పిడమర్తి పోటీ ఖాయం.. సత్తుపల్లి నుంచా, కంటోన్మెంట్ నుంచా?

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేయడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపు పై దృష్టి సారించాయి.  గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాయి.  రాష్ట్రంలో జోష్ మీద ఉన్న  కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలోకి వచ్చి చేరుతుండటంతో ఆ పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల జాబితా రూపొందించే విషయంలో భారీ కసరత్తే చేయాల్సి వస్తుంది.  ఇక అధికార బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.   బీజేపీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా జోష్ మీద ఉన్న పార్టీ.. ఇటీవల డీలా పడింది. పార్టీ తరఫున నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకని నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. కర్నాటకలో ఇలాగే చేసి సక్సెస్ సాధించడంతో ఆధిష్ఠానం తెలంగాణలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తోంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన నేతలు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతల మధ్య పార్టీ టికెట్ కోసం పోటీ పడుతుండటమే.  అది పక్కన పెడితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన పిడమర్తి రవికి  వచ్చే ఎన్నికలలో పోటీ నిమిత్తం టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆయనను పార్టీ ఎక్కడ నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది అన్న విషయంలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కంటోన్మెంట్ లేదా.. లేదా  గత రెండు ఎన్నికలలో పోటీ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఆయన పోటీలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పిడమర్తి రవి టికెట్ హామీతోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కోరుతున్నట్లుగా కంటోన్మెంట్ టికెట్ దక్కి అవకాశాలైతే అంతంత మాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిడమర్తి ఇష్టం ఉన్నా లేకున్నా సత్తుపల్లి నుంచే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.   అయితే సత్తుపల్లి నుంచి పిడమర్తికి టికెట్ ఇస్తే పొంగులేటి మద్దతు ఎంత వరకూ ఉంటుందన్నది పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్తుపల్లి నుంచి పొంగులేటి మట్టా ఆనంద్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కోరి ఉన్నారు. దీంతో పిడమర్తి ఒక వేళ సత్తుపల్లి నుంచే పోటీ చేయాల్సి వస్తే మట్టా ఆనంద్ ను పొంగులేని ఎలా సముదాయిస్తారన్నది ఆసక్తికరం. 

స్పీడ్ న్యూస్ 3

జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు 26.  సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ రైతులు శిబిరాలలో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసనకు దిగడంతో  కృష్ణరాయపాలెంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో అమరావతి రైతుల నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  ............................................................................................................................................................. పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 27. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద కొనసాగుతోంది.   స్పిల్ వే దగ్గర  ఈ రోజు 32.320 మీటర్లకు గోదావరి నీటిమగట్టం చేరింది. దీంతో దిగువకు  8,60,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ............................................................................................................................................................ కేటీఆర్ కు మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు 28. తెలంగాణ  మంత్రి కేటీఆర్ పుట్టినరోజు  సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.   మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు నా ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే.   అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ....................................................................................................................................................... జిమ్ పై కప్పు కూలి పది మంది మృతి 29. చైనాలో ఓ స్కూల్‌లో ఉన్న జిమ్ పైకప్పు ఆదివారం ఒక్కసారిగా కూలిపోయిన సంఘటనలో పది మంది మరణించారు.  సోమవారం ఉదయం నాటికి శిథిలాల నుంచి  మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఒకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ..................................................................................................................................................... ధర్నాకు అనుమతి కోసం హైకోర్టుకు బీజేపీ 30. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తాత్సారంపై బీజేపీ మంగళవారం ఇందిరా పార్క్ వద్ద జరపతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.  ధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.  ....................................................................................................................................................... ఇళ్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన 31.కృష్ణాయపాలెంలో 50వేల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించి మోడల్ హౌస్ ను పరిశీలించారు. జగన్ పర్యటన సందర్భంగా రైతుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. .................................................................................................................................................... కార్ఖానాలో ఏటీఎం ధ్వంసం  32. హైదరాబాద్ కార్ఖానాలోని  సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల దిశను మార్చి చోరీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంలోని సొమ్ము సురక్షితంగానే ఉందని తెలిపిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ....................................................................................................................................................... 33.నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం  కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో   శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మురుగు కాల్వల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను స్వయంగా తొలగించి  చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.   ................................................................................................................................................... ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 34. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం  బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.1 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం నుంచి డెల్టా పంట కాల్వలకు 12,100 క్యూసెక్కులు  సముద్రంలోకి 8.99 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ....................................................................................................................................................... జ్ణానవాపి మసీదులో సర్వేను ఆపాలంటూ సుప్రీంకు 35.జ్ఞానవాపి మసీదులో  సర్వేను ఆపాలని కోరుతూ ఆ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీం ను ఆశ్రయించింది. సర్వే అంశంపై స్టే విధించాలనీ, ఈ అంశాన్ని గతంలోనే సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసిందనీ ఆ పిటిషన్ లో పేర్కొంది.   ..................................................................................................................................................... తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం 36.  కర్నూలు జిల్లా హోస్పేట్‌లోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం ఇన్ ఫ్లో 55,657 క్యూసెక్కులు కాగా.. ఒక్కరోజులోనే ఐదు టీఎంసీలు డ్యామ్‌లో చేరాయి. డ్యామ్‌లో  నీటిమట్టం ప్రస్తుతం 21.36 టీఎంసీలకు చేరుకుంది. ....................................................................................................................................................... పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా 37. పార్లమెంటు వేదికగా మణిపూర్‌ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా . సోమవారం  ‘ఇండియా’ కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.  మణిపూర్‌పై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. .............................................................................................................................................. బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు 38. బిహార్‌లోని  కులు గ్రామంలో  నాలుగేళ్ల శుభం కుమార్ అనే  బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో  పడిపోయాడు. బోరుబావిలో పడ్డ బాలుడిని రెస్క్యూ బృందం ఆరు గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసింది.  రెస్క్యూటీమ్ ను గ్రామస్థులు అభినందించి, కృతజ్ణతలు తెలిపారు. ....................................................................................................................................................... గుప్త నిధుల కోసం బాలుడి బలి 39. గుప్త నిధుల కోసం 9 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మహారాష్ట్రలోని  పొహనె షివార్‌ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించి తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు.   ............................................................................................................................................................... ఏపీ బీజేపీ  జోనల్ సమావేశాలు 40. ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు నేటి నుంచి నిర్వహించనున్నారు.  ఈ సమావేశాల్లో  పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొంటారు.    నేడు గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం, రేపు రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం  27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం జరగనున్నాయి.

బీఆర్ఎస్ గూటికి రాజాసింగ్?

జంటనగరాల్లో బీజేపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గోషా మహల్ మాత్రమే. అయితే వచ్చే ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో బీజేపీ విజయంపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గోషామహల్ నుంచి బీజేపీ వరుస విజయాలకు కారణం ఆ నియోజకవర్గంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉన్న పట్టుమాత్రమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయనను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నాటి నుంచి గోషామహల్ లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.   రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఈటల వంటి వారు ఆయనను కలిస్తే కూడా పార్టీ హైకమాండ్ సహించే పరిస్థితి లేకపోవడంతో రాజాసింగ్ బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ గా నిలబడతారా? లేక మరో పార్టీ గూటికి చేరుతారా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ లేదు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమనీ, బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదనీ అంటున్నారు.  ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గంలో విజయం కోసం కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.     ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ  అయ్యారు. ఆదివారం ఘోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల నేపథ్యంలో ఘోషామహల్ లో బీఆర్ఎస్ పాగాకు కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రచించారన్న చర్చ గులాబి శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.  ఈ రెండు భేటీల నేపథ్యంలో బీజేపీ కూడా రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమన్న భావనకు వచ్చేసి అక్కడ ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించిందంటున్నారు. హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ తరువాతనే బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల కూడా రాజాసింగ్ తో భేటీ అయ్యారు. పార్టీ మారవద్దు సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని చెప్పడానికే ఈటల ఆయనను కలిశారని అంటున్నారు. అయితే  రాజాసింగ్ తో భేటీ కావడంపై బీజేపీ అధిష్ఠానం ఈటలను మందలించారు. దీంతో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును ఎత్తివేసే ఉద్దేశమేదీ బీజేపీ హైకమాండ్ లో లేదని స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఘోషా మహల్ నుంచి ముచ్చటగా మూడో సారి అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించాలన్నది రాజాసింగ్ లక్ష్యంగా చెబుతున్నారు. పైకి పార్టీ మారేది లేదని ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా బీఆర్ఎస్ లేదా మరో పార్టీ గూటికి చేరేందుకు రాజాసింగ్  తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. 

స్పీడ్ న్యూస్ 2

కన్నాకు గన్ మెన్ లను తొలగించిన జగన్ సర్కార్ 11. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు జగన్ ప్రభుత్వం గన్ మెన్ లను తొలగించింది.   గత 5 సంవత్సరాలుగా  కన్నాకు గన్ మెన్లుగా ఉన్న వారు గత మూడు రోజులుగా రాకపోవడవంతో విషయమేమిటని ఆరా తీస్తే వారిని తొలగించిన విషయం బయటపడింది.  .................................................................................................................................................... తిరుమలలో భక్తుల రద్దీ 12.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్లు వచ్చింది. ........................................................................................................................................... సీబీఐ డైరెక్టర్ కు అవినాష్ లేఖ 13. వివేకా హత్య కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్  చేసిన దర్యాప్తును పునస్సమీక్షించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు.  వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు.  ......................................................................................................................................................... మారథాన్ లో పాల్గొని గుండెపోటుతో యువకుడి మృతి 14. మారథాన్ పరుగులో పాల్గొన్న  20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో  మరణించిన ఘటన  మధురైలో  జరిగింది. ఆదివారం  జరిగినఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును పూర్తి చేసిన  బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ....................................................................................................................................................... డీఐజీ సెల్ ఫోన్ చోరీ 15. ఏకంగా డీఐజీ సెల్ ఫోనే చోరీకి గురైంది. అసోం డీఐజీ  వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగలు ఆయన ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న మాజర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.   ....................................................................................................................................................... తెలంగాణలో 40 మంది డీఎస్పీల బదలీలు 16. తెలంగాణలో బదలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా  40 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డీఐజీ అంజని కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర  ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. ................................................................................................................................................. టమాటాల వినియోగం మానేస్తే సరి! 17. టమాటాల ధరలు దిగివచ్చేందుకు ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు బ్రహ్మాండమైన చిట్కా చెప్పారు. ఆకాశన్నంటిన టమోటా ధరలు తగ్గుముఖం పట్టాలంటే జనం వాటిని తినడం మానేయాలని సలహా ఇచ్చారు. అలా చేస్తే ధరలు వాటంతట అవే దిగి వస్తాయని మంత్రి ప్రతిభా శుక్లా అన్నారు.  ............................................................................................................................................. పొన్నంకు మద్దతుగా గాంధీ భవన్ వద్ద ఆందోళన 18.  కాంగ్రెస్లో కొందరు సీనియర్లు పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ ఆయన అనుచరులు గహైదరాబాద్ గాంధీభవన్ వద్ద నిరసనకు దిగారు.  ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు గాంధీ భవన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.  .............................................................................................................................................................. దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ 19. కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే  వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచే పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.  ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. .......................................................................................................................................... పెన్ గంగ ఉధృతి.. తెలంగాణ, మహా రాష్ట్ర మధ్య రాకపోకలు బంద్ 20.  తెలంగాణ   వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  డొల్లార వ పెన్ గంగఉధృతంగా ప్రవహిస్తుండటంతో  ఎన్హెచ్ 44పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.  ............................................................................................................................................................. జ్ణానవాపి మసీదులో సర్వే 21.జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సోమవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సుప్రీం ఆదేశాల మేరకు సర్వే చేపట్టారు. ....................................................................................................................................................... టమాటాలోడుతో వెడుతున్న లారీ హైజాక్ 22. టమాటా ధరలు పెరగడంతో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగి చోరీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో రెండున్నర టన్నుల టమాటా లోడ్ తో వెళుతున్న లారీని కొందరు హైజాక్ చేశారు.  డ్రైవర్ ను కిందికి నెట్టేసి లారీతో ఉడాయించారు. ..................................................................................................................................................... అహ్మదాబాద్ విమానాశ్రయం జలమయం 23. గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం జలమయమైపోయింది.  అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ......................................................................................................................................................... సిటీ బస్సుల కోసం విజయవాడలో ఎదురు చూపులు 24. అమరావతిలో జగన్ సభ కోసం ఆర్టీసీ ఆధికారులు బస్సులను తరలించడంతో విజయవాడ ప్రజలు సిటీ బస్సులు అందుబాటులో లేక నానా యాతనలూ పడుతున్నారు. కనీసం సిటీ బస్సులు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నకు కూడా ఆర్టీసీ అధికారుల నుంచి సమాధానం కరవైంది. ........................................................................................................................................................ డేంజర్ మార్క్ దాటిన యమున 25.యమునా నది నీటిమట్టం  ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో   భారీవర్షాలతో  హత్నకుండ్ బ్యారేజీ నుంచి  వరదనీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్ కు చేరింది.

ఎవరీ రామచంద్ర యాదవ్? కొత్త పార్టీ ఉద్దేశం ఏంటి? ప్రయోజనం ఎవరికి?

బోడె రామచంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు.  నిజానికి ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఆయన  వార్తల్లో  ఎక్కువగా  కనిపిస్తున్నారు. వినిపిస్తున్నారు. గత కొంత కాలంగా అన్ని జిల్లాలను చుట్టేసిన రామచంద్ర యాదవ్. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త పార్టీ పెట్టారు. భారత చైతన్య యువజన పార్టీ అని దానికి నామకరణం చేశారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఇప్పటికే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. దీంతో సహజంగానే ఈ రామచంద్ర యాదవ్ ఎవరు? ఈయన పార్టీ ఉద్దేశం ఏంటి? ఈయన రాజకీయ పార్టీ వెనక  ఉన్న శక్తులు ఏమిటి? వ్యక్తులు ఎవరు? ఆయన కొత్త పార్టీ బీసీవైపీ రాష్ట్రంలో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంది?  ఆ పార్టీ వల్ల ప్రయోజనం చేకూరు పార్టీ ఏది? అంటూ పలు ప్రశ్నలు రాజకీయవర్గాలలో వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ రామచంద్ర యాదవ్  విషయానికి వస్తే.. ఈయన పుంగనూరుకు చెందిన నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త. రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పుంగనూరులో పోటీ చేసి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్  కోల్పోయారు. అయితే, అదే సమయంలో స్థానికంగా వైసీపీకి రామచంద్ర యాదవ్ అడుగుగడుగునా అడ్డు పడ్డారు. దీంతో ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం నేతలు దాడులు చేశారు. అప్పట్లో ఈ దాడులు  సంచలనంగా మారాయి. ఈ దాడులని టీడీపీ, జనసేన, బీజేపీ సహ అన్నీ విపక్ష పార్టీలు ఖండించాయి. ఈ దాడుల అనంతరం ఆయన జనసేన నుండి బయటకొచ్చేసి సొంతంగా రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో అనతి కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగించి బీసీ సామజిక వర్గాలలో కాస్త  పరిచయం పెంచుకున్నారు. రామచంద్ర యాదవ్ ఎప్పుడైతే సొంతంగా రాజకీయంగా ఎదగాలని కంకణం కట్టుకున్నారో తనకున్న పలుకుబడితో బీజేపీ నేతలతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. అందుకే అడగ్గానే ఈయనకు హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికింది. అలాగే వై కేటగిరీ సెక్యూరిటీ కూడా లభించింది. ముందుగా ఈయన బీజేపీలోకి వెడతారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సంబంధించి కోట్లాది రూపాయలతో పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చారు.    అయితే  రామచంద్ర యాదవ్ వెనక ఉంది బీజేపీ నేతలేనని రాజకీయ వర్గాలలో  చర్చ సాగుతున్నది. బీసీ సామజిక వర్గాలనే టార్గెట్ గా పెట్టుకున్న రామచంద్ర.. అది కలిసి వచ్చేలానే బీసీ (భారత చైతన్య) యువజన పార్టీ   పేరు కూడా పెట్టారని.. బీసీ సామాజికవర్గాలు అండగా ఉండే టీడీపీ, వైసీపీలను దెబ్బకొట్టి రామచంద్ర యాదవ్ ఎదగి..   బీజేపీకి ఉపయోగపడటమే ఆయన పార్టీ ఉద్దేశంగా కనిపిస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా  ఏపీలో ఇప్పటికే జగన్ వర్సెస్ చంద్రబాబు-పవన్ అన్నట్లు వార్ నడుస్తుంది. బీజేపీ ఎటు వైపు ఉంటుందో ఇంకా తేలాల్సి ఉంది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన  కూడా రాయలసీమ నేతే కావడంతో   రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నయన్నది ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రేబిస్ కేసులు

రేబిస్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతుంది. ఇటీవలె తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ యువతి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిడతారని భయపడ్డ ఓ బాలుడు ఆరు నెలల తరువాత రేబీస్ సోకడంతో మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. తేలు ఓంసాయి అనే 17 ఏళ్ల బాలుడిని ఆరు నెలల క్రితం వీధి కుక్క కరిచింది. కానీ అతడు ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు తాగలేకపోయిన బాలుడు నీళ్లను చూస్తే భయపడటం ప్రారంభించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని  కాకినాడు జీజీహెచ్‌లో చేర్చారు. వ్యాధి ముదరడంతో వైద్యం ఫలించక బాలుడు  మృతిచెందాడు. చేతికంది వస్తాడనుకున్న కొడుకు ఇలా హఠాన్మరణం చెందడంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది.  కుక్క కాటుకు గురైన రోజునే యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌తో పాటూ టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తరువాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజు టీకా తీసుకుంటే రేబీస్ వ్యాధి ముప్పు తప్పిపోతుందని చెప్పారు. రేబిస్ వచ్చిన వారికి అసాధరణ వ్యవహార శైలి ఉంటుంది. రేబిస్ ముదిరితే రెండు నుంచి 10 రోజుల్లో మృతి చెందవచ్చు. ఎక్కువ శాతం మరణాలు ఉంటాయని వైద్యులు తేల్చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  రేబిస్ వ్యాధి వచ్చిన వారికి నరాల వ్యవస్థ కుంటుపడుతోంది. మెదడు నుంచి వెన్నుపూస వరకు నరాల వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.  రక్తం నుండి మీ మెదడులోకి టాక్సిన్స్ , ఇతర ప్రమాదకరమైన పదార్థాలు రాకుండా చేయడం వల్ల మీ మెదడును రక్షించబడుతుంది.  అయితే రేబిస్ సోకితే ఈ విషపదార్థాలు నేరుగా మెదడులోకి వెళ్లి మరణం సంభవిస్తుంది. కాబట్టి దానిని నాశనం చేసే మందులు వాడాల్సి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేబిస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఫీవర్ హాస్పిటల్ సూపరిండెంట్ చెబుతున్నారు.  రేబిస్ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పోలిస్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

స్పీడ్ న్యూస్ 1

మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహానికి శంకుస్థాపన 1. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 108 అడుగుల   శ్రీరాముడి విగ్రహనిర్మాణానికి  కేంద్ర హోంమంత్రి అమిత్ షాశంకుస్థాపన చేశారు.  తన కార్యాలయం నుంచే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా  అమిత్ షా పేర్కొన్నారు.  ............................................................................................................................................................... రామచంద్రయాదవ్ కొత్త పార్టీ 2. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   భారత చైతన్య యువజన పార్టీ బీసీవైగా ఆ పార్టీకి నామకరణం చేశారు.  గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆదివారం (జూలై23)న నిర్వహించిన  ప్రజా సింహగర్జన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు.   ......................................................................................................................................................... ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 3. ధవళేశ్వరం వద్ద గోదవరి వరద నీటితో ఉరకలెత్తుతోంది. ఎ  ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ........................................................................................................................................................ పొత్తులపై హై కమాండ్ దే తుది నిర్ణయం: పురందేశ్వరి 4. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తుల విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలోని ఏడు జిల్లాల జోనల్ సమావేశం కోసం పురందేశ్వరి ఆదివారం  ప్రొద్దుటూరు వచ్చిన పురంధేశ్వరి  పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. .................................................................................................................................................... ఏపీలో భారీ వర్షాలు 5.  ఏపీలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  రుతుపవన ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసొగడం, దానికి తోడు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. .......................................................................................................................................................... అభివృద్ధి, సంక్షేమం చూసి బీఆర్ఎస్ లోకి వలసలు: గంగుల 6.  సంక్షేమం,  అభివృద్ది  చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ చిల్లా ఎలపోతారు గ్రామానికి చెందిన యువకులు ఆయన సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ..................................................................................................................................................... వీఆర్ఏ వ్యవస్థ రద్దు 7.వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్   నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం(జూలై 24) విడుదల చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ...................................................................................................................................................... తెలంగాణలో తెలుగుదేశంకు పూర్వ వైభవం: కాసాని 8.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ అన్నారు. బాలాపూర్ చౌరస్తాలోనీ ఎస్ ఎల్ ఎస్ ఎన్ కాలనీలోని టిడిపి మహేశ్వరం నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో పార్టీకి ప్రజల ఆదరణ, కార్యకర్తల బలం మెండుగా ఉన్నాయన్నారు. .......................................................................................................................................................... ప్లై ఓవర్ పై నుంచి పడి యువకుడి మృతి 9. అతి వేగం ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. టూవీలర్ పై అతి వేగంగా వెళుతూ గచ్చిబౌలీ ఫ్లైఓవర్‌ పైనుంచి పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా టూవీలర్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడ్డారు. వీరిలో ఒకరు మరణించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ........................................................................................................................................................ ప్రేమికుడి కోసం పాక్ కు వివాహిత 10. ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం ఇంకా వార్తల్లో ఉండగానే భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన వివాహిత ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన పాక్ యువకుడి కోసం సరిహద్దు దాటి వెళ్లింది.

ధరణి పోర్టల్ తో దేవాలయ భూములకు గండి

ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని దేవాలయ భూములను ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని బ్రాహ్మణ సమాజం ఆవేదన చెందుతుంది. . ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని, అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూములను కాపాడాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  డిమాండ్‌ చేశారు. భూముల అన్యాక్రాంతంతో బ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో బ్రాహ్మణ, అర్చక సంఘం శంఖారావ కార్యక్రమం  ఆదివారం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో బ్రాహ్మణ సంఘం కీలక పాత్ర పోషించిందని అర్చక సంఘం తీర్మానించింది. సంఘం అభివృద్ధిపై కాంగ్రెస్‌ పార్టీలో చర్చించి మేనిఫెస్టోలో పెట్టే ఆలోచన చేయాలని బ్రాహ్మణ సమాజం కోరుకుంటుంది. అనాదిగా వస్తున్న వృత్తినే ఎంచుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులు కొత్తగా ఆలోచిస్తేనే వృద్ధిలోకి వస్తారని వారి అభిప్రాయం. వృత్తిని కొనసాగిస్తూనే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించాలనే డిమాండ్ ను ఈ సమావేశం బలపరిచింది. ప్రస్తుతం దేశంలో చట్టసభల్లో బ్రాహ్మణులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు. పీవీ నర్సింహారావు హయాంలో 26 మంది ఉండేవారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిస్తే జీవో 57తో 5,625 మంది దేవాలయ అర్చక ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు.  కొన్ని జిల్లాల్లో దేవాలయ ఇనాం భూములపై దేవాదాయ శాఖ అధికారులు ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా న్యాయం చేయడం లేదు. బ్రాహ్మణ సంక్షేమానికి కేసీఆర్‌ ఎనలేని కృషి చేశారని, దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద ప్రతి నెలా రూ.12,500 అందిస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అంటున్నారు. 

వైసీపీలో రగులుతున్న ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు!

ఏపీలో అధికార  వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్నది. పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు తీర్చేందుకు అధిష్టానం పడరాని పాట్లు పడుతున్నది. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  నేతల మధ్య చిచ్చు తీర్చే క్రమంలో అధిష్టానం పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారౌతున్నది. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు,  సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా భావించి వారిని దెబ్బతీసే కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా..    పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారౌతున్నది.  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారస్థాయికి చేరింది.  కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలో కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి.  ఇలా పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాలు  కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,   విశాఖలో అవంతి,  తూర్పు గోదావరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలో  అంతర్గత యుద్ధం నడుస్తున్నది. అది కూడా ఈ బడా నేతల వల్లనే  పోరు జరగడం ఇప్పుడు అధిష్టానం సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీనియర్ నేతలకు అదే జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అదే నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.    రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణు.. మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కి చేరింది. ప్రస్తుతం బోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. తాను ఇండిపెండెంట్‌గా  లేదా టీడీపీ తరఫున బరిలో దిగి వేణును ఓడిస్థానని ప్రజలకు చెప్తున్నారు. తాజాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఈ తండ్రీ కొడుకులలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వకుంటే వారు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తున్నది.  కాగా, ఆదివారం (జూలై 23) మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. చోడవరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వేణు వర్గం నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి తన సత్తా చాటుకున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లయిన సందర్భంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు మంత్రి వర్గం చెప్పుకుంది. మంత్రిగా మూడేళ్ళ వేడుక అనే చెప్తున్నా ఇది ముమ్మాటికీ వేణుగోపాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుని బలం నిరూపించుకోవడానికి నిర్వహించిన సమావేశమే వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఇక ఒక్కొక్కటీ ఆత్మీయ సమ్మేళనాల రూపంలో బయటపడే ఛాన్స్ కనిపిస్తున్నది.

జగన్ మెడకు వివేకా హత్య కేసు

మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసు ఇప్పటికీ ఇంకా ఇంకా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో నిన్న మొన్నటి వరకూ వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపించిన సంగతి విదితమే.  ఈ కిరాతకమైన హత్య కేసులో చట్టప్రకారం న్యాయస్థానాలే దోషులను శిక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అని వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. సీబీఐ ఈ కేసు విచారణను ఎప్పుడో ముగించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఇంకా తేల్చడం లేదు. దీంతో మళ్ళీ మెల్లగా బయటకి వచ్చిన అవినాష్ ఈ మధ్యనే పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. అదలా ఉండగానే సీబీఐ తను నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలు  కోర్టులో ప్రవేశపెట్టడంతో.. కొత్త టెన్షన్ మొదలైంది.  గత నెల 30వ తేదీన సీబీఐ కోర్టుకు సమర్పించిన దాదాపు 145 పేజీల చార్జి షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, వైసీపీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ సీబీఐ కోర్టుకు సమర్పించింది. షర్మిల చెప్పిన దాని ప్రకారం రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని, ఆవినాష్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకి కారణం కావచ్చని, వివేకా అడ్డువస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చు. మరోవైపు ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. తనను వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని ఈ మధ్యనే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల చల్ చేశాయి.  మరోవైపు, షర్మిల, ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ నవీన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఈ హత్య  పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది.  హత్య జరిగిన విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే అవినాష్ రెడ్డి వైఎస్ భారతీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారనీ అర్ధమవుతున్నది. అదే సమయంలో జగన్ అక్కడే ఉన్న ఎవరికీ హత్య ఎలా జరిగిందో చెప్పకపోవడం, మ్యానిఫెస్టో సమావేశం మధ్యలోనే ఆపేసి పులివెందులకు బయల్దేరాకుండా వైఎస్ భారతీతో చర్చలు జరపడం, అప్పటికే హెలికాఫ్టర్ సిద్ధంగా ఉన్నా కాదని కారులోనే జగన్ బయల్దేరడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అంటే అటు సాక్షులు చెప్పిన దాని ప్రకారం, ఇటు ఆ రోజు పరిస్థితులను చూస్తే హత్య గురించి జగన్, భారతీలకు ముందే తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య జరిగిన రోజున మొదట చూసిన వ్యక్తి పీఏ కృష్ణారెడ్డిగా ఈ కేసులో కొందరు సాక్షులు చెప్పారు. పీఏ కృష్ణారెడ్డి చెబితే ఉదయం 6.30కి అవినాష్ జగన్ కు ఫోన్ చేసిన చెప్పినట్లు జగన్ మ్యానిఫెస్టో మీటింగ్ లో ఉన్న వారికి చెప్పారని ఓఎస్డీ స్టేట్మెంట్ లో చెప్పారు. కానీ, ఉదయం 5.30 గంటల సమయంలో వివేకానంద రెడ్డి చనిపోయారని జగన్ చెప్పినట్టు అజేయ కల్లం స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే ఈ హత్యకు ముందే, హత్య జరిగిన విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ దంపతులకు తెలుసన్నది సీబీఐ వాదన. హత్య గురించి తెలిసినా తమ్ముడిని కాపాడేందుకే జగన్ గుండెపోటు నాటకానికి తెరతీశారని, అప్పటి నుండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్ముడిని కాపాడేందుకు జగన్ మోహన్ రెడ్డి దంపతులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో వివేకా హత్య కేసును జగన్ స్వయంగా తన మెడకు చుట్టుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేశాన్ని ఏలతామన్న కేసీఆర్..మౌనమేలనోయీ?

