మాజీ మంత్రి బాలినేని గోడ దూకేస్తున్నారా? వైసీపీలో అనుమానాలు!
posted on Jul 31, 2023 @ 11:16AM
ఏపీ సీఎం జగన్ కు సమీప బంధువు, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయన అడుగులో అడుగేస్తూ నడుస్తూ వస్తున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా పార్టీలో ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తన మంత్రి పదవిని ఊడబీకడం నుంచి మొదలైన అసంతృప్తి ఆటుపోటుల్లా అప్పుడప్పుడు పీక్స్ వెళ్లడం.. తరువాత తాడేపల్లి బుజ్జగింపులతో చల్లారడం జరుగుతూ వస్తోంది. మధ్యలో ఒక సారి తాను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పని చేస్తారనీ, అంతకు మించి పార్టీ బాధ్యతలను చేపట్టే ఉద్దేశం లేదని చెప్పారు.
జిల్లా సమన్వయ కర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంత మాత్రాన ఆయన జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా విపక్ష తెలుగుదేశంపై విమర్శల విషయంలో మాత్రం చురుకుగానే ఉంటూ వస్తున్నారు. అయితే లోకేష్ యువగళం పాదయాత్ర ఎప్పుడైతే ప్రకాశం జిల్లాలో ప్రవేశించిందో అప్పటి నుంచీ వైసీపీ శ్రేణుల్లో బాలినేనిపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో కొనసాగితే ఆ జిల్లాలో.. ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.
ఆయా మంత్రలు, నేతలు, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో, ఒంగోలు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగినా ఆయన బాలినేనిని పన్నెత్తు మాట అనలేదు. చిన్న పాటి విమర్శ చేయలేదు. బాలినేనిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావించనే లేదు. దీంతో బాలినేనిపై వైసీపీ వర్గాలలో అనుమానాలు బయలుదేరాయి. ఆయన గోడ దూకి దేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ మారే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని ఆరాతీశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
లోకేష్ తనను విమర్శించకపోవడం కూడా తన తప్పేనా అని బాలినేని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తరచే తనను అవమానించడం రివాజుగా మారిపోయిందని బాధపడుతున్నారు. సొంత పార్టీ వారే తనను టార్గెట్ చేసి జగన్ వద్ద బ్యాడ్ చేస్తున్నారన్నది బాలినేని ఆవేదనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మొత్తం మీద బాలినేని తెలుగుదేశం గూటికి చేరి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు నుంచి లోక్ సభ బరిలో దిగుతారన్న ఊహాగానాలైతే వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలకు బాలినేని ఒకింత దూరంగా ఉండటాన్ని పార్టీ వర్గాలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. ఒంగోలు ఎంపీగా పోటీ కి ఫిక్సయ్యారన్న ప్రచారం జరుగుతోంది .