72 మందితో జగన్ ఫస్ట్ లిస్ట్.. 22 మంది కొత్త మొహాలే!
posted on Jul 31, 2023 @ 4:27PM
ఏపీలో వైసీపీకి అస్సలు టైం బాగాలేదు. ఒకవైపు టీడీపీ, జనసేన గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పలేని ఆరోపణలతో సతాయిస్తుంటే.. సొంత పార్టీ నేతలేమో కుమ్ములాటలు పెట్టుకొని పార్టీ పరువు బజారున పడేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, గత ఎన్నికలలో ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని హామీలు, వివేకానంద రెడ్డి హత్యకేసు వెక్కిరిస్తున్నాయి. అన్నిటినీ పొలిటికల్ మేనేజ్మెంట్ తో ఓవర్ టేక్ చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ పెద్దలు మిగతా వారి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 72 మందితో ఈ తొలి జాబితా ఉంటుందని, ఇప్పటికే ఈ 72 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, ఈ 72 మందితో రానున్న తొలి జాబితాలో 22 మంది కొత్త ముఖాలే కావడం విశేషం అంటున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన, పోటీ చేసిన 22 మందికి ఈసారి టికెట్లు కేటాయించలేదని తెలుస్తుంది. ఈ మొదటి జాబితా 72 మందితో సిద్ధం చేయగా అందులో 50 మంది మాత్రమే సిట్టింగులు కాగా మిగిలిన 22 మంది కొత్తముఖాలని తెలుస్తున్నది. ఏ ఏ నియోజకవర్గాలతో ఈ మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం బయటకి పొక్కకపోయినా 22 మంది కొత్త మొఖాలతో ఈ జాబితా బయటకి రావడం పక్కా అంటున్నారు. రెడీ అయిన ఈ తొలి జాబితాను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని దసరా పండుగ నాటికి ఫైనల్ చేసి బయటకి వదలనున్నట్లు తెలుస్తుండగా.. ఎంత క్రాస్ చెక్ చేసినా ఒకటీ రెండు స్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉండగా 20కి పైగా కొత్త అభ్యర్థులతో ఈ జాబితా రానున్నట్లు కనిపిస్తుంది.
కాగా, ఈ 72 మంది జాబితాలోనే 22 మంది కొత్త వారంటే.. ఇక రాష్ట్రం మొత్తం మీద 175 స్థానాలలో వంద కూడా సిట్టింగులకు దక్కే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. ఇందులో సీనియర్లు, మాజీ మంత్రులు, మంత్రులు కూడా ఉండడం గ్యారంటీ అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఉత్తరాంధ్ర నుండి అవంతి, నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ నుండి రోజా లాంటి వారికే ఈసారి సీటు దక్కడం అనుమానమే అని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. సగానికి సగం మందిని కొత్త వారిని దించే క్రమంలోనే ఎంత వీలయితే అంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజలకు చేరువ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తున్నది. కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజలలోకి పంపి తమ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకి తీసుకెళ్లాలన్నది జగన్ అభిమతంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు, సీఎం జగన్ సొంత సంస్థల ఫీడ్ బ్యాక్ అన్నటినీ కలిపితే వచ్చిన ఫలితాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇప్పటికే ఒకటీ రెండు సార్లు జగన్ హెచ్చరించినా ఎమ్మెల్యేలలో ఏ మాత్రం మార్పు లేదని, అందుకే సంపూర్ణ ప్రక్షాళన దిశగానే ఈ అభ్యర్థుల జాబితాలు బయటకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరి ఇంత పెద్ద మొత్తంలో సిట్టింగులకు చాన్స్ లేదంటే.. ఈసారి వైసీపీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.