కూటమితో కాంగ్రెస్ బలపడేనా?
పేరు మారింది. కాంగ్రెస్ సారధ్యంలో దేశాన్ని పదేళ్ళు పాలించిన, ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ) పేరు మారింది. అవును, 2 024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ, కూటమిని ఓడించడమే లక్ష్యంగా బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కూటమికి కొత్త పేరును ఖరారు చేశారు. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్) గా నామకరణం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఎ పేరును ఎందుకు మార్చవలసి వచ్చింది? అనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పక పోయినా, యూపీఏ అనగానే భూమి ఆకాశాలను ఏకం చేసిన కుంభకోణాలు గుర్తుకు వస్తాయని, అరచేతిని అడ్డుపెట్టి యూపీఏ అవినీతి చరిత్రను హస్తం పార్టీ కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోందని,అందుకే పేరు మార్చారని కొందరు, కొత్త కూటమికి కాంగ్రెస్ సారథ్యం కొనసాగించడాన్ని కొందరు కొత్త పాత మిత్రులు వ్యతిరేకించడం చేత పాత కూటమికి కొత్త పేరు అవసరం అయిందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.
అదలా ఉంచి విషయంలోకి వస్తే, నెల రోజుల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో, జేడీయూ, అర్జేడీ సారథ్యంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశంతో పోలిస్తే, బెంగుళూరులో కాంగ్రెస్ సారథ్యంలో జరిగిన రెండవ సమావేశం ఒక ముందడుగుగానే భావించవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పాట్నా సమావేశానికి 15 పార్టీలు హాజరైతే బెంగుళూరు సమావేశానికి, ఏకంగా 26 పార్టీలు హాజరయ్యాయి. అంతకంటే ముఖ్యంగా, తొలి సమావేశంలోనే తలేగరేసి, కూటమిలో కొనసాగాలంటే అంటూ కాంగ్రెస్ పార్టీకి షరతులు విధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (పార్టీ) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించేంది లేదని, ఖారాఖండిగా చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగుళూరు సమావేశానికి హాజరు కావడం, కూటమి ముందడుగుకు మరో సాక్ష్యంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.
అయితే, ఇంకో కోణంలో చూస్తే, అటు కేజ్రీవాల్, ఇటు మమతాబెనర్జీ హాజరు వెనక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏదైనప్పటికీ అందుకు హస్తం పార్టీ భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది అనేది కాదన లేని నిజంగా కాంగ్రస్ నాయకులు అంగీకరిస్తున్నారు. అలాగే, ఢిల్లీ ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు స్థానిక నాయకులు, ఆర్డినెన్సు విషయం ఎలా ఉన్నా, ఆప్ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ తలొగ్గి ఆర్డినెన్సు విషయంలో అభిప్రాయం మార్చుకుందనే పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడడం స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆప్ డిమాండ్ చేసే వరకు ఆగకుండా ముందుగానే ఆర్డినెన్సును వ్యతిరేకించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఇప్పుడు ఆప్ ఓపెన్ గా కాంగ్రెస్ పేరు పెట్టి డిమాండ్ చేసిన తర్వాత సరే అని తల ఉపడంతో కాంగ్రెస్ పార్టీ ఆప్ ఆధిపత్యాన్ని అంగీకరించడమే అవుతుందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే బెంగుళూరు సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూపిన, ‘విదేయ’ పూర్వక అభిమానం బెంగాల్ కాంగ్రెస్ నాయకులనే కాదు, బెంగాల్లో కాంగ్రెస్ మిత్ర పక్షం సిపిఎం నాయకులకు కూడా చికాకు తెప్పించిడమే కాదు ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టేసిందని అంటున్నారు. ప్రతిపక్షం స్పేస్ ను పూర్తిగా బీజేపీకి వదిలేసి కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కు బీ టీమ్ లా వ్యహరించావాల్సి వస్తున్నదని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 మందికి పైగా సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక సంఘటలను, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే ఎక్కువగా విమర్శించాయి .ముఖ్యమంత్రి బెనర్జీ మీద మండి పడ్డాయి. మమత ప్రభుత్వం హింసకు పాల్పడిందని విమర్శించాయి. కానీ అంతలోనే మమతా బెనర్జీతో కాంగ్రెస్ అగ్రనాయకులు చెట్టా పట్టాలేసుకుని తిరగడం బెంగాల్ కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులకు రుచించడం లేదు.
అంతే కాదు మమతా బెనర్జీ వత్తిడి కారణంగానే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొత్త కూటమి సారథ్యం విషయంలో మౌనంగా ఉండి పోయిందని, చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ, కూటమి సారథ్యం కోరుకోవడం లేదని పేర్కొనవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్దంగా లేదని మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీని కూటమి సారథి (ప్రధాని అభ్యర్ధి) గా అంగీకరించేందుకు తృణమూల్ సిద్డంగాలేదని మమతా బెనర్జీ అనేక సందర్భాలలో స్పష్టం చేసిన నేపధ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూటమి నాయకత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టింపు లేదని చెప్పుకోవలసి వచ్చిందని బెంగాల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధినాయకత్వం పై రుసరుస లాడుతున్నారు.
ఈనేపధ్యంలో ఇండియాగా నామకరణం చేసుకున్న విపక్ష కూటమి కోసం కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇప్పటికే బీహార్ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు బీ టీమ్ గా సర్డుకుపోతున్న కురువృద్ద పార్టీ కాంగ్రెస్ భవిష్యత్ లో బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ యూపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్టనర గా అడ్జస్ట్ అవ్వక తప్పదనే నిర్ణయానికి వచ్చిందని ఇది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. అదే సముయంలో రేపటి ఎన్నికల్లో పొత్తులు, ఒత్తిళ్ళ కారణంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య కుదించుకు పోతుందని తద్వారా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిధి, పాత్ర మరింత కుంచించుకుపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది... ఇండియా కూటమి భవిష్యత్ ఏమిటి, హస్త రేఖలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడే చెప్పడం సరికాదాని అందుకు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు.