జగన్ మేనమామకు నో టికెట్!?
posted on Jul 29, 2023 @ 12:30PM
ఆంధ్రప్రదేశ్ లో మరో సారి అధికారంలోకి రావాలన్న తన ఆకాంక్ష నెరవేరే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని స్వయంగా చేయించుకున్న సర్వేలు, చివరాఖరికి ఐప్యాక్ నివేదికలు సైతం తేటతెల్లం చేస్తుండటంతో జగన్ నేల విడిచి సాము చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా కొత్త వారిని నింపి తన ఫేస్ వేల్యూతో వారిని గెలిపించుకునే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
టికెట్ల ఎంపిక విషయంలో తనకు తన, పర బేధం లేదని చాటేందుకు ముందుగా సొంత వారికే టికెట్ నిరాకరించే అవకాశాలున్నాయంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చేసిన జగన్ చాలామంది సిట్టింగులకు పార్టీ టికెట్లు ఇల్లే అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారని చెబుతున్నారు. అలా ఇప్పటికే టికెట్ దక్కే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు అందుకున్న వారిలో జగన్ స్వంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
కమలాపురం నియోజకవర్గంలో రవీంద్రనాథ్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉందనీ, వైసీపీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల అసంతృప్తి అవధులు దాటిన నేపథ్యంలో జగన్ స్వయంగా రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయనీ, నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కమలాపురం నియోజకవర్గంలో ముఖ్య నేతలను తాడేపల్లికి పిలిపించుకుని మరీ చర్చలు జరిపారనీ చెబుతున్నారు.
పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి తోడు నియోజకవర్గ ప్రజలలో కూడా రవీంద్రనాథ్ రెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమౌతున్నట్లు అందిన నివేదికల నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి జగన్ ఇప్పటికే వచ్చేశారని అంటున్నారు. అలాగే సీఎం జగన్ కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ రెడ్డి వంటి పలువురు నేతలకు కూడా ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.