నో సెకండ్ చాన్స్ టు వైసీపీ!?
posted on Jul 29, 2023 @ 11:41AM
వైనాట్ 175 అంటూ జగన్ వచ్చే ఎన్నికలలో రెండో సారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా చెబుతున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతి, వైఎస్సార్ సెంటిమెంట్ సహా అన్ని సానుకూల అంశాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు కూడా గంపగుత్తగా వైపీపీకే పడటంతో ఆ పార్టీ విజయం నల్లేరుమీద బండి నడకగా మారిందంటున్నాయి. అయితే ఈ సారి ఏపీలో రాజకీయ పరిస్థితులు గతానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. సంక్షేమ ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పథకాలలో కోత, జగన్ బటన్ నొక్కినా ఖాతాలలో సొమ్ములు పడకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలన్నీ కొండెక్కిన చందంగా పెరిగిపోవడంతో వారిలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో వందల రూపాయలు లాగేస్తోందన్న ఆగ్రహం జగన్ సర్కార్ పై సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇక గత ఎన్నికల సమయానికి కనీసం జనానికి మొహం చూపడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ ఉంది.
దీంతో ఆ పార్టీ నేతలెవరూ బయటకు రాలేదనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రచారం కూడా తూతూ మంత్రంగానే చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు అంతా గంపగుత్తగా వైసీపీకి పడింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు ఇసుమంతైనా లేవు. గతంలోలా సంప్రదాయ కాంగ్రెస్ ఓటు వైసీపీవైపు మొగ్గు చూపే పరిస్థితులూ లేవు. ఆ ఓటు ఈ సారి తెలుగుదేశంకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటున్న జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే ఆ మాటకు కట్టుబడి ఉన్నానని చెబుతుండటంతో గత ఎన్నికలలో జరిగిన విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ఇక అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒక వేళ అదే జరిగితే వైసీపీ ఓటులోనే భారీగా చీలిక ఏర్పడటం ఖాయం. వైఎస్ తనయగా, ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న నిరాదరణకు గురైన చెల్లెలిగా ఆమెపై వైసీపీ శ్రేణులలో సానుభూతి వెల్లువెత్తుతుందని అంటున్నారు. వైసీపీలో ఉన్న వైఎస్ అభిమానలే కాదు.. వైసీపీ శ్రేణులు కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో అంటకాగుతుండటం, కేంద్రం పదే పదే విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోకుండా దులిపేసుకుని మరీ ఆ పార్టీ కాళ్లా వేళ్లా పడుతుండటం, కోరకుండానే కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ప్రకటించేస్తుండటంతో రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీకి దూరమైందని చెబుతున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా మైనారిటీల సంక్షేమానికి పాటుపడిందనీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో వైసీపీకి అండగా నిలబడిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పుడు దూరం అయ్యారు. దీంతో ఎలా చూసినా జగన్ కు ఏపీ జనం మరో చాన్స్ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.