ఏపీలో మరో పార్టీ.. ముహూర్తం ఎప్పుడంటే?
posted on Aug 1, 2023 @ 9:40AM
ఏపీలో ఇప్పటికే సుమారు పదికిపైగా రాజకీయాలు పార్టీలున్నాయి. ఇందులో ఐదు పార్టీలు మాత్రమే ప్రజలకు బాగా తెలుసు. ఒకటి అధికారంలో ఉన్న వైసీపీ, రెండు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, మూడు జనసేన. మరో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఇవి కాకుండా ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఏపీలో ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. వాటిలో ఈ మధ్యనే పుట్టుకొచ్చిన కొత్త పార్టీ భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) కూడా ఉంది. గతంలో జనసేనలో పనిచేసి, వైసీపీతో యుద్ధం చేసి, బీజేపీకి దగ్గరైన బోడె రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. దీంతో పాటు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఎప్పటి నుండో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసమని జై భీం పార్టీ, అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా రైతు సంక్షేమ పార్టీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు తెచ్చుకొనే పనిలో ఉన్నాయి. ఇవి కాకుండా బీఎస్పీ లాంటి ఇతర రాష్ట్రాలలో పుట్టి జాతీయ గుర్తింపు కోసం తపన పడే మరికొన్ని కూడా ఇక్కడ పోటీ చేస్తుంటాయి.
ఇక ఉన్నవి చాలవన్నట్లు మరో పార్టీ కూడా పుట్టుకొస్తున్నది. అదే పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి (పీఏఆర్ ఎస్‌పీ). ఈ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాల బాగు కోసమేనని ప్రత్యేకంగా వాళ్ళు ప్రకటించాల్సిన పని కూడా లేదు. ఈ పీఏఆర్ ఎస్‌పీ ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరులో అట్టహాసంగా పార్టీని ప్రారంభించనున్నట్టు ఆ సమితి కన్వీనర్ కటికల శివ భాగ్యారావు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో ఉన్నామని ,ఆ ప్రక్రియ పూర్తి కాగానే ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. పీఏఆర్ ఎస్‌పీ ఒక్కటే కాదు ఇలాంటి ఎన్నో పార్టీలు ఎన్నికలకు ముందు రావడం సహజమే. ప్రతిసారి ఎన్నికలకు ముందు బయటకి రావడం.. ఇతర పార్టీల రెబల్స్, అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసి పోటీ చేయిస్తూ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ వర్గాలు రెగ్యులర్ గా చూస్తున్నదే, చేస్తున్నదే.
అయితే ఈసారి ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. ఒకవైపు వైసీపీ, తెలుగుదేశం. జనసేన ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయ చందరంగం ఆడుతుంటే, బీజేపీ పై నుండి ఎవరిని దెబ్బకొట్టి పై చేయి సాధించాలా అని ప్రణాళికలు రచించుకుంటున్నది. ఈ క్రమంలోనే ఇలా కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటే సహజంగానే అటెన్షన్ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాటైన రామచంద్ర యాదవ్ బీసీవైపీ.. రాష్ట్రంలో బీసీల ఓట్లను చీల్చేందుకేనని గట్టి ప్రచారం జరుగుతున్నది. తెర వెనక బీజేపీ నడిపిస్తున్న డ్రామాగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇలా పీఏఆర్ఎస్పీ, జై భీం పార్టీలు ఎస్సీ, ఎస్టీ వర్గాలను టార్గెట్ చేసి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పార్టీల వెనక కూడా బలమైన శక్తులే ఉండే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ
వీటితో పాటు ప్రాంతాల ప్రాతిపదికన ఏర్పాటైన రాయలసీమ పార్టీలు, త్వరలో రాబోతున్న అమరావతి పార్టీలు కూడా బలమైన కారణం చేత రాబోతున్న పార్టీలే. ఇవన్నీ ఎంత మేరకు ఓట్లు చీల్చనున్నాయంటే ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. కానీ, పరిస్థితులు తారుమారైతే ఇవే పెద్ద పెద్ద పార్టీలకు కూడా చిక్కులు తెచ్చి పెడతాయి. గుర్తులలో పోలికలు, అసంతృప ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారి పోటీకి దిగడం.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అసంతృప్తి.. ఇవి ప్రభావం చూపి ఒక్కోసారి గెలుపోటములను కూడా తారుమారు చేస్తుంటాయి. ఈ క్రమంలో ఈసారి ఏపీలో వీటి ప్రభావం ఎవరిపై పడనుందో చూడాల్సి ఉంది.