దేశ పరిస్థితులు చూసిన తర్వాత మార్పు కోసం ఇక కొట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్నా.. 75 ఏండ్ల స్వాతంత్య దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు.. కానీ మార్పు లేదు.. అందుకే దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నా.. ఎన్నాళ్లో ఎదురు చూశాం ఎవరైనా వస్తారేమోనని.. కానీ రాలే. ఇక ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను వచ్చా.. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. ప్రజలు. ప్రజలను గెలిపించాలనే టీఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చా. ఇదీ మహారాష్ట్ర నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సభలో   తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన వాళ్లంతా చేతగాని వాళ్ళు, వాళ్ళు చెప్పినవన్నీ ఫాల్తూ మాటలే.. మాయ చేసి మతలబు చేసి ప్రజలను పీడించుకు తింటున్నారు.. అందుకే తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే తాను జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టాను. కేసీఆర్ నాందేడ్ సభలో నాడు మాట్లాడిన మాటల సారాంశమిదే.  దీని కోసం దేశమంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతానని.. దేశంలో అన్ని పార్టీల‌నూ ఏకం చేస్తాన‌ని.. తద్వారా జాతీయ‌ రాజకీయాలలో చ‌క్రం తిప్పుతాన‌ని సీఎం, అందుకే నడుంబిగించాననీ కేసీఆర్‌ చెప్పారు. చెప్పినట్లే ఒకసారి క‌ర్ణాట‌క‌, మరోసారి త‌మిళ‌నాడు, ఇంకోసారి బిహార్‌, యూపీ వంటి రాష్ట్రాల‌కు వెళ్లి.. అక్క‌డి ప్రాంతీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. వారితో చేతులు క‌లిపి అందరినీ ఏకం చేస్తున్నానని సిగ్నల్స్ ఇచ్చారు. ఎక్కడకి వెళ్లినా ప్ర‌ధాని మోడీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్.. అప్పుడప్పుడూ కాంగ్రెస్ మీద కూడా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చారు. దేశ జీడీపీ నుంచి చైనా ఆగ‌డాల వ‌ర‌కు.. అభివృద్ధి నుంచి అప్పుల వ‌ర‌కు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు మనల్ని పాలించేందుకు వీళ్ళెవరూ.. వాళ్ళెవరూ.. మనల్ని మనమే పాలించుకుందాం.. బీజేపీ, కాంగ్రెస్ లేని భారత ప్రభుత్వాన్ని నిర్మిద్దామని మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు.  సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో  ‘ఇండియా’ ఏర్పాటయ్యాయి. 28 రాజకీయాల పార్టీలతో ఇండియా, 36 రాజకీయ పార్టీలతో ఎన్డీయే సమావేశాలు కూడా జరిగిపోయాయి. ఈ రెండు గ్రూపులలోనే కేసీఆర్ కలిసి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఈ రెండు కూటములు పోగా దేశవ్యాప్తంగా మిగిలింది ఏడెనిమిది పార్టీలు మాత్రమే. ఇందులో కూడా కొన్ని ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమికి చేరనున్నాయి. అలా మొత్తంగా చూస్తే కేసీఆర్ ఒంటరైపోయారు. దీంతో దేశాన్ని ఏలతానన్న నోరు   అసలు పెగలడం లేదు. మోడీని గద్దె దించుతానన్న శపథం   కాళేశ్వరంలో కలిపేశారా అన్న అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. దేశంలో మార్పు సంగతెలా ఉన్నా.. రాష్ట్రంలో రోజురోజుకీ బలీయంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మారకుండా చూసుకోవడమే ఇప్పుడు కేసీఆర్ వంతైంది.  దేశాన్ని ఏలతానని బయల్దేరిన కేసీఆర్ ఇప్పుడు అసలు దేశంలో జరిగే వాటిని కూడా పట్టించుకోవడం మానేసినట్లుగా కనిపిస్తుంది. మ‌ణిపూర్ వంటి చిన్న రాష్ట్రం త‌గ‌ల‌బ‌డిపోతున్నదని, గిరిజ‌నుల‌పై దారుణ మార‌ణాలు జ‌రుగుతున్నాయ‌ని దేశం మొత్తం గ‌గ్గోలు పెడుతున్నా.. కేసీఆర్ ఎక్క‌డా స్పందించలేదు. దేశంలో రాజకీయంగా ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎక్కడా పెదవి విప్పడం లేదు. నిన్నగాక మొన్న మహారాష్ట్రకి భారీ కాన్వాయ్ తో వెళ్లిన కేసీఆర్, ఆ తర్వాత మరే ఇతర రాష్ట్రం గురించి మాట్లాడడం లేదు. పొరుగున తెలుగు రాష్ట్రమైన ఏపీలో పాగా వేస్తామని పలికిన ప్రగల్భాలు ఇప్పుడు మొత్తానికి మర్చేపోయినట్లు ఉన్నారు.  

పవన్ మరో బాంబు.. బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీలోనూ వైసీపీ చేతివాటం!

మహేష్ బాబు అతడు సినిమాలో నటుడు తనికెళ్ళ భరణి హీరో పార్ధు గురించి ఒక డైలాగ్ చెప్తారు. ఎవడన్నా కోపంగా కొడతాడు.. లేక బలంగా కొడతాడు.. వీడేంట్రా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గులాబీ మొక్కకి అంటుకట్టినట్లు, ఏదో గోడ కట్టినట్లు చాలా జాగ్రత్తగా.. పద్ధతిగా కొట్టాడు అంటారు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ వరస కూడా అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా లెక్కలేసి.. ఒక పద్ధతి ప్రకారం ఒక్కో అంశాన్ని టేకప్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ చేసిన ఏపీలో వాలంటీర్ల డేటా కలెక్షన్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది. కానీ, పవన్ చేసిన ఆరోపణలను తప్పని మాత్రం నిరూపించలేకపోతుంది.  వాలంటీర్లు సమీకరించే డేటా భద్రంగానే ఉందని చెప్పలేకపోతున్న జగన్.. పవన్ పై ఎక్కడ వీలయితే అక్కడ వ్యక్తిగత దాడి చేస్తున్నారు.   జగన్ విమర్శలు ఏమైనా కానీ.. ఈ వాలంటీర్ల డేటా భద్రమే అనే నమ్మకాన్ని మాత్రం ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఆ అంశం అలా నడుస్తుండగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో బర్నింగ్ అంశాన్ని లేవనెత్తారు. అదే జగన్ సర్కార్ బడి పిల్లలకు అందించిన బైజూస్ ట్యాబుల పంపిణీ. ఈ ట్యాబుల పంపిణీలో భారీ అవకతవకలు ఉన్నాయన్నది పవన్ లేటెస్టుగా లేవనెత్తిన ఆరోపణ.  బైజూస్ సంస్థ భారీగా నష్టాల్లో ఉందన్న విషయం తెలిసి కూడా భారీ మొత్తం చెల్లించి ట్యాబుల పంపిణీ ఆ సంస్థకు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏంటో చెప్పాలని వైసీపీ ప్రభుత్వానికి పవన్ సవాల్ విసిరారు. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న ఆధారాలను, గతంలో మీడియాలో వచ్చిన కథనాలను కూడా ట్యాగ్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని తేల్చాలని కోరుతూ పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా తన ట్వీట్ ని పవన్ ట్యాగ్ చేశారు. ఇప్పటి వరకూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ రిక్రూట్‌మెంట్లు, టీచర్ ట్రైనింగ్ లేదని.. కానీ, నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ఈ ట్యాబుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిలేదని ఆరోపించారు.  అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే బైజూస్ 2021లోనే 17 రెట్లు నష్టాలను చవిచూసింది. మీడియాలో వచ్చిన ఇదే కథనాన్ని పవన్ తన ట్వీట్ కు జతపరిచి.. నష్టాల్లో ఉన్న కంపెనీకి ఏ ఆదాయం లేకుండా ఎలా అప్పగించారని పవన్ మండిపడ్డారు. అసలు ఈ ట్యాబుల పంపిణీకి ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేసుకున్నాయి? దరఖాస్తు చేసుకున్న కంపెనీలను ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీలలో ట్యాబుల పంపిణీ బైజూస్ కు ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? అసలు ఈ ప్రక్రియ ఏ పద్ధతి ప్రకారం చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని.. ఈ సమగ్ర వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయా? అన్న విషయాలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై ప్రభుత్వ వర్గాలు ఏమైనా స్పందిస్తాయా? లేక ఎప్పటి లాగానే పవన్ మూడు పెళ్లిళ్ల అంశాన్నే దీనికి కూడా సమాధానంగా దాడికి ఉపయోగిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

వెలగపూడిని దెబ్బకొట్టేందుకు వైసీపీ కుయుక్తి.. ఓట్ల గల్లంతు

 ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలి.. సామ దాన దండోపాయాలను ఉపయోగించి అయినా మళ్ళీ అధికారం పీఠంపై కూర్చోవాలి. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఇందుకోసం కంకణం కట్టుకున్నారు. అభివృద్ధి అనేది పూర్తిగా పక్కకు పెట్టేసి బడుగు బలహీన వర్గాలకు పప్పు బెల్లాలు పంచుతూ అవే ఓట్టుగా మారుతాయని భావిస్తున్న జగన్  సామజిక వర్గాల వారీగా, మత ప్రాతిపదికన కూడా గాలమేసి పట్టుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీని దెబ్బతీసే మరికొన్ని ప్రయోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన అంశం.. రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్ల గల్లంతు.. ఓట్ల బదిలీ. ఈ అంశంపై ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన, టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2009లో ఏర్పాటైన ఈ  నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకూ టీడీపీనే గెలుస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్థానంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లూ టీడీపీయే గెలిచింది. ఈ మూడు సార్లూ కూడా ఆ నియోజకవర్గం నుంచి  వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. టీడీపీ కఠిన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఎదురు నిలబడే రామకృష్ణ బాబుకు ఆయన నియోజకవర్గంలో కూడా అదే పేరుంది. అందుకే ఆయన ఓటమి అనేది ఎరుగరు. నిజానికి ఆయనది విశాఖ జిల్లా కూడా కాదు. ఎక్కడో విజయవాడ నుంచి విశాఖకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఆయన నందమూరి బాలకృష్ణకు ఆప్తుడిగా పేరుంది. బాలయ్య సిఫార్సు మేరకే 2009లో తొలిసారి సీటు దక్కించుకున్నారు. బాలకృష్ణ సిఫార్సు అయితే చేశారు కానీ ఎన్నికలలో గెలిచింది మాత్రం ఆయనే. 2009లో ప్రజారాజ్యం పార్టీ భారీగా ఇక్కడ ఓట్లు చీల్చినా వెలగపూడి తట్టుకొని నిలబడ్డారు. ఆ తర్వాత 2014లో ఆయనకు ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీ దాదాపుగా 47 వేల పై చిలుకు వచ్చిందంటే ఆయన ఛరిస్మా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక, 2019లో జగన్ ఒక్క ఛాన్స్ వేవ్ లో కూడా తట్టుకొని నిలబడిన వెలగపూడి.. అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ దాడి చేసే సమయంలో.. వెలగపూడి చంద్రబాబు ముందు నిలబడి సవాల్ విసిరి తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు. అందుకే వైసీపీ కన్ను ఈ స్థానంపై పడింది. చట్టబద్దంగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేరు కనుక ఇక్కడ భారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్ల గల్లంతుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 వేలకు పై చిలుకు ఓట్లను తొలగించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన నియోజకవర్గంలో మొత్తం 40 వేల ఓట్లు గల్లంతు అయ్యాయని వెలగపూడి తీవ్రమైన ఆరోపణ చేశారు. 2019లో ఉన్న ఓట్లు ఇప్పుడు ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిని అధికారులు కూడా దృవీకరిస్తున్నారట. ఓట్లను తొలగించిన మాట వాస్తవేమని.. అయితే, తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నామని చెబుతున్నారట. దీంతో పాటు ఒకే కుటుంబంలో ఉన్న వారిని వేరు వేరు బూతులలోకి బదిలీ చేస్తున్నారట. ఇప్పటికే ఇలా ఓట్లు కోల్పోయిన వారు, బదిలీ అయిన వారు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మణిపూర్ హింసాకాండ.. నాకేం సంబంధం విలేకరులపై కిషన్ రెడ్డి అసహనం

మణిపూర్ లో హింసాకాండపై బీజేపీ వైఖరి ఎలా ఉందన్నది కిషన్ రెడ్డి తన అసహనం ద్వారా తేటతెల్లం చేశారు. నెలల తరబడి ఆ రాష్ట్రం హింసాజ్వాలలో తగలడిపోతున్నా.. ఇంత వరకూ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదు. అదేదో దేశానికి సంబంధించిన సమస్య కాదన్నట్లుగా వదిలేశారు. ఆ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోని వచ్చి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమైన తరువాత, అదీ సుప్రీం కోర్టు స్వయంగా మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని వివరణ కోరిన తరువాత మోడీ నోరు విప్పి ఆ అమానవీయ ఘటనను ఖండించారు. అయితే మణిపూర్ లో హింసాకాండను అరికట్టే విషయంలో అటు కేంద్రం ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. శాంతి  భద్రతల సమస్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుంటే.. చేతులెత్తేసిన మణిపూర్ ప్రభుత్వం జరిగేది జరుగుతూనే ఉంటుందన్నట్లు మిన్నకుండిపోయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మణిపూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడకుండా సభను వాయిదా వేసి పారిపోతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మణిపూర్ విషయం తనకేం సంబంధం లేదని మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏమైనా తెలంగాణకు చెందిన ప్రాంతీయ పార్టీయా అని నిలదీస్తున్నారు. సోమవారం (జూలై 24) లోక్ సభలో మణిపూర్ హింసాకాండపై చర్చ జరిగితే తెలంగాణ గడ్డపై నుంచి కిషన్ రెడ్డి చెప్పిన విధంగానే లోక్ సభలో కూడా ప్రభుత్వం అది తనకు సంబంధం లేని విషయం అని చెప్పగలుగుతుందా? మణిపూర్ భారత్ లో అంతర్భాగమే కదా? మరి అటువంటప్పుడు నెలల తరబడి ఆ రాష్ట్రంలో హింసాకాండ రాజ్యమేలుతుంటే.. జాతుల మధ్య ఘర్షణలో వందల సంఖ్యలో జనం నేలరాలుతుంటే కేంద్రానికి బాధ్యత లేదా? మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా కార్యాచరణ రూపొందించకుండా మౌనం వహించడమేంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రేపో మాపో పవన్, చంద్రబాబు భేటీ?

