విపక్షాలకు వరద దెబ్బ.. షా ,ప్రియాంక పర్యటన వాయిదా
posted on Jul 29, 2023 @ 12:58PM
రాష్ట్రంపై సుమారు పక్షం రోజులకు పైగా కమ్ముకున్న ముసురు చాలా వరకు సర్డుమణిగింది. అయితే, ఈ వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంటల నష్టం, ఆస్తుల నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా డా సంభవించింది. ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా స్పష్టం కాకపోయినా, నష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు.
అదలా ఉంటే, రాష్ట్ర రాజకీయాలను వరుణ దేవుడు వదిలి పెట్టలేదు. రాజకీయ కార్యకలాపాల పై వర్షం ప్రభావం చూపింది. ఈరోజు ( జులై 29) న జరగ వలసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర (ఖమ్మం) పర్యటన వర్షం కారణంగానే వాయిదా పడింది. బీజేపీ రాష్ట్ర పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న‘విపరీత’ పరిణామాలు, అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనపై నేతలు, క్యాడర్ పెట్టుకున్న ఆశలపై వరుణ దేవుడు వర్షాన్ని కుమ్మరించారు. నిజానికి, గడచిన రెండు నెలల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడడడం ఇది రెండో సారి..గత నెల (జూన్)15 న ఖమ్మంలో జరప తలపెట్టిన భారీ బహిరంగ సభ, గుజరాద్ వరదల కారణంగా వాయిదా పడింది. ఇప్పదు ఈరోజు జరగ వలసిన సభ తెలంగాణ వరదల కారణంగా రద్దయింది.
అంతే కాదు, ఖమ్మ సభ రద్దయినా అమిత్ షా పర్యటనను హైదరాబాద్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో భగంగా అమిత్ షా .. పూర్తిస్థాయిలో రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ముందుగా రాష్ట్ర నేతలో భేటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటన ముగింపులో భాగంగా కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా ప్లాన్ చేశారు. అయితే, జూన్ 24 నుంచి మళ్ళీ కురిసిన వర్ష బీజేపీ నేతల ప్రయత్నాలకు బ్రేకులు వేశాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన నిరవధికంగా వాయిదా పడిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకటించారు. వాన బీజేపీనే కాదు, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. ఇక మొన్నీమధ్యే రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కదనోత్సాహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తాము నిర్దేశించుకున్న ప్రియాంక గాంధీ వధేరా పర్యటనను వాయిదా వేశారు. జులై 30న ప్రియాంక కొల్లాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరవ్వాల్సి వుంది. చాలా కాలంగా కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉద్దేశంతో కొల్లాపూర్ బహిరంగ సభను టీ.కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అదే సభలో మహిళా డిక్లరేషన్ పేరిట వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తమను గెలిపిస్తే మహిళల కోసం ఏం చేస్తామనే హామీలను గుప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయిదు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడ్డారని, చాలా ప్రాంతాల్లో కనీసం వారం రోజుల పాటు సహాయ చర్యలు నిర్వహించాల్సి వుంటుందని అందుకే ప్రియాంక పర్యటనను వాయిదా వేశామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు.
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలోనే చేరాల్సి వుండింది. కానీ, తన సొంత బలం చాటుకునేలా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని, పొంగులేటి రాహుల్ సమక్షంలో పార్టీలో చేరితే.. తాను ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావించారు. దానికోసం ప్రియాంక సమయమిచ్చే దాకా వెయిట్ చేశారు. ముందుగా జులై 20వ తేదీన కొల్లాపూర్ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీ దగ్గరపడుతున్నా ప్రియాంక రాక కన్ఫర్మ్ కాకపోవడంతో జూపల్లి ఒకింత కలవరపడినా.. చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యంతో ప్రియాంక రాకకు తేదీ ఖరారు చేశారు
. జులై 30న ఆమె వస్తారని, ఆమె సమక్షంలో జూపల్లి పార్టీలో చేరతారని ప్రకటించారు. అయితే.. ఈ ఏర్పాట్లకిపుడు భారీ వర్షాలు గండి కొట్టాయనే భావించారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో టీ.బీజేపీ, ఇటు ప్రియాంక రాక వాయిదాతో టీ.కాంగ్రెస్ నేతలు కాస్త నిరాశలో పడినట్లయ్యింది.