పోలవరం వాస్తవాలు బయటపెట్టేసిన జగన్!
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. నిధులు కేటాయించకపోవడం, అందుకు తగిన సమర్థులైన వారిని మంత్రులుగా నియమించలేకపోవడం, పారదర్శకత లోపం.. అనుభవమైన నిర్మాణం చేపట్టే ఇంజనీరింగ్ కంపెనీలను ఎంచుకోకపోవడం, రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లలో అపనమ్మకం ఇలా ఎన్నో కలిసి ఏపీలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవడం, ఇప్పటికే జరిగిన పనులు ధ్వంసం అవడం, ఏడాదికి ఏడాది పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు కలిసి ఇప్పుడు ఈ వ్యవహారం అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంలో గుడ్డ కాల్చి మోహన వేసేలా అడ్డగోలు విమర్శలు చేయడం తప్ప లెక్కలతో సహా సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ నుండి దీటుగా సమాధానం వచ్చే పరిస్థితి లేదు.
కాగా, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల సంగతెలా ఉన్నా పోలవరం విషయంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక్క ఏడాది ఇది ఆలస్యం అయినా నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఈ భారమంతా ప్రాజెక్టుపైనే పడుతుంది. ఇది గ్రహించే గత ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం పోలవారం అంటూ వారం వారం సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అందుకు ప్రతిఫలమే పోలవరం నిర్మాణంలో 60 నుండి 70 శాతం పూర్తి చేయగలిగారు. అంతేకాదు, ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యామ్ వంటివి పూర్తి చేశారు. స్పిల్ వే పనులను కూడా మొదలు పెట్టారు. కేంద్రం నుండి ఆశించిన సమయానికి నిధులు రాకపోయినా.. ముందు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి తర్వాత కేంద్రం నుండి వచ్చినపుడు జమ చేసుకుంది.
అయితే, గత ఎన్నికలకు ముందు, జగన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత కూడా పోలవరం నిర్మాణంపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేసేవారు. అసలు పోలవరంలో యాభై శాతం కూడా పనులు కాలేదని, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డే ఆరోపించేవారు. అయితే, తెలిసో తెలియకో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఇప్పుడు పోలవరం నిర్మాణంపై కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇటీవల వర్షాలకు ముంపునకు గురి అయిన ప్రాంతాలను సీఎం సోమవారం సందర్శించారు. ఇందులో పోలవరం గ్రామం కూడా ఉంది.. అక్కడ మాట్లాడిన జగన్.. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు 2014 అంచనాల ప్రకారమే కట్టడానికి పోలవరం తీసుకున్నారని, ఆ నిధులతో 2023లో ఉన్న ధరలకు పోలవరం ప్రాజెక్ట్ ని కట్టగలమా మీరే చెప్పండని ప్రజలనే ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం చంద్రబాబు అని డైరెక్ట్ గా ఆరోపించిన జగన్.. స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారని, కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం స్పిల్ వే, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, గత ప్రభుత్వంలోనే డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పూర్తి కాగా.. స్పిల్ వే పనులు కూడా కొద్ది శాతమే పెండింగ్ ఉన్నాయి. ఈ నాలుగేళ్ళలో ఆ పెండింగ్ పనులు మాత్రమే పూర్తి చేసినట్లు జగనే ఒప్పుకున్నట్లైంది. ఇక అదే సమయంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న ధరలకు ఇప్పుడు కట్టగలమా అని ప్రజలనే ప్రశ్నించడం అంటే.. ఇప్పుడు తాము కట్టలేమని సీఎంనే అంగీకరించారని భావించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలతో నిధులు కావాలంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెచ్చుకోవాలి. కానీ జగన్ కేందంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితిలో లేరన్నది తెలిసిందే. మరి ప్రజలను మీరే చెప్పండి అని ప్రశ్నిస్తే ప్రజలు ఏం చెప్తారు. ఒకవిధంగా జగన్ మాటలను చూస్తే పోలవరం నిర్మాణం తమ వల్ల కాని పని అని స్వయంగా ఒప్పుకుని చేతులెత్తేసినట్లే ఉంది.