ఏపీలో ఎన్నికల మూడ్ ఎప్పుడో వచ్చేసింది. దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అధికార వైసీపీ మరోసారి   అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తుంటే..   ప్రభుత్వ వైఫల్యాలను  ఎండగడుతూ విపక్షం ప్రజలలోకి వెడుతోంది.  ఇక ఇప్పటికీ జనసేన, తెలుగుదేశంల పొత్తు విషయంలో మాత్రం సస్పెన్స్ వీడలేదు.  ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటున్నా పొత్తుల వ్యవహారం మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. జనసేన-బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు అయితే  ఈ రెండు పార్టీలు తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అన్నవిషయంలో మాత్రం ఎడతెగని చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలలో సాగుతోంది.  జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇప్పటికే జనసేనాని, ప్రభుత్వ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అనడం ద్వారా పరోక్షంగానైనా పక్కా క్లారిటీతో చెప్పేశారు.   తెలుగుదేశం, బీజేపీల మధ్య మాత్రం ఆ సంకేతాలు కనిపించడం లేదు. ఆ మధ్య హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ అవ్వడంతో దాదాపుగా పొత్తు ఖరారైనట్లేనని అప్పట్లో ఓ లెవెల్ లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ అది ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే  తెలుగుదేశం,బీజేపీ కలిసే పరిస్థితి  లేదనే  భావనే కలుగుతోంది.   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కాలంలో తన ప్రసంగాలలో ఎక్కడా ఈ పొత్తుల ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలకు, పాత మిత్రులకూ కూడా  ఆహ్వానాలు అందాయి. అయితే  తెలుగుదేశంకి మాత్రం అందలేదు. అదే సమయంలో ఈ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ పొత్తులపై వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో సహజంగానే మరోసారి ఈ పొత్తుల వ్యవహారంపై ఆసక్తి మొదలైంది. కాగా, ఢిల్లీ సమావేశానికి హాజరైన పవన్ పొత్తుల అంశంపై ఎక్కడా స్పందించడం లేదు. రాబోయే ఎన్నికలలో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా.. రెండూ కలిసి తెలుగుదేశంతో కలిసి వెళ్తాయా అన్న ఆసక్తి కొనసాగుతుండగానే పవన్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారనే సమాచారం ఒకటి బయటకు వచ్చింది.  రెండు మూడు రోజుల్లోనే మూడు రోజులలోనే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని తెలుగుదేశం-జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం.  దీంతో ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారు? అనే విషయం ఇప్పుడు  రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నది.  ఢిల్లీ టూరులో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన పవన్.. ఆ వివరాలను చంద్రబాబుతో షేర్ చేసుకోవటంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనసేన ఎప్పటి నుండో బీజేపీతో కలిసే ఉంది. కానీ  గడచిన నాలుగేళ్ళలో కానీ లేదా రీసెంట్ వారాహి యాత్రలో కానీ పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తెచ్చిన సందర్భం లేదు. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా జనసేనకు ఓట్లేయండి అని మాత్రమే చెబుతున్నారు.  బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో మూడుసార్లు భేటీ అయ్యారు. కానీ, ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత మాత్రం పవన్.. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించమనే కోరుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎన్డీయే అంటే బీజేపీ-జనసేన మాత్రమే. మరి ఎన్డీయేలో లేని టీడీపీ అధినేతతో పవన్ ఎందుకు కలుస్తున్నారు? ఈ భేటీలో ఏం తేల్చనున్నారు? ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయ సమీకరణాలలో  ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. 

చీలికలు పీలికలుగా తెలంగాణ బీజేపీ

సిద్ధాంతానికి, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ పరిస్థితి తెలంగాణలో మాత్రం ఇతర పార్టీలకు ఏ మాత్రం భిన్నం కాదు అనేలా తయారైంది.  పార్టీలో ఎవరి దారి వారిదే.. ఎవరి మాట వారిదే అన్నట్లుగా తయారైంది. గ్రూపు తగాదాలు, అసమ్మతి గళాలు, అసంతృప్తి జ్వాలలతో ఆ పార్టీ తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసి అదే వేగంతో నేలకు పడిన కెరటంగా మారింది.  రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఇంతగా పతనావస్థకు చేరడానికి రాష్ట్రంలో గ్రూపు తగాదాలను స్వయంగా పార్టీ అధిష్ఠానం పెంచి పోషించడమే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితి కప్పల తక్కెడగా తయారైంది. ఒక్కో నాయకుడిదీ ఒక్కో గ్రూపు అన్నట్లుగా పార్టీ రాష్ట్రంలో చీలికలు పీలికిలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. పార్టీ రాష్ట్ర నేతలు అధిష్ఠానం పిలుపు మేరుకు, లేదా వారంతట వారు హస్తిన వెళ్లి మరీ  ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాముఖంగా వెల్లడించారు. ఆ సభ పార్టీలోని గ్రూపు తగాదాలను కళ్లకు కట్టింది. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి చేసేది చేయగలిగిందీ ఏమీ లేదని తేటతెల్లం చేసింది. ఈ సభ ఇలా రసాబాసగా మారిన వెంటనే హై కమాండ్ రంగంలోకి దిగింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మళ్లీ బండి సంజయ్ కే అక్షింతలు వేసింది. అవమానాన్ని పంటి బిగువున భరిస్తూ ఇంత కాలం నెట్టుకొచ్చిన ఆయన మళ్లీ అధిష్ఠానం తననే తప్పు పట్టడంతో తన అసంతృప్తిని దాచుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసి బన్సల్ తో సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. కిషన్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తాననీ, పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అందరూ పని చేయాలని పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తనను తప్పించిన తరువాత కూడా చెబుతూ వస్తున్న బండి ఇకపై ఆ మాట అనే అవకాశాలు లేకపోవచ్చునని అంటున్నారు. ఇక పరిశీలకులైతే అయితే ఆయన కమలం గూటిని వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అందుకు నేడో రేపో పార్టీ నుంచి వీడుతారని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బండికి మద్దతుగా మాట్లడడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికీ   రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత నుంచీ ఆయన బీజేపీలోనే  కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఇమడలేక ఎప్పుడు బయటకు వద్దామా అని ఎదురు చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. అయినా ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తనను కాదని రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడమేనని అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇక కోమటిరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు గణనీయంగా మారాయి. అప్పట్లో రేవంత్ కు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన అసంతృప్తి ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు తెరవేనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారని బీజేపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఈ తరుణంలో కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బండి ప్రసంగం, దానికి కోమటిరెడ్డి మద్దతు పలకడం చూస్తుంటే.. బీజేపీకి రాష్ట్రంలో మరో గట్టి షాక్ తప్పదన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

కర్ణాటకలో కాంగ్రెస్ పై సమరమే

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని జెడిఎస్ నేత కుమార స్వామి, మాజీ ముఖ్యమంత్రి  బొమ్మయ్ ఒకే వేదిక మీద మాట్లాడటం చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నైస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ డిమాండ్‌ చేశాయి. విధానసౌధలోని జేడీఎస్‌ కార్యాలయంలో  మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, బసవరాజ్‌బొమ్మై సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. టోల్‌ రూపంలో ప్రజలను నైస్‌ కంపెనీ దారుణంగా వంచించిందని ఆరోపించారు. ‘నైస్‌’కు అదనంగా ఇచ్చిన భూమిని సైతం తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందేనన్నారు. నైస్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని అప్పుడే అక్రమాలకు సంబంధించిన నిజాలు వెలుగుచూస్తాయన్నారు. శాసనసభ సంయుక్త సభాసంఘం నివేదిక, ధర్మాసనం ఆదేశాలు నైస్‌ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నట్టు పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. నైస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే శాసనసభ బయటా, లోపల తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. నైస్‌ కంపెనీ రైతుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే అక్రమాలపై నెత్తీ నోరు బాదుకున్న సిద్దరామయ్య ఇప్పుడు చిత్తశుద్ధిని ప్రదర్శించాలని సవాల్‌ విసిరారు. ఇదే అంశంపై శాసనసభలో చర్చకోసం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా నిబంధన 69 కింద చర్చిస్తామని ప్రకటించినా అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర రైతుల, ప్రజల హితాన్ని గాలికి వదిలేస్తున్న, సామాన్యుల భూమిని కబ్జా చేస్తున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీని తలపిస్తున్న నైస్‌పై కాంగ్రెస్‌ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేస్తే ప్రభుత్వానికి రూ.30వేల కోట్లకుపైగా నిధులు మిగులుతాయన్నారు. నైస్‌ రహదారి ప్రాజెక్టులో అంతకు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం 2012లోగా కాంక్రీట్‌ రోడ్డు నిర్మించకపోతే అంతవరకు టోల్‌ వసూలు చేయరాదన్న నిబంధన స్పష్టంగా ఉందన్నారు. ఈ నియమాలను గాలికి వదిలి ఇంతవరకు సదరు కంపెనీ టోల్‌ పేరిట ప్రజలనుంచి రూ.1325 కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్నారు. నిర్దాక్షిణ్యంగా సదరు మొత్తాన్ని నైస్‌ కంపెనీ ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేశారు.

మళ్లీ తొడకొట్టి మీసం తిప్పాడు!

వైసీపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. జులై 21న ట్విట్టర్ వేదికగా  ఏపీకి  ప్రత్యేక హోదా అంశంపై ఆంగ్లంలో ఇలా స్పందించారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పాతపడిన, విస్మరించిన అంశం కాదని.. కేంద్ర ప్రభుత్వం, అందులోని భాగస్వామ్య రాజకీయ పక్షాల వద్ద ఈ అంశాన్ని వైసీపీ ఎంపీలు లేవనెత్తడమే కాకుండా.. ఆయా రాజకీయ పార్టీలకు తరచూ గుర్తు చేస్తున్నారని.. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది మిగిలిన రాజకీయ పార్టీలకు ఓ ఎన్నికల స్టంట్ అయితే.. తమ పార్టీకి మాత్రం భావోద్వేగ సమస్య అని పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలపై  నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.   ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం కూడా లేదనీ,  అప్పుడే ఏ2 రాజకీయ నవ మోసాలకు తెర తీశారని నెటిజన్లు  అంటున్నారు.  2019 ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంపై మీ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారో.. మీకు గుర్తు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో.. అందులోని భాగస్వామ్య పక్షాల వద్ద ఈ అంశాన్ని మీ పార్టీ ఎంపీలు..  లేవనెత్తుతోన్నారని మీరు చెబుతున్నారని... ఈ విషయాన్ని మమ్మల్ని  నమ్మమంటారా? అంటూ   చురకలంటిస్తున్నారు.  గత ఎన్నికలకు ముందు.. పాదయాత్రలో 25కి 25 మంది ఎంపీలను ఇస్తే.. ఢిల్లీలో గద్దెనెక్కిన వారి మెడలు వంచి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని ప్రకటించిన వైయస్ జగన్... ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన తర్వాత   జగన్ ఆ ఢిల్లీ పెద్దల ఎదుట మెడలు ఎలా వంచుకుంటున్నారో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో అందరూ చూశారని సెటైర్లు వేస్తున్నారు. అయినా ఈ నాలుగున్నరేళ్లో రాష్ట్రం కోసం ఎంతగా.. ఎంత మేరకు  పోరాటం చేశారో.. అందరూ చూశారని వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి.. అటు పాదయాత్రలో.. ఇటు ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకొని... గద్దెనెక్కి.. నాడు ఇచ్చిన హామీల అంశాన్ని మరిచి పోవడమే కాకుండా.. మీ మాటలను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు సైతం పంగనామాలు పెట్టిన ఘనులు మీరంటూ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌తోపాటు విజయసాయిరెడ్డిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.  అంతదాకా ఎందుకు.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను.. కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. ఎదురుగా నిలబడి.. అడిగే సత్తా, దమ్ము మీకు ఉందా? అని జగన్ అండ్ కోకి వారు నేరుగా సవాల్ విసురుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులు తీసుకు రావడంతో చేతులెత్తేసిన మీరు.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడుతున్నారంటే.. మేము నమ్మాలా? అని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. తన పార్టీ గె విజయం కోసం సహకరించిన గులాబీ బాస్‌కు ధన్యవాదాలు తెలపడమే కాకుండా.. క్విడ్ ప్రో కోలో భాగంగా.. హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలకు సైతం కేసీఆర్‌కు ధారదత్తం చేయడం... దీంతో ఆ కారు పార్టీ అధినేత.. సదరు సచివాలయాన్ని కుప్పకూల్చి.. హుస్సేన్ సాగర్‌ ఎదురుగా ఇంకా చెప్పాలంటే.. రివర్ ప్రెంట్ మాదిరిగా భారీ సచివాలయాన్ని సైతం నిర్మించారని.. ఈ విషయం అయినా మీకు, మీ పార్టీ ప్రజా ప్రతినిధులకు గుర్తు ఉందా? లేదా? అంటూ వీరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ నాలుగున్నరేళ్లలో ఏపీలో పరిస్థితులు ఏంతగా దిగజారాయో.. అందరికీ తెలిసిందేనని .. అయినా 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున గెలిచిన లోక్‌సభ సభ్యులు ఎంత మంది..  వారి పేర్లు చెప్పమంటే చెప్పగలిగే స్థితిలో ఏపీ ప్రజలు దాదాపుగా లేరని.. మహా అయితే.. జగన్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీల్లో ప్రజలకు బాగా తెలిసిన వారు వెళ్ల మీద లెక్కపెట్టవలసి ఉంటుందని.. అందులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తప్ప మిగిలిన వారు ఎవరంటే.. చెప్పలేని  పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని... అదీకాక జగన్ సీఎంగా గద్దెనెక్కిన ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్... పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని.. ఆయన అలా వెళ్లిన ప్రతీ సారి ఏపీకి హోదా కోసమే అని దేశ రాజధానికి వెళ్లారని చెప్పినా చెప్పగల ఘటనా ఘటన సమర్థులు మీరంతా అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.   జగన్ ఎప్పుడు దేశ రాజధాని హస్తినకు ప్రయాణం కట్టినా.. సోదరుడు కడప ఎంపీ  అవినాస్ రెడ్డి కోస కోసమే అనే ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో వెరైటీ కామెంట్లతో వెల్లువెత్తుతోందని.. ఈ విషయాన్ని అయినా మీరు గమించి.. ఖండించిన దాఖలాలు అయితే నేటికి లేవని విజయసాయిరెడ్డికి నెటిజన్లు సూచిస్తున్నారు.  అయినా మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలి. అలా అందుకోవాలంటే.. ప్రజలతో, వారి మనోభావాలతో ముడి పడి ఉన్న అంశాలను.. మళ్లీ బయటకు తీసి.. సోషల్ మీడియా వేదికగా రోజుకు కొంత మోతాదులో డోస్.. పోస్ట్‌ చేస్తూ.. ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి... అలా అయితేనే.. మనం అనుకున్న కార్యక్రమం.. మనం అనుకున్నట్లుగా వర్క్ అవుట్ అవుతుందని.. ఆ క్రమంలోనే.. మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని విజయసాయిరెడ్డి ఇలా తెరపైకి తీసుకు వచ్చారని నెటిజన్లు ఓ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.