కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు!
posted on Jul 31, 2023 @ 2:09PM
ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాదన వచ్చును, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అదేదో ..జోక్ అన్నట్లు కొట్టెయ వచ్చును, కానీ, కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి రగులుతోంది... ఇది నిజం. అయితే, ఎమ్మెల్యేల అసంతృప్తి ఇప్పటికిప్పుడు భగ్గుమనే పరిస్థతి లేదు. ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు, కాదంటే, నియోజక వర్గ ప్రజల్లో చులకన కా కూడదన్న ఆలోచనతో , పత్రికలలో ప్రచారం కోసం అసంతృప్తి రూట్ ఆశ్రయించి ఉంటే ఉండవచ్చును.
అయినా మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతోంది అనేది నిజమని కాంగ్రెస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. సెగ లేనిదే పొగరాదు ..స్వయంగా ముఖ్యమంత్రి సిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అసంతృప్తి ప్రస్తావన చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చిని పరిశీలకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీఎల్పీ సమావేశంలోనే మంత్రులకు క్లాసు తీసుకున్నారు. మంత్రుల పట్ల ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని, ఎమ్మెల్యేల ఫిర్యాదులను మంత్రుల ముందుంచి ... ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కుని గెలిచిన ఎమ్మెల్యేలు, నిండా రెండు నెలలు అయినా నిండకుండానే ఎందుకు నొప్పులు పడుతున్నారో, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మీడియాకు ఉప్పందిస్తునారు.
ప్రజల నమ్మకాల మేరకు పని చేయలేకపోతున్నామని, మా నియోజకవర్గ పనులపై ఇంఛార్జ్ మంత్రులు స్పందించడం లేదని, నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సీనియర్ నేత బీఆర్ పాటిల్ సహా 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆప్పట్లో అది ఫేక్ లేఖగా కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే తన ఆవేదన వెళ్లగక్కతూ సీఎం సిద్ధరామయ్యకు అదే తరహలో లేఖ రాశారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నానని... తనను కనీసం ఏదో ఒక మంత్రికి పీఏగానో, ఓఎస్డీగానో నియమించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో ఎమ్మెల్యే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ లేఖను వారో వీరో ఎవరో కాకుండా సీఎల్పీ సమావేశంలో స్వయంగా సిద్ధరామయ్య బయటపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారు. కాగా ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల అసంతృప్తిని వారి ఎదుటే బయట పెట్టడంతో సిఎల్పీ సమావేశంలో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అందుబాటులోకి రావడం లేదని ఫిర్యాదు చేశారని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. అయితే, తమ ఫిర్యాదుల్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఏ మంత్రిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.
అదలా ఉంటే, పాటిల్ లేఖపై సంతకాలు చేసినట్లు చెపుతున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకే లేఖ రాశామని చెప్పగా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారిని మందలించారు. అటువంటి వ్యూహాలకు పాల్పడకుండా నేరుగా ఫిర్యాదులను తన వద్ద ప్రస్తావించాలని ఆయన వారిని కోరినట్లు చెపుతున్నారు.
ఈ నేపధ్యంలోనే చన్నగిరి ఎమ్మెల్యే తన అభ్యర్థనపై ఎటువంటి స్పందన రాలేదని, కాబట్టి తనను ఓఎస్‌డీ లేదా ఏ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించాలని సీఎంను అభ్యర్థించారు. అయితే, తర్వాత ఈ లేఖ ఓ జోక్ అంటూ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.అయితే ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం ఏమంటే..ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలు ఆనుకున్న విధంగా సాగకపోవడతో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలలో అసంతృప్తి అగ్గి రాజుకుందని అంటున్నారు.అయితే. ఈ మొతం వ్యవహారానికి కొసమెరుపు ఏమంటే, నిధుల కొరతను కారణంగా చూపించి ఈ ఏడాదికి హామీల అమలు విషయంలో సర్దుకుపోవాలని, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ చేతులేత్తశారు.