షాల విమర్శల ధాటికి తట్టుకోలేక వైసీపీ ఢీలా పడిపోతుంది. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రంగంలోకి దిగబోతున్నారు.
గత రెండు మూడు రోజులుగా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అందులో ప్రధానమైనది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి. ఈ ప్రాజెక్టుల పరిస్థితిపైనే చంద్రబాబు గత రెండు రోజులుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉంది? గతంలో తమ ప్రభుత్వ హయంలో ఎంత ఖర్చు చేశారో.. ఆ ప్రాజెక్టులు ఎంతవరకు నిర్మాణం అయ్యాయి.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు చేసింది తదితర విషయాలను లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలు పెట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం ఎంతగా, ఎంతలా నిర్లక్ష్యం చేసిందో పూస గుచ్చినట్లు మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుల అంశంపైనే చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ముందుగా రాయలసీమ నుండి మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు మొదటి వారం నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, ప్రాజెక్టులపై ప్రత్యక్ష సమారానికి సిద్ధం కావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. స్వయంగా చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఉదాహరణలతో సహా ఎండగట్టనున్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులు మొదలు పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులు అన్నిటినీ సందర్శించి గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి? ఎవరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు ఎంతవరకు పూర్తి చేశారన్నది అంకెలతో సహా ప్రజలలోకి తీసుకెళ్లనున్నారు.
నిజానికి రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటన్నది ఏపీ ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ నాలుగేళ్ళలో మీడియా కూడా ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ. జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో కొన్నాళ్ల పాటు హడావుడి జరిగింది. కానీ ఆ తర్వాత ఆ టెండర్లు ఏమయ్యాయో.. ఎంతవరకు వచ్చాయో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇక పోలవరం సహా ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో.. ఈ ప్రభుత్వం వాటి కోసం ఎంత ఖర్చు పెట్టిందో కూడా ఎవరికీ పెద్దగాఅవగాహన లేదనే చెప్పాలి. సంక్షేమ జపం చేస్తూ, బటన్ నొక్కుడు, పందేరం పని వినా జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు చేసిందేమీ లేదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఇలా ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? అన్నది సోదాహరణంగా చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. అయితే జగన్ సర్కార్ చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను సక్రమంగా సాగనిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